నిజామాబాద్‌ అతి ఖరీదైన ఎన్నికలు…


అతి ఖరీదైన ఎన్నిక

*నిజామాబాద్‌లో నిర్వహణ ఖర్చు 35 కోట్లపైనే

*25 వేల ఈవీఎంలు, 1788 వీవీ ప్యాట్లు

*అందుబాటులో 400 మంది ఇంజనీర్లు, సిబ్బంది

*అత్యవసర సమయంలో హెలికాప్టర్‌ వినియోగం

*ఉదయం 8 నుంచి సాయంత్రం 6వరకు పోలింగ్‌

దేశంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గంగా రికార్డు సృష్టించిన నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం.. ఎన్నికల నిర్వహణ వ్యయంలోనూ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. సాధారణంగా లోక్‌సభ స్థానం పరిధిలోని ఒక్కో సెగ్మెంట్‌కు రూ.3కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉండగా.. నిజమాబాద్‌లో ఈ ఖర్చు రూ.5కోట్లు దాటే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. ఈ లెక్కన నిజామాబాద్‌ పరిధిలో ఎన్నికల నిర్వహణ ఖర్చు రూ.35 కోట్లు దాటుతుందని భావిస్తోంది. మొత్తం 1788 పోలింగ్‌ కేంద్రాల్లో ఒక్కో వీవీప్యాట్‌, ఒక్కో కంట్రోలింగ్‌ యూనిట్‌తోపాటు 12 చొప్పున మొత్తం 25వేలకుపైగా ఈవీఎంలు వినియోగిస్తున్నారు. సాధారణంగా ఒక పోలింగ్‌ కేంద్రంలో నలుగురు సిబ్బందిని నియమిస్తున్న ఈసీ.. ఇక్కడ మాత్రం మరో ఇద్దరు ఉద్యోగులను అదనంగా కేటాయించింది. ఈ లెక్కన అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కలిపి సిబ్బంది సంఖ్య 9వేలు దాటనుంది.

వీరితోపాటు పర్యవేక్షణ కోసం సెక్టోరియల్‌ అధికారులు, నోడల్‌ అధికారులు, మండల స్థాయి పరిశీలకులు, ప్రత్యేక పరిశీలకులను నియమించనుంది. ఈవీఎంలను పరిశీలించేందుకు హైదరాబాద్‌, బెంగళూరు నుంచి 150 మంది ఇంజనీర్లు నిజామాబాద్‌కు వచ్చారు. పోలింగ్‌ రోజున సుమారు 400 మంది ఇంజనీర్ల సేవలను వినియోగించుకోనున్నారు. 185 మంది అభ్యర్థుల వివరాలతో ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌ రోజు ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే మార్చడానికి హెలికాప్టర్‌ను సైతం సిద్ధంగా ఉంచుతున్నారు.

పోలింగ్‌ వేళల్లో మార్పు: సీఈవో

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో పోలింగ్‌ వేళలను సవరించినట్లు సీఈవో రజత్‌కుమార్‌ తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుందని చెప్పారు. సాయంత్రం 6 గంటలలోగా క్యూలో నిల్చున్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు. నిజామాబాద్‌లో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన.. ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఓటరు స్లిప్పులు, ఎపిక్‌కార్డుల పంపిణీ 95 శాతం పూర్తయినట్టు చెప్పారు. విధుల్లో ఆర్మీ మాజీ సిబ్బందిని వినియోగించుకోవడానికి ఈసీ అనుమతి ఇవ్వలేదని తెలిపారు.

About The Author