జులై నెలలో ప్రారంభం కానున్న ఐదవ విడత హరితహారం ఏర్పాట్లు…
జులై నెలలో ప్రారంభం కానున్న ఐదవ విడత హరితహారం ఏర్పాట్లపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సచివాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాలు, మండలాలకు చెందిన అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో నర్సరీల ఏర్పాటు, ఉపాధి హామీ నిధులతో అనుసంధానం, ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోత్సాహం పై చర్చించారు. సీ.ఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేసే నర్సరీని ఆ గ్రామం పేరు – హరితహారం నర్సరీగా పిలవాలని నిర్ణయించారు. ఏ శాఖ నర్సరీని నిర్వహిస్తున్నా పేరు మాత్రం గ్రామ పంచాయితీ పేరుపైనే ఉండాలని ఆదేశాలు ఇచ్చిన అధికారులు. (Eg: ములుగు గ్రామ పంచాయితీ – హరితహారం నర్సరీ) పట్టణ ప్రాంతాల్లోని నర్సరీలకు కూడా ఇదే విధంగా పేరు పెట్టాలని సూచించారు. ఇక రోడ్లకు ఇరువైపులా (అవెన్యూ ప్లాంటేషన్ లో) ఈ ఏడాది పెద్ద ఎత్తున చింత చెట్లు నాటాలని నిర్ణయించారు. ప్రతీ జిల్లాలో కనీసం 15నుంచి 20 కిలో మీటర్ల మేరు తొలి దశలో చింత చెట్లను నాటాలని సూచించారు. ఆగ్రో ఫారెస్ట్రీ కింద గంధం, వెదురు, టేకు, సరుగుడు మొక్కల పెంపకాన్ని చిన్న, సన్నకారు రైతులకు అదనపు ఆదాయం ఉండేలా ప్రోత్సహించనున్నారు. జిల్లాల వారీగా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీలు సమావేశమై ఐదవ విడత హరితహారం కార్యాచరణ సిద్దం చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో అజయ్ మిశ్రాతో పాటు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, వ్యవసాయ, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్లు రాహుల్ బొజ్జా, నీతూ ప్రసాద్, పీసీసీఎఫ్ పీ.కే.ఝా, సీ.ఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అదనపు పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియల్ పాల్గొన్నారు.