ఇంటర్‌ ఫలితాల్లో ఎన్నో తప్పులు.. విద్యార్థులకు తిప్పలు…


ఎన్నో తప్పులు.. విద్యార్థులకు తిప్పలు
ఫలితాల్లో ఇంటర్‌ బోర్డు బోల్తా
ఈనాడు – హైదరాబాద్‌

* ఇంటర్‌మీడియట్‌ మార్కులను ఎప్పుడూ రెండు అంకెల్లో ఇస్తారు. విద్యార్థికి 9 మార్కులు వచ్చినా 09 అని రాస్తారు. ఈసారి అందుకు భిన్నంగా 9, 7, 8.. అని మాత్రమే ఇచ్చారు.
* 900 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు 11 మంది ఏదో ఒక సబ్జెక్టులో తప్పారు. ఇష్టారాజ్యంగా పరీక్షల మూల్యాంకనం చేయడం వల్లే ఇది జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.
* జాగ్రఫీ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలకు 50 మార్కులు ఉంటాయి. ఈసారి అవి కలపకుండానే మొత్తం మార్కులతో మెమోలు ఇచ్చారు.
* ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కులు, మొత్తం మార్కులు సరిచూస్తే పొంతన ఉండటం లేదు.

ఇక పాసైనా…తప్పినట్లు…. పరీక్ష రాసినా రాయనట్లు ఇలాంటి ఎన్నో తప్పులతడకలతో తెలంగాణ ఇంటర్‌బోర్డు విద్యార్థులను కన్నీళ్లు పెట్టించింది. ఫలితంగా వేలమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆగ్రహానికి గురవుతోంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని గ్రహించిన విద్యాశాఖ పలు జాగ్రత్తలు తీసుకున్నా సక్రమంగా ఫలితాలు ఇవ్వలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. హాల్‌టికెట్ల జారీ, ఫలితాల ప్రక్రియ అంతా ఈ ఏడాది గ్లోబరీనా అనే సంస్థ చేపట్టింది. ఆ సంస్థకు పెద్ద మొత్తంలో విద్యార్థులు ఉన్న చోట ఫలితాల విడుదలలో అనుభవం లేదన్న ప్రచారం సాగడంతో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి స్వయంగా ఇంటర్‌బోర్డును సందర్శించి ఫలితాల ప్రక్రియపై ఆరా తీశారు. అయినా సరే గందరగోళం తప్పలేదు. దాదాపు 21 వేల మంది ధ్రువపత్రాలపై ఏఎఫ్‌, ఏపీ అంటూ ముద్రించి విద్యార్థులను కలవరపెట్టారు. అయితే ఫలితాల విడుదల తర్వాత వెంటనే వాటిని సరిదిద్దామంటూ అధికారులు చెబుతున్నారు.

జేఎన్‌టీయూహెచ్‌ సహకారం తీసుకున్నా…
ఫలితాల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్న భావనతో విద్యాశాఖ సూచన మేరకు జేఎన్‌టీయూహెచ్‌ సహకారాన్ని కూడా ఇంటర్‌బోర్డు తీసుకుంది. జేఎన్‌టీయూహెచ్‌ పరీక్షల విభాగం సంచాలకుడు ఆచార్య కామాక్షిప్రసాద్‌ పలు మార్లు ఇంటర్‌బోర్డుకు వచ్చి సలహాలు అందించారు. అయినా పలు తప్పులు దొర్లడం గమనార్హం. ఇంటర్‌బోర్డులో అధికారుల మధ్య విభేదాల వల్ల కొందరు ఫలితాల ప్రక్రియపై పూర్తిగా దృష్టి పెట్టకపోవడం కూడా కారణమై ఉండొచ్చని తెలుస్తోంది.

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.
ఇలాంటి పరిస్థితి వస్తుందని మేం ఆరు నెలల క్రితమే హెచ్చరించాం. తప్పులు దొర్లితే బోర్డు కార్యదర్శే బాధ్యత వహించాలని కూడా గతంలో ప్రకటించాం. ఇప్పుడు అదే జరిగింది. ఇలాంటివి జరగకుండా వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.

– మధుసూదన్‌రెడ్డి, అధ్యక్షుడు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల సంఘం

About The Author