ఏ స‌మ‌యంలో పూజ చేయాలి?

మన పూర్వికులు పూజా విధానాన్ని వివిధ రకాలుగా వర్గీకరించారు. 5,16,18,226 విధాలుగా పూజలనూనుసరించడం జరుగుతోంది. అసలు మెలకువ వచ్చిన వెంటనే భగవంతుని స్మరిస్తూ కుడి అరచేతిని చూసుకుంటూ కళ్ళు తెరవాలని చెప్పారు. అందుకనే ప్రభాత కాలంలో కరదర్శనం కల్యాణప్రదం.
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ
కరపృష్ఠే చ గోవింద: ప్రభాతే కరదర్శనం
ఇక పూజలకు, అర్చనలకు, ఉపాసనలకు సంధ్యా సమయం ఎంతో ఉత్తమమైనదని నిర్ణయించారు. త్ర్సంధ్యోపాసన అత్యంత ఫలదాయకమైనది. త్రిసంధ్యలను –
1. ప్రాత: సంధ్య
2. మధ్యాహ్నసంధ్య
3. సాయంసంధ్య అని మూడు రకాలుగా విభజించారు.

1. ప్రాత:సంధ్య – ఇది మరలా మూడు విధాలు. అ) ఉత్తమం (భ్రాహ్మీముహూర్తం) , ఆ) మధ్యమం (తారకా రహీం), ఇ) అధమం (సూర్యోదయం అనంతరం అంటే, సూర్యోదయానికి ముందు ఘడియలకు ముందన్నమాట.
2. మధ్యాహ్నసంధ్య – మిట్ట మధ్యాహ్నానికి ఒకటిన్నర ఘడియల ముందు, ఒకిన్నర ఘడియల తరువాత
3. సాయంసంధ్య – అ) ఉత్తమం, సూర్యాస్తమయానికి 3 ఘడియల ముందు , ఆ) మధ్యమం, సూర్యాస్తమయకాలం. ఇ) అధమం, నక్షత్రాలు కనిపించిన తరువాత.

అన్ని సంధ్యలలో బ్రాహ్మీమూహూర్తకాలమే ప్రశస్తమైనది. బ్రాహ్మీముహూర్తమంటే తెల్లవారుఝామున 3.30 గంటల నుండి 4.45 గంటల మధ్య సమయమని పెద్దల వాక్కు. బ్రాహ్మీముహూర్తసమయంలో ప్రకృతి సత్త్వగుణ స్వభావాన్ని కలిగి ఉంటుంది. మనస్సులు ప్రశాంతంగా ఉంటాయి. అందుకే ఈ సమయం జపతపాలకు చాల అనుకూలమైన సమయమని చెప్పబడింది. ఇక, ఘడియకాలన్ని ఒకరోజు సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు లెక్కగడతారు. ఒకరోజు సూర్యోదయం నుంచి మరుసటిరోజు సూర్యోదయం వరకు 60 ఘడియలకాలం. అంటే 30 ఘడియలు పగలైతే, మిగతా 30 ఘడియలు రాత్రన్నమాట. సూర్యోదయం నుండి 55 ఘడియలు అనంతరపు 5 ఘడియల కాలాన్ని ఉష:కాలమని, 57 ఘడియలు దాటిన తరువాత మూడు ఘడియల కాలాన్ని అరుణోదయకాలమని అంటారు. 58 ఘడియలు దాటిన తదనంతరపు 2 ఘడియల కాలన్ని ప్రాత:కాలమని అంటారు. ఆ ప్రాత:కాలం తరువాతే సూర్యోదయం. ఇలా పరిశీలించినపుడు 55 వ ఘడియ నుంచి 58 ఘడియల మధ్యకాలం పూజలు, జపధ్యానాదులకు ప్రశస్తమైన సమయంగా చెప్పబడుతోంది…

About The Author