ఈ అవ్వకు దొంగతనాలే బువ్వ … ఆస్తులున్నా బుద్ది నాస్తి…
ఆమెకు 71 ఏళ్లు. చూడగానే గౌరవం కలిగించే రూపం , వేషం. ఆర్థికంగా స్థితిమంతురాలు. అయినా చేతివాటం ఎక్కువే . దొంగతనాలే ఆమె బ్రతుకు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు ఎలాంటి వేడుకల్లో అయినా అల్లుకుపోయే తత్వం ఆమెది. వేడుకలు, రద్దీ ప్రాంతాల్లో తోటి మహిళలు.. అందునా వృద్ధురాళ్లే లక్ష్యంగా నగలు చోరీ చేస్తున్న ఆమె శైలికి పోలీసులే ముక్కున వేలేసుకున్నారు. ఆర్థికంగా మెరుగైన స్థితిలోనే ఉన్నప్పటికీ కేవలం ఆమెలో తలెత్తిన దురాశ వల్ల ప్రస్తుతం కటకటాలు లెక్కించాల్సి వచ్చింది.తెనాలి నందులపేటలో గత నెల 13న వినాయకుడి గుడిలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో పట్టణానికి చెందిన 65ఏళ్ల పైబడిన ఇద్దరు వృద్ధులు తమ మెడలోని బంగారు నానుతాడులు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడి ఆవరణలోని సీసీ కెమెరాలకు చిక్కకుండా, వాటి పరిధిని దాటాక చాకచక్యంగా చోరీ చేశారని పోలీసులు గుర్తించారు. వేడుకను ప్రైవేటు వీడియోగ్రాఫర్ చిత్రీకరించారని తెలుసుకుని, దాన్ని తెప్పించి నిశితంగా పరిశీలించారు. నగలు పోగొట్టుకున్న వృద్ధురాళ్ల వద్దకు మరో వృద్ధురాలు రావడం, దొంగలుంటారు నగలు జాగ్రత్త అంటూ వారి మెడ చుట్టూ పైట కొంగు కప్పటం గమనించారు. నిందితురాలు పట్టణంలోని ప్రకాశంబజార్లో తారసపడటంతో అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలి పేరు జవంగుల సరోజిని అలియాస్ దాసరి సామ్రాజ్యం. సత్తెనపల్లిలో వ్యాపారిగా ఉన్న కుమారుడి వద్ద ఉంటోంది. రెండో కుమారుడు తెనాలిలో ఉద్యోగం చేస్తుండటంతో ఆయన వద్దకు తరచూ వస్తుంది. ఈ సందర్భంగానే నగలు చోరీ చేసింది. నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కృష్ణా పుష్కరాలు, ఇతర వేడుకల్లో చోరీలకు సంబంధించి ఆమెపై విజయవాడలో ఏడు కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి పోలీసులు అరెస్టు చేయగా ప్రస్తుతం బెయిల్పై ఉన్నట్లు తేల్చారు.