18 నుంచి 20వ తేదీలోగా నోటిఫికేషన్…. 23 రోజుల్లో పరిషత్ ఎన్నికలు పూర్తి …
నోటిఫికేషన్ విడుదలయ్యేవరకు ఓటు నమోదు
నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే బ్యాలెట్‌పత్రాల ముద్రణ:
రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు అన్నిఏర్పాట్లు పూర్తిచేశామని, ఈ నెల 18 నుంచి 20వ తేదీలోగా నోటిఫికేషన్ జారీచేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి, జిల్లాస్థాయి సమీక్షల అనంతరం నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. సోమవారం ఎస్ఈసీ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు వివిధ విభాగాల ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 20వ తేదీలోగా నోటిఫికేషన్ జారీచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అన్ని పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఓటరు జాబితాను విడుదలచేసినట్టు, గుర్తింపుపొందిన రాజకీయపార్టీలకు కూడా అందజేసినట్టు వివరించారు. నోటిఫికేషన్ జారీ అయ్యేవరకు ఓటునమోదు, మార్పులు, చేర్పులకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన జాబితా ప్రకారం రాష్ట్రంలో గ్రామీణప్రాంతాల్లో 1.56 కోట్ల మంది ఓటర్లున్నారని, ఈ జాబితాతోపాటు కొత్తగా ఓటుహక్కు పొందినవారి జాబితాను కూడా త్వరలోనే రూపొందిస్తామన్నారు. సప్లిమెంటరీ జాబితాలో వారి వివరాలు ఉంటాయని తెలిపారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ ముగిసిందని, ఈనెల 18న పోలింగ్‌కేంద్రాల తుది జాబితాను విడుదలచేస్తామని ప్రకటించారు. ఎన్నికలకు సంబంధించిన సామగ్రి మొత్తం సిద్ధంచేశామని, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి బ్యాలెట్‌బాక్స్‌లు తెప్పించినట్టు చెప్పారు. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో నిలిచే అభ్యర్థులు తేలాకే బ్యాలెట్‌పత్రాలను ముద్రిస్తామన్నారు. పోలింగ్ సిబ్బందికి నియామకపత్రాలు జారీచేశామని, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రతి మండలానికి ఒకరు, మూడు ఎంపీటీసీ స్థానాలకు మరొకరు రిటర్నింగ్ అధికారులు ఉంటారని చెప్పారు. మిగిలిన పోలింగ్ సిబ్బంది, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు రెండుమూడ్రోజుల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు.
23 రోజుల్లో ప్రక్రియ పూర్తి:
పరిషత్ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని 23 రోజుల్లో పూర్తిచేస్తామని నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 20లోగా అన్నిఏర్పాట్లు పూర్తవుతాయన్నారు. ఈ నెల 18 నుంచి 20లోగా నోటిఫికేషన్ ఇస్తామని, దీనిలో ఎన్ని దఫాలుగా నిర్వహిస్తాం, ఏయే మండలాల్లో ఎన్ని విడుతలు అనే పూర్తి వివరాలుంటాయన్నారు. మూడు విడుతల్లో పరిషత్ ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నామన్నారు. మొత్తం 1.80 లక్షల సిబ్బంది అవసరం ఉంటారని, విడుతలవారీగా నిర్వహిస్తుండటంతో సిబ్బంది సరిపడా ఉన్నారని వెల్లడించారు. ఓటు నమోదుకు స్పెషల్‌డ్రైవ్ ఉండదని, మార్పులు, చేర్పులు, కొత్త ఓటు నమోదుకు మాత్రం దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. గత పరిషత్ ఎన్నికల్లో పోటీచేసి లెక్కలు చూపించనివారి వివరాలు ఉన్నాయని, వారిపై నిఘా పెడుతామన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎంతమంది పోటీచేసినా ఎన్నికలు నిర్వహిస్తామని, నామినేషన్ల ఉపసంహరణ అనంతరమే బ్యాలెట్‌ను ముద్రిస్తామని చెప్పారు.
బ్యాలెట్ పత్రాల రంగు మారదు:
బ్యాలెట్ పత్రాల రంగుమారదని ఎస్ఈసీ నాగిరెడ్డి స్పష్టంచేశారు. ఎంపీటీసీ స్థానానికి గులాబీ, జెడ్పీటీసీ స్థానానికి తెలుపు రంగు పత్రాలు వినియోగిస్తామని, దీనిపై ఫిర్యాదులు చేసినా ఫలితం ఉండదని పేర్కొన్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణలో ఈ రెండు రంగులను ఎప్పటినుంచో వినియోగిస్తున్నామని.. ఇప్పుడు కొత్తగా రంగు మార్చేది లేదని స్పష్టంచేశారు. సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి (ఎఫ్ఏసీ) సునీల్‌శర్మ, ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ, పీఆర్ కమిషనర్ నీతూప్రసాద్, ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్, జయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.