మోదీ ఎందుకు మీడియా ముందుకు రారు?

దేశం అంతా సార్వత్రిక ఎన్నికల హడావుడిలో మునిగిఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారనివాసంలో కూర్చుని హిందీ సినిమాల హీరో అక్షయ్ కుమార్‌తో పిచ్చాపాటీ మాట్లాడారు. వారి మాటల్లోనే చెప్పాలంటే అది రాజకీయాలతో సంబంధం లేని ఇంటర్వ్యూ. దక్షిణ భారతం అంతా పోలింగ్ ముగిసిపోయి, ఉత్తర భారతంలో మరో నాలుగు దశల పోలింగ్ మిగిలిఉండగా మోదీ ఒక పెద్ద సెలబ్రిటీకి హిందీలో ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో రాజకీయాలు మాట్లాడి ఉండకపోవచ్చు. మోదీ వ్యక్తిత్వాన్ని ఒక పెద్ద కొండ అంచున నిలబెట్టే ప్రయత్నం మాత్రం జరిగింది. దీని వెనుక రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నదీ లేనిదీ అర్ధం చేసుకునేందుకు గొప్ప తెలివితేటలేం అక్కర్లేదు.
ఇప్పటివరకూ భారతదేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల్లో ఎవరూ అందుకోలేని ఘనత ఒకటి నరేంద్ర మోదీ సొంతం. అదేమిటంటే ఆయన గత అయిదేళ్ల కాలంలో ఇంతవరకూ ఒక్కటంటే ఒక్కటి కూడా విలేఖరుల సమావేశం నిర్వహించలేదు. మధ్యమధ్యలో బిజెపి లౌడ్ స్పీకర్లుగా ప్రపంచం మొత్తానికీ తెలిసిన అర్ణబ్ గోస్వామి, నావికా కుమార్ వంటి జర్నలిస్టులకు ఇంటర్వూలు ఇచ్చారు తప్ప పూర్తి స్థాయి మీడియా సమావేశాన్ని ఎదుర్కొనే సాహసం ఆయన చేయలేకపోయారు.
మౌనీబాబాగా పేరు తెచ్చుకున్న యుపిఎ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా మీడియాను ఎదుర్కొనేందుకు ఏనాడూ సందేహించలేదు. పైగా విదేశీ పర్యటనలకు వెళ్లేప్పుడు ముందు నుంచీ ఉన్న సంప్రదాయం ప్రకారం జర్నలిస్టులను వెంట తీసుకువెళ్లేవారు. తన ప్రత్యేక విమానంలో వారితో మాట్లాడేవారు. రకరకాల స్కాములు బయటకువచ్చి తాను, తన ప్రభుత్వం ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు కూడా మన్మోహన్ సింగ్ మీడియాకు ఏనాడూ మొహం చాటేయలేదు.
2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి సొంత బలంతో అధికారంలోకి వచ్చింది. దానికి 30 ఏళ్ల ముందు వరకూ ఎవరూ సాధించని ఘనత అది. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అవినీతి బాగోతాలు చూసి అలసిపోయిన ప్రజలు సమర్ధవంతమైన, పని చేసే ప్రభుత్వానికి పట్టం కడుతున్నామని అనుకున్నారు. మోదీ ప్రధాని పదవి చేపట్టారు. అంత ఘనమైన విజయం సాధించిన తర్వాత కూడా నరేంద్ర మోదీ మీడియాను ఎదుర్కోలేకపోవడం కొంచెం అర్ధం కాని విషయమే. అదేమిటి, “ఛప్పన్ ఇంచ్ కీ ఛాతీ” మీడియాను ఎదుర్కొనేందుకు పనికి రాదా అన్న అనుమానం రావడం కూడా సహజమే.
ఇక్కడ మోదీ నేపధ్యం గురించి ప్రస్తావించాలి. 2002 గోధ్రా అనంతర మారణహోమం ఆయన ఉదాశీనత వలనే జరిగిందని నమ్మేవారు చాలామంది ఉన్నారు. అది రుజువు కాలేదు. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. తమ కళ్లెదురుగానే దారుణాలు జరుగుతుంటే స్థానిక పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారనీ, కొన్ని సందర్భాలలో మూకలకు సహకరించారనీ మాత్రం రుజువయింది. పరిస్థితి భయంకరంగా తయారయిన సంగతి తెలిసి వాజ్‌పేయీ ప్రభుత్వం తమను హుటాహుటిన తరలిస్తే, గుజరాత్ ప్రభుత్వ యంత్రాంగం వాహనాలు సమకూర్చని కారణంగా 3000 మంది సైనికులు 34 గంటల పాటు అహమ్మదాబాద్‌ విమానాశ్రయానికి పరిమితం కావాల్సి వచ్చిందని అప్పుడు సేనలకు నాయకత్వం వహించిన లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా ఇటీవల విడుదలైన తన పుస్తకం (ద సర్కారీ ముసల్మాన్)లో తెలిపారు. తాను స్వయంగా ముఖ్యమంత్రి మోదీ ఇంటికి వెళ్లి సేనలను తరలించేందుకు ఏర్పాట్లు కోరిన తర్వాత కూడా యంత్రాంగం సహకరించలేదని ఆయన వాపోయారు.
వెయ్యి మందికి పైగా అమాయక ముస్లింలను – పిల్లలనీ, మహిళలనీ, వృద్ధులనీ తారతమ్యం పాటించకుండా – హిందుత్వ మూకలు ఊచకోత కోసినందుకు, అనేకమంది ముస్లిం మహిళలను సామూహికంగా మానభంగం చేసినందుకు, ఈ అమానుషం తాను ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినందుకు నరేంద్ర మోదీ ఏనాడూ క్షమాపణ చెప్పలేదు. ప్రత్యక్ష బాధ్యత ఉన్నదీ లేనిదీ పక్కన పెడితే పరోక్ష బాధ్యత స్వీకరించేందుకు కూడా ఆయన ఏనాడూ సిద్ధపడలేదు.
కానీ గుజరాత్ మారణహోమం ఆయనను వెన్నాడుతూనే ఉంది. ఆ తర్వాత నాలుగేళ్లకు ప్రముఖ టివి జర్నలిస్టు కరణ్ థాపర్‌కు మోదీ అహమ్మదాబాద్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో గోధ్రా అనంతర మారణకాండ ప్రస్తావన రాగానే మైక్ లాగేసి లేచిపోయారు. ఇలాంటి నేపధ్యం ఉన్న రాజకీయనాయకుడికి 2014లో దేశ ప్రజలు పట్టం కట్టారు. మోదీ చెబుతున్న గుజరాత్ మోడల్ ఏమిటో తెలియక పోయినా ఆయన ఏలుబడిలో బాగుపడతామని అనుకున్నారు. ఇప్పుడు మరో అయిదేళ్లు పాలించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్న నరేంద్ర మోదీ అందుకుగాను తాను గత అయిదేళ్లలో ఏం చేసిందీ వివరించడం లేదు. ఉగ్రవాదులను మట్టుపెట్టే శక్తి తనకొక్కడికే ఉందని ఛాతీ విరుచుకుని చెబుతున్నారు. బాలకోట్ మెరుపుదాడిని ఉదహరిస్తూ, సైనికుల పేరు మీద వోట్లు అడుగుతున్నారు. గతంలో ఏ ప్రధానీ అనని విధంగా అవసరమైతే పాకిస్థాన్ మీద అణుబాంబులు వేయడానికి వెనుకాడనని అంటున్నారు. శత్రువు మీద ప్రయోగించడానికి కాకపోతే బాంబులు దీపావళి కోసమా అంటూ సర్వనాశనానికి దారి తీసే అణుయుద్ధాన్ని పిల్లలాట స్థాయికి తీసుకువెళుతున్నారు. తనను ప్రశ్నించే వారంతా పాకిస్థాన్ మద్దతుదారులని ఏమాత్రం సంకోచం లేకుండా ఆరోపిస్తున్నారు.
ఇదంతా కూడా బాలకోట్ పరిణామాలను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశించిన తర్వాత. మరి ఎన్నికల కమిషన్ ఎందుకు మిన్నకుంటున్నదన్న ప్రశ్న వేరే విషయం. చమత్కారాన్నీ, అవహేళననూ, ఆవేశాన్నీ మేళవించి వినేవారు తాదాత్మ్యం అయ్యేలా ప్రసంగించగల మాటకారితనం నరేంద్ర మోదీ సొంతం. అది ప్రసంగం వరకే. ఎందుకంటే ప్రసంగానికి ఎదురు ప్రశ్నలు ఉండవు. అక్కడెక్కడో జనం ఉంటారు. వింటారు. వెళతారు. మోదీ వేదిక దిగి మరో ఎన్నికల సభలో ప్రసంగానికి హెలీకాప్టర్ ఎక్కుతారు.
ఎదురుగా ఒకరు కూర్చుని ‘అదేమిటి’, ‘ఇదేమిటి’ అంటూ ఖండించి ప్రశ్నలు అడుగుతుంటే, ‘అది ఇందుకు’, ‘ఇది అందుకు’ అంటూ ఆత్మవిశ్వాసంతో జవాబులు ఇవ్వడానికి ఏ రాజకీయనాయకుడికైనా కొంత చిత్తశుద్ధి కావాలి. నరేంద్ర మోదీ దగ్గర లేనిదే అది. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రస్తావిస్తున్న అంశాలూ (ప్రస్తావించని అంశాలు కూడా), ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఎన్నికల ప్రచారాన్ని ఆయన దిగజార్చిన లోతులూ మోదీకి ఎంత చిత్తశుద్ధి ఉందీ చెప్పకనే చెబుతున్నాయి. తన ప్రత్యర్ధి ఎన్నికల ప్రచార సభలో ఎక్కువమంది ముస్లింలు ఉన్నందుకు అది పాకిస్థాన్ లాగా కనబడిందని అనగలిగే ప్రధానమంత్రి తెంపరితనంతో చిత్తశుద్ధి ఎలా సహజీవనం చేయగలదు! చిత్తశుద్ధి ఉంటే ప్రశ్నలు ఎదుర్కోగలిగే ధైర్యం సహజంగానే ఉంటుంది.
నిజానికి ఇవన్నీ కొత్త సంగతులు కావు. ఉత్తరప్రదేశ్‌లాంటి రాష్ట్రంలో ఒక్క ముస్లిం అభ్యర్ధికి కూడా బిజెపి టికెట్ ఇవ్వకుండా శాసనసభ ఎన్నికలకు వెళ్లిన నాయకుడు నరేంద్ర మోదీ. “వారు ‘ఇతరులు’ కాబట్టి మనకు అక్కరలేదు” అని మెజారీటీ మతస్థులు అయిన హిందువులకు ఇచ్చిన సందేశం అది. ఆ రాష్ట్రంలో ఆ వ్యూహం ఫలించింది కాబట్టి దేశంమంతా అదే సందేశం వ్యాపింపజేసేందుకు ఈ ఎన్నికలలో శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.
ఢిల్లీ రాకముందు నరేంద్ర మోదీ గతాన్ని వదిలేసినా, సౌత్ బ్లాక్‌ ఆఫీసులో కూర్చున్న తర్వాత ఆయన చేసిన పనులపై, చేయని పనులపై చాలామంది జర్నలిస్టులు చాలా రాశారు. కానీ ఒక లోటు మాత్రం అలానే మిగిలిపోయింది. అదేమంటే ప్రశ్నించే ఒక జర్నలిస్టు ఎదురుగా కూర్చుని ఉన్నపుడు నరేంద్ర మోదీ తన పాలన మంచీచెడుల గురించి మాట్లాడడం. ఆ లోటు బహుశా ఎప్పటికీ తీరదు. అక్షయ కుమార్ లాంటి సెలబ్రిటీలతో ఎన్నిసార్లు ముచ్చటించినా ఆ లోటు అలానే ఉంటుంది, పూడదు. ముందే అనుకున్నట్లు అందుకు కాస్త చిత్తశుద్ధి కావాలి. అదే ఉంటే ఆయనెందుకన్నట్లు ప్రస్తుత ప్రధానమంత్రికి ఆ చిత్తశుద్ధి ఉంటే అసలు ఆ లోటే వచ్చేది కాదుగా!

About The Author