సీతారాములు…సీతా రాములనే ఆదర్శమైన జంటగా ఎందుకు చెప్పారు ?


లోకంలో ఎందరో అన్యోన్యంగా ఆనందంగా ఉంటున్న దంపతులున్నా,
సీతా రాములనే ఆదర్శమైన జంటగా ఎందుకు చెప్పారు ? వీరి జంటే మానవులందరికీ ఎందుకు ఆదర్శ ప్రాయ మైంది ? అన్న విషయాన్ని తెలుసుకోవలసిన అవసరమున్నది.

మన మహర్షులు ఏర్పరచిన మానవ జీవన వ్యవస్థ సర్వ మానవాళికీ ఆదర్శము. ప్రతి వ్యక్తి తన ఆత్మోన్నతికీ, పరమాత్మ ప్రాప్తికీ ప్రయత్నిస్తూనే సంఘ శ్రేయస్సుకు పాటుపడేలా, ప్రతి వ్యక్తి మనస్సుకు శాంతి సంతృప్తులు కలిగేలా పటిష్ఠమైన కుటుంబ వ్యవస్థను, వివాహ బంధాన్ని ఏర్పరచి, నిత్య నైమిత్తిక కర్మలతో కూడిన జీవన విధానాన్ని ఏర్పరచి విశ్వశాంతికి మార్గం చూపించారు. సర్వే జనాః సుఖినో భవంతు అన్నది హైందవులందరి ఆశయము. ఆ ఆశయ సిద్ధికి ప్రధానము గృహస్థాశ్రమ ధర్మము. గృహస్థాశ్రమ సార్ధకత అన్యోన్యమైన ప్రేమ కల దంపతుల వల్లనే సాధ్యపడుతుంది. అంటే దాంపత్యం వల్లనే సిద్ధిస్తుంది. అటువంటి దంపతులలో మన సర్వ మానవ జాతికీ ఆదర్శము సీతారాములే ! అందుకే కొత్తగా పెళ్ళి చేసుకున్న జంటను కానీ, పెళ్ళి రోజును జరుపుకుంటూ నమస్కరించిన జంటను కానీ సీతారాములలా అన్యోన్యంగా వర్ధిల్లమని ఆశీర్వదిస్తారు.

విశ్వములో మొదటి జంట పార్వతీపరమేశ్వరులు. వారి సంతానమైన మనమందరమూ ఉద్భవించినది వారిలోనుంచే ! మనందరికీ ఆదర్శము వారే ! శివ పార్వతులు అర్ధనారీశ్వరులయి, లోకంలో భార్యాభర్తలు అలా ఉండాలని తెలియజేశారు. విశ్వ సృష్టి, స్థితి కారకులైన, విశ్వ నిర్వాహకులైన దేవతలు సృష్టికి ప్రథమ దంపతులు. అందుకే పూజ ప్రారంభంలో – ఉమామహేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః,
వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః అని దేవతా దంపతులకు నమస్కరించి, తరువాత అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః అని ఋషి దంపతులకు నమస్కరించి, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః అని మానవుల జంటలో సీతారాములకు నమస్కరిస్తాము. ఇది దంపతులలో శ్రేష్ఠులకు నమస్కరించి వలసిన పద్ధతి.

ముందు అవినాభావంగా ఒకరి దేహంలో ఒకరు ఇమిడి పోయిన త్రిమూర్తులు, త్రిశక్తులు ఆది దంపతులుగా ఆదర్శమూర్తులు. వారిలో కూడా అదే వరస ఎందుకంటే, ఈశ్వరుడు తన దేహంలో అర్ధ భాగం అమ్మవారికి ఇచ్చేశాడు కనుక ప్రథమ స్థానం, లక్ష్మీదేవిని హృదయంలో దాచుకున్నాడు కనుక రెండవ స్థానం, తన నోటిలో – వాక్కులో తన భార్యను సరస్వతీ మాతను పెట్టుకున్నాడు కనుక మూడవ స్థానం బ్రహ్మసరస్వతులది.

వారి తరువాత దేవతలందరి పక్షాన దేవతల రాజైన దేవేంద్రుని ఆయన భార్య అయిన శచీదేవిని ఆదర్శ దంపతులుగా కొలవాలి. ఇక్కడి వరకు దేవతల దంపతులు.

వీరి తరువాత మహర్షుల దంపతులకు ప్రతినిధులుగా సప్తర్షులలో అత్యంత ఆదర్శ దంపతులైన అరుంధతీ వసిష్ఠులకు సర్వ మానవ దంపతులూ నమస్కరించవలసినదే ! మహర్షి దంపతులలో వారే ఆదర్మము. ఆకాశంలో సప్తర్షి మండలంలో సప్తర్షులు ఒక చోట కనిపిస్తారు. వారిలో వసిష్ఠ మహర్షితో పాటు ఆయన భార్య అరుంధతీ దేవి కూడా నక్షత్ర రూపంలో ఆయన పక్కనే ఉంటూ, తన భర్తని విడవకుండా, ఆయనతో కలిసి సంచరిస్తూ ఉంటుంది. కనుకనే వారు ఋషి దంపతులలో ఆదర్శ దంపతులు.

ఇంక మానవ దంపతులలో సావిత్రీ సత్యవంతులు, నలదమయంతుల వంటివారెందరున్నా, సీతారాములే ఆదర్శ దంపతులు. మానవులుగా పుట్టి, మానవ దంపతులుగా జీవితము గడిపిన వారిలో సీతారాములే ఎందుకు ఆదర్శ దంపతులంటే, పెద్దలు నిర్ణయించి పరిణయము చేసినప్పటి నుంచి వారిరువురు కూడా దేహములు రెండుగా కనిపిస్తున్నా ఇద్దరూ ఒక్కరే అన్నట్లుగా జీవితాంతమూ మెలిగారు. ఆనాటి రాజులలో, రఘువంశ రాజుల్లో కూడా బహుపత్నీత్వం ఉన్నా, శ్రీ రామ చంద్రుడు ఏకపత్నీత్వ వ్రతాన్ని అవలంబించాడు. సీత వల్ల తాను కళత్రవంతుడినయ్యానని చెప్తాడు. భార్య అని చెప్పటానికి ఎన్నో పదాలు ఉన్నా, కళత్రము అనేది ఒక అద్భుతమైన పదము. కళత్రము అంటే, ఎవరు భార్య స్థానములో ఉండటం వల్ల ఆమె భర్త తను ఏ లోటూ, లోపమూ లేని సర్వ సుఖములను, శుభములను, శాంతినీ పొందుతున్నాననీ, ఇంక వేరే ఎవరి అవసరము లేని విధంగా ఆమె తనకు సౌఖ్యాన్ని కూర్చగలుగుతున్నదనీ భావిస్తాడో, ఆ భార్యను కళత్రము అంటారు. పరమ పతివ్రతా శిరోమణి అయిన సీతమ్మ కూడా శ్రీరాముని అలాగే ఆయనే తన సర్వస్వమని భావిస్తుంది. ఛాయేవానుగతా తవ అని చెప్తారు. సీతమ్మ శ్రీ రామునికి నీడలా వెన్నంటి ఉంటుంది. శ్రీ రామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు తాను కూడా వస్తాననీ, తాను ముందు నడుస్తూ రాముడు నడిచే బాటలో ముళ్ళు ఏరి శుభ్రపరుస్తాననీ, వనవాస సమయంలో తన తల్లితండ్రులను స్మరించననీ, తన భర్తతో కలిసి ఉంటే, అరణ్యమే మహా సౌధంలా ఉంటుందనీ చెప్తుంది. మనోవాక్కాయ కర్మలతో తన భర్తే దైవంగా ఉపాసించిన పరమ రామ భక్తురాలు సీతమ్మ. అరణ్యవాసానికి వెళ్ళే ముందు కౌసల్యాదేవి సీతమ్మ తో ఈనాడు నీకు అరణ్యవాసం ప్రాప్తిస్తోందని నీ భర్తను చులకనగా చూడకమ్మా అని అన్నప్పుడు, వనవాస సమయంలో అరుంధతీ దేవి సీతమ్మకు పాతివ్రత్య ధర్మాలను చెప్తున్నప్పుడు సీతామాత తాను పుట్టింట్లోనే పాతివ్రత్య ధర్మాలను నేర్చుకున్నానని, తాను అలాగే ఉంటాననీ చెప్తుంది. సీతామాతను రావణాసురుడు అపహరించినప్పుడు భౌతికంగా భర్తకు దూరమైనా భర్త నామాన్నీ జపిస్తూ, భర్త క్షేమం కోసం తపస్సు చేస్తూ కాలం గడిపింది. రావణ వధానంతరం భర్తను చేరవచ్చిన సీతామాతను కన్నెత్తైనా చూడకుండా, ఏడాదిపాటు రావణుని చెరలో ఉన్నావని ప్రజలకు సందేహం రావచ్చనగానే సీతమ్మ తానే లక్ష్మణుని అగ్నిని ఏర్పాటు చెయ్యమని అగ్నిప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. ఆమెకు తన భర్తకు తన మీద ఉన్న నమ్మకము, ప్రేమ తెలుసు. కానీ రాజైన రాముడు ప్రజలకు సందేహం కలుగకుండా ఉండటానికే అలా చేశాడని తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. నిండు గర్భిణి అయిన సీతమ్మను గురించి ఒక కాముకుని చెరలో ఏడాది ఉన్నదని వదంతులు అయోధ్యావాసులలో వ్యాపించగా, శ్రీ రామచంద్రుడు రాజుగా ప్రజారంజనమే తన కర్తవ్యమని భావించి సీతమ్మను అరణ్యములో వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రాంతములో వదిలి పెట్టించినా, సీతమ్మ శ్రీరాముని బాధ్యతలను అర్ధం చేసుకున్నదే కానీ తన భర్తను తప్పు పట్టలేదు. దేశాన్ని పరిపాలించే రాజుకు రాజుగా బాధ్యతే ప్రధానమనీ, ఆ తర్వాతే భర్తగాను, ఇతర బాధ్యతలునని గుర్తించి, భర్తృధ్యాన పరాయణురాలయి లవకుశులను ఋష్యాశ్రమ పవిత్ర వాతావరణంలో వాల్మీకి మహర్షి సంరక్షణలో, శిక్షణతో పెంచి, పెద్ద చేసి, పిల్లలను భర్తకు అప్పగించి, మళ్ళీ తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటూ భూగర్భంలోకి వెళ్ళి పోయింది. అశ్వమేథయాగాన్ని చేత తలపెట్టిన శ్రీ రామచంద్రుడు భార్య పక్కన లేకుండా యాగం చెయ్యరాదు కనుక బంగారు సీత ప్రతిమను తన పక్కన కూర్చోపెట్టుకుని, తన భార్య మీద తనకున్న అచంచలమతన పవిత్ర ప్రేమను నిరూపించుకున్నాడు. జీవితంలో ఎన్ని ఒడుదైడుకులు సంభవించినా, సీతారాములిద్దరూ ఒకరితో ఒకరుగా, ఒకరికి ఒకరుగా నిలిచారు. ఇద్దరూ కలిసి మానవ ధర్మాలను, బంధాలు పటిష్టతను ఆచరించిన చూపించి, ఆదర్శంగా నిలిచారు. కనుకనే మానవ జాతికి ఎప్పటికీ ఆదర్శవంతమైన జంట అయ్యారు. పరిపూర్ణ మానవుడు శ్రీరాముడు. పరిపూర్ణమైన స్త్రీ సీతాదేవి. పరిపూర్ణమైన దంపతులు శ్రీ సీతారాములే సర్వ మానవ దంపతులూ ఆదర్శము.

About The Author