చంద్రబాబు గారూ…బ్యాలెన్స్ తప్పుతున్నారు !!..ఈ సీ

చంద్రబాబు గారు బ్యాలెన్స్ తప్పుతున్నారు.ఎన్నికల ముందు కూడా ఎంతో
అసహనంతో ఎన్నికల కమీషన్ కు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.
స్వయంగా రాష్ట్ర ఎన్నికల అధికారి దగ్గరకు వెళ్ళి,మందలించినంత పని
చేశారు.ఇప్పుడు ఎన్నికల అంకం ముగిసింది.ఎన్నికల కమీషన్ పనితీరు
బాగోకుంటే నిరసన తెలుపొచ్చు.ఎన్నికల సంఘాన్నికలిసి మీ అభియోగాల్ని
తెలపొచ్చు.కానీ ఎన్నికల కమీషన్ తీసుకున్న చర్యల్ని ప్రశ్నించడం,ఎన్నికల
కమీషన్ చేసిన మార్పు చేర్పులపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు
సబబు? మీరు ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రే (ఆపధ్ధర్మ ).అంత పెధ్ద పదవిలో
వున్న మీరు సంయమనం కోల్పోతే ఎలా? మీరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనంత
మాత్రాన మీ పార్టీకి చెందని వారిని పరాయీలుగా చూడటం తగదు.సిఎం అంటే
అందరికీ చెందినవారు.పార్టీ వేరు.ప్రభుత్వం వేరు.మీరు పార్టీనే ప్రభుత్వం చేశారు.
సిఎంగా వుండాల్సిన మీరు పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.మీ వ్యవహార
శైలి తీవ్ర అభ్యంతరకరంగా వుంది.

సిఎస్ కోవర్టా…!

తమ ఆదేశాల్ని బేఖాతరు చేసినందుకు ఎన్నికల కమీషన్ సిఎస్ పునేతా ను మార్చింది.
ఆ స్థానంలో సీనియర్, అనుభవజ్ఞుడైన సుబ్రహ్మణ్యంగారిని సిఎస్ గా నియమించింది.
మీకు సిఎస్ ను మార్చడం కోపం తెప్పించింది.మరి తమ ఆదేశాల్ని కాదని స్వతంత్ర
నిర్ణయాలు తీసుకునే అధికారిని ఏంచేయాలి.?‌ సిఎంగా మీ నిర్ణయాన్ని కాదంటే మీరైతే
ఏం చేస్తారు.నెత్తినబెట్టుకోరు కదా? కమీషనూ అదే చేసింది.మాటవినని సిఎస్ ను బదిలీ
చేసి,ఆ స్థానంలో మెరిట్,సీనియారిటీ ప్రకారం సుబ్రహ్మణ్యం గారిని నియమించింది.
దాంతో మీకోపం మరీ ఎక్కువైంది.సుబ్రహ్మణ్యం గారు మీ తసమదీయుల జాబితాలో
వున్నారు.అందువల్ల ఆయన నియామకం మీకు నచ్చలేదు.సరికదా..కంటకంగా కూడా
వున్నట్లుంది.అంతమాత్రాన ఓ సిఎస్ ను “కోవర్ట్ “అని ఆరోపించి,అవమానించడం
మీ హోదాకు తగిన వ్యాఖ్యకాదు. ఇంతకూ ఆయనెవరికోవర్టు? జగన్తో పాటు కేసుల్లో
వున్నాడు కాబట్టి ఆయనను జగన్ ఖాతాలో వేసి,కోవర్ట్ ను చేశారు.సుబ్రహ్మణ్యం గారిపై
కేసు కొట్టేసిన సంగతి మీకు తెలియంది కాదు.ఆయనమీదనే కాదు చాలామంది ఐఎఎస్
లపై కోర్టు కేసుల్ని కొట్టేసింది.అలాంటిది జగన్ కు సిఎస్కు సంబంధం అంటగట్టి ఇలా
బహిరంగంగా ఆరోపించడం ఖచ్చితంగా తప్పే.ఓ ముఖ్యమంత్రి స్థాయిలో వున్నరన్న
సంగతిని మీరు గుర్తుంచుకోవాలి.

నాఓటు ఎటు పడిందో…?

“నా ఓటు ఎవరికి పడిందో. నాకేతెలీదు.ఏపార్టీకి వెళ్ళిందో “ ? అంటూ మీరు వ్యంగ్యంగా
వ్యాఖ్యానించడంకూడా హుందాగా లేదు.ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రక్రియ,నిర్వహణ ప మీకు
ఏమాత్రం విశ్వాసం,నమ్మకం లేనట్టుగా అనిపిస్తున్నాయి.రాజ్యాంగం ప్రసాదించిన పదవిలో
వున్న మీరుఅదే రాజ్యాంగం ఏర్పాటుచేసిన ఎన్నికల కమీషన్ ను ఇలా అపహాస్యం చేయడం
మీకుతగునా?

కొసమెరుపు….!!

“వచ్చేనెల 23 వతేది మంచి ముహూర్తం చూసుకొని ప్రమాణం చేస్తాను “అని మీరు సగర్వంగా
ప్రకటించారు.అంటే ఈ ఎన్నికల్లో మీ పార్టీ విజయం సాధిస్తుందన్న సంపూర్ణ విశ్వాసం వుండ
బట్టే మీరీ ప్రకటన చేసివుంటారు.అంటే మీ పక్షాన ఆలోచిస్తే ఎన్నికల ప్రక్రియ సజావుగా వున్నట్లే.
ఒకవేళ అదే జరిగితే…’ మీరు రిగ్గింగ్ చేసి దౌర్జన్యం చేసి,డబ్బుపంచి గెలిచారని మీ ప్రతిపక్షపార్టీ
ఆరోపిస్తుంది.ఎన్నికల కమీషన్ మీకు సహకరించిందని కూడా ఆరోపించవచ్చు.అప్పుడు మీరే
మంటారు?

ఎన్నికల కమీషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగసంస్థ.దాన్ని అలానే వుంచండి.
దయచేసి రాజకీయాల్లోకి లాగి నీరు కార్చొద్దని మనవి.!!

About The Author