కొలంబోలో మరో రెండు పేలుళ్లు.. కర్ఫ్యూ విధింపు…
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలోని మూడు చర్చిలు, మూడు హోటళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు జరిగి సుమారు 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, దెహివాలాతో పాటు హౌసింగ్ కాంప్లెక్స్ ప్రాంతంలో బాంబు పేలుళ్లు సంభవించాయని, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు ప్రకటించారు.
తాజా పేలుడుతో ప్రజల్లో మరింత భయం నెలకొంది. మొత్తం ఎనిమిది చోట్ల జరిగిన ఈ బాంబు పేలుళ్లలో మృతి చెందిన విదేశీయుల సంఖ్య 35గా ఉందని తెలిపారు. ఈ పేలుళ్లలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయాలపాలైన వారిని సహాయక సిబ్బంది ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో అంబులెన్సులకు ట్రాఫిక్ జామ్ ఎదురు కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
*కర్ఫ్యూ విధింపు.. సామాజిక మాధ్యమాలు బంద్*
వరుసగా బాంబు పేలుళ్లు సంభవిస్తున్న నేపథ్యంలో కొలంబోలో తక్షణమే కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని వివరించింది. ఎవరినీ బయటకు రావద్దని హెచ్చరించింది. అంతేకాకుండా, వదంతులు వ్యాప్తి కాకుండా సామాజిక మాధ్యమాలను నిలిపివేసింది. బాంబు పేలుళ్లను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. నేషనల్ తోహీత్ జమాత్ (ఎన్టీజే) ఈ దాడులు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాంబు తనిఖీ బృందాలతో పలు చోట్ల పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు