తిరుమల వేంకటేశ్వరస్వామి బంగారం నిల్వలు 7325 కిలోలు…
ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడైన తిరుమల వెంకన్నకు భక్తులు సమర్పించుకొనే బంగారం గుడ్లు పెడుతోంది. ఏటికేడు నిల్వలు పెరిగిపోతూ తిరుమల తిరుపతి దేవస్థానానికి కనకవర్షం కురిపిస్తోంది. స్వామికి నిలువు దోపిడీగానూ, హుండీల్లోనూ, కానుకల రూపంలోనూ భక్తులు నిత్యం బంగారం సమర్పిస్తూ ఉంటారు. ఇలా భారీఎత్తున పోగవుతున్న నిల్వలను టీటీడీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వడ్డీగా మళ్లీ బంగారమే తీసుకుంటోంది. డిపాజిట్ గడువు ముగియడంతో టీటీడీకి తిరిగి అప్పగించేందుకు ఒక బ్యాంకు నుంచి తెస్తున్న బంగారం ఎన్నికలకు ముందు పట్టుబడటం వివాదాస్పదమైంది. దీనిపై వచ్చిన విమర్శలకు వివరణ ఇస్తూ టీటీడీ వెల్లడించిన అంశాలు అనేక ఆసక్తికర కోణాలను వెలుగులోకి తెచ్చాయి. 2016 ఏప్రిల్ 18న పంజాబ్ నేషనల్ బ్యాంకులో టీటీడీ 1,311కిలోల బంగారం డిపాజిట్ చేసింది. ఈ మూడేళ్లలో 1.75శాతం వడ్డీతో 70కిలోలు అదనంగా వచ్చింది. 2019 ఏప్రిల్ 18న కాలపరిమితి ముగియడంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వడ్డీతో కలిపి బ్యాంకు మొత్తం 1,381కిలోలు టీటీడీకి తిరిగి చెల్లించింది. దాన్ని తరలించే క్రమంలోనే తమిళనాట జరిపిన తనిఖీల్లో ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఇది ఖజానాకు చేరినా వివాదం మాత్రం సద్దుమణగలేదు. టీటీడీకి సంబంధించిన ఇటువంటి డిపాజిట్లు మరికొన్ని బ్యాంకుల్లోనూ ఉన్నాయి. 12ఏళ్ల కాలవ్యవధితో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 2018లో 1,938కిలోలు, ఎస్బీఐలో 2017లో 5,387కిలోలు డిపాజిట్ చేశారు. మూడేళ్లకు 1.75శాతం, ఐదేళ్లు దాటితే 2.5శాతం చొప్పున వడ్డీ వస్తుంది. ఈ రెండు బ్యాంకుల్లో ఉన్న మొత్తం 7,325కిలోల బంగారంపై దాదాపు 1,700కిలోలు వడ్డీ కింద టీటీడీకి అదనంగా లభించనుంది. ఇప్పటికే దేవస్థానం ఖజానాలో 553కిలోలు నిల్వ ఉండగా, దానికి పీఎన్బీ నుంచి వచ్చిన 1,381కిలోలు కూడా కలిసింది. ఈ లెక్కన 2030 నాటికి ఈ నిల్వలు 11టన్నులకు చేరుకోనున్నాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దీని విలువ రూ.3వేల కోట్ల రూపాయల పైమాటే. బంగారాన్ని కరిగించి ఇటుకల్లా మార్చి డిపాజిట్ చేస్తే ఎక్కువ లాభమా, నగదు రూపంలోకి మార్చి డిపాజిట్ చేస్తే ప్రయోజనమా అనే అంశం తాజాగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే నగదు రూపంలో దాదాపు రూ.11,380కోట్లు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లుగా ఉన్నాయి. వీటిపై సగటున 7నుంచి 7.66శాతం దాకా వడ్డీ గిడుతోంది. బంగారం మీద వడ్డీ 2.5శాతం దాటట్లేదు. ఉన్న మొత్తం బంగారాన్ని నగదు రూపంలోకి మారిస్తే 8శాతం వరకూ వడ్డీ వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్న స్వామి సంపద ప్రతి పదేళ్లకీ దాదాపు రెట్టింపు అవుతుందన్నమాట. దీనిపై టీటీడీ ఫైనాన్స్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. అయితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో రోజుకు దాదాపు 2కిలోలు చొప్పున బంగారం జమ అవుతోంది. అంటే ఏడాదికి 700కిలోలకు పైగానే చేరుతోందన్నమాట. ఇదంతా ఎప్పటికప్పుడు ఖజానాకు చేరుతున్నా టీటీడీ వెంటనే కరిగించేయదు. నిపుణుల మదింపు తరువాత యథాతథంగా ఉంచడానికి ఉపయోగపడని వాటిని మాత్రం కరిగించడానికి నిర్ణయం తీసుకుంటారు. వివిధ రాళ్లతో కలిసి ఉన్న ఆభరణాల మదింపు తర్వాత కిలోల వంతున విభజిస్తారు. ఇన్వెస్ట్మెంట్ కమిటీ సూచనల మేరకు ఆర్బీఐ నిబంధనలకు లోబడి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. టెండర్ల ద్వారానే అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో బంగారం డిపాజిట్ చేస్తారు. టీటీడీ ఖజానా నుంచి డిపాజిట్‌గా స్వీకరించిన మొత్తం బంగారాన్ని సదరు బ్యాంకే ముంబైలోని మింట్‌కి తరలిస్తుంది. ఒకసారి ఖజనా దాటాక టీటీడీ బాధ్యత ఉండదు. అయితే టీటీడీ నిపుణుల పర్యవేక్షణలోనే బంగారం కరిగించే ప్రక్రియ జరుగుతుంది. కాలవ్యవధి ముగిశాక వడ్డీతో సహా బంగారాన్ని అప్పటి ధరతో నిమిత్తం లేకుండా తిరిగి టీటీడీకి చెల్లిస్తారు. బంగారం మొత్తం ఖజానాకు చేర్చే దాకా భద్రత బాధ్యత బ్యాంకుదే. అందుకే ఈ బంగారానికి బ్యాంకులు ముందు జాగ్రత్తగా బీమా చేస్తాయి. చెన్నైలో పట్టుబడిన బంగారం విషయంలో ఈ భరోసా ఉన్నందునే భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని పీఎన్బీ స్పష్టం చేసింది.