స్థానిక ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం!
విద్యా శాఖను ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. స్కూళ్లు, టీచర్ల వ్యవహారాలను స్థానిక సంస్థలకు అప్పగించాలని యోచిస్తోంది. ఎలా చేయాలనే అంశంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ సంచలన నిర్ణయాన్ని ఆయనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.
విద్యాశాఖలో సంస్కరణలపై తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. టీచర్ల బదిలీలు, స్కూళ్ల నిర్వహణపై విమర్శల వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యవహరించిన తీరుపై ఆయన గుర్రుగా ఉన్నట్లు సమాచారం. టీచర్లు రాజకీయాల్లోకి రావడం, రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్, వ్యాపారాల్లో మునిగి తేలడం వంటి అంశాలపై సీరియస్‌గా ఉన్నారని వినికిడి. అందుకే విద్యాశాఖను ప్రక్షాళన చేసే దిశలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఉపాధ్యాయులపై ప్రజలు మంచి అభిప్రాయంతో లేరని కేసీఆర్ ఫిక్స్ అయ్యారని సమాచారం. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని, అయినా వాటిని ప్రజలు నమ్మలేదనే భావనకు కేసీఆర్ వచ్చారట. అందుకే ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారట. అటు ప్రజల మద్దతు కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారట.
స్కూళ్ల నిర్వహణ, టీచర్ల వ్యవహారాలను పాత పద్ధతిలో స్థానిక సంస్థలకే అప్పగించాలనే నిర్ణయానికి సీఎం వచ్చారట. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యను మండల ప్రజాపరిషత్ కమిటీకి, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న హైస్కూల్ విద్య నిర్వహణ బాధ్యతలను జిల్లా పరిషత్‌లకు అప్పగించాలని భావిస్తున్నారట. 1998 కంటే ముందు స్కూళ్ల నిర్వహణ, టీచర్ల నియామకాలు, బదిలీల వ్యవహారం అంతా జిల్లా, మండల పరిషత్‌ల ఆధీనంలోనే ఉండేవి. ఆ తర్వాత టీచర్ల నియామకాల వ్యవహారాన్ని స్థానిక సంస్థల నుంచి తప్పించి డీఈఓలకు అప్పగించారు. బదిలీలను ప్రభుత్వ అనుమతితో డీఈఓలు చేపట్టేలా నిబంధనలు మార్చారు.
ఇక అప్పటి నుంచి స్కూళ్ల భవనాల యాజమాన్యంగా మాత్రమే స్థానిక సంస్థలు కొనసాగుతున్నాయి. కానీ అజమాయిషీ లేదు..మళ్లీ ఇప్పుడు కూడా పాత పద్ధతి పునరుద్దరించి స్కూళ్లు, టీచర్ల బాధ్యతలు జిల్లా, మండల పరిషత్‌లకు అప్పగించాలని భావిస్తున్నారట. 73,74 యాక్టు ప్రకారం స్థానిక సంస్థలకు అప్పగించాల్సిన 29 రకాల విధుల్లో విద్యా రంగం కూడా ఉంది. ఇప్పుడు ఈ చట్టం ద్వారా విద్యను జిల్లా, మండల పరిషత్‌లకు అప్పగించాలని నిర్ణయించుకున్నారట. పాత చట్టాన్నే అమలు చేయడం వల్ల రాజకీయ విమర్శలు ఉండవని భావిస్తున్నారట. అంతేకాకుండా పాఠశాలల నిర్వహణకు జడ్పీలకు గ్రాంట్లు కూడా కేటాయించనున్నారట. దీని వల్ల పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారట. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ నిర్ణయాన్నిఅధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.