తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరిని సమర్థవంతంగా పనిచేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరికి ఇరువైపులా పులుల సంరక్షణ కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. రెండు రాష్ట్రాలకు చెందిన అటవీ శాఖ ఉన్నతాధికారుల సమావేశాన్ని జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (NTCA) అదిలాబాద్ లో నిర్వహించింది. మూడు ముఖ్యమైన టైగర్ కారిడార్లలో సమన్వయంతో రెండు రాష్ట్రాలు పనిచేయాలని నిర్ణయించారు. తిప్పేశ్వర్ – కవ్వాల్, తడోబా – కవ్వాల్, ఇంద్రావతి – కవ్వాల్ టైగర్ రిజర్వ్ లను నిత్యం పర్యవేక్షించాలని, సాంకేతిక సహకారంతో పాటు, సమాచారం కూడా ఇచ్చిపుచ్చుకోవాలని అధికారులు అవగాహనకు వచ్చారు. ముఖ్యంగా పులుల ఆవాసాన్ని రక్షించటం, పరిధిని విస్తరించటం, ఎదురౌతున్న సవాళ్లు, తక్షణం చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. రెండు అభయారణ్యాల్లో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడిన అధికారులు వారి అనుభవాలను, మెరుగైన పులుల ఆవాసాల ఏర్పాటు చర్యలపై సమీక్షించారు. ఇటీవల చోటుచేసుకున్న పులుల వేట, మరణాలు, వేటగాళ్ల నియంత్రణ, స్మగ్లింగ్ ముఠాల సమాచార మార్పిడిపై చర్చించారు. జనావాసాలకు సమీపంలో పులుల సంచారం, ఇతర శాఖలతో సమన్వయంపై జర్చ జరిగింది.
ఈ సమావేశంలో ఏ.కే. నాయర్, మెంబర్ సెక్రటరీ NTCA, మునీంద్ర, తెలంగాణ ఇంఛార్ఝ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ , నితిన్ కకోద్కర్, మహారాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, నిషాంత్ వర్మ, డీఐజీ NTCA, సురేంద్ర మెహ్రా డీఐజీ NTCA , పెంచ్, తడోబా, కవ్వాల్ పులుల అభయారణ్యాలకు చెందన ఫీల్డ్ డైరెక్టర్లు గోవికర్, ప్రవీణ్, వినోద్ కుమార్, అభయారణ్యం పరిధిలో ఉన్న రెండు రాష్ట్రాలకు చెందిన డీఎఫ్ఓ, ఎఫ్ డీ ఓ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.