దుబాయ్ లో 587 మంది ఖైదీల విడుదల…
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపాధ్యక్షుడు, యుఏఈ ప్రధానమంత్రి, దుబాయ్ పరిపాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్ 587 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేయాల్సిందిగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ జాతీయతలకు చెందిన వీరందరినీ దుబాయ్ దిద్దుబాటు మరియు శిక్షాత్మక సంస్థలు త్వరలో విడుదల చేయనున్నాయి.
క్షమాభిక్ష పొందినవారు కొత్తగా జీవితం ప్రారంభించాలని షేక్ మొహమ్మద్ అభిలషిస్తున్నట్టు దుబాయ్ అటార్నీ జనరల్ ఎస్సామ్ ఈసా అల్ హుమైదన్ తెలిపారు. వారంతా తమ కుటుంబాల ఇబ్బందులు తొలగించి, తిరిగి జనజీవన స్రవంతిలో మమేకం కావాలని పరిపాలకుడు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ ఏడాదిని దేశం ఇయర్ ఆఫ్ టాలరెన్స్ గా జరుపుకుంటున్నందువల్ల యుఏఈ బలంగా పాటించే విలువలైన సహనాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తుందని అల్ హుమైదన్ అన్నారు.
తమ పాత తప్పులు, అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకొని సరైన దారిని వదిలి పెడదారి పట్టకుండా చూసుకోవాలని క్షమాభిక్ష పొందిన ఖైదీలకు ఆయన పిలుపునిచ్చారు. రంజాన్ ప్రారంభానికి ముందే షేక్ మొహమ్మద్ ఉత్తర్వులు అమలు చేసేందుకు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ న్యాయ ప్రక్రియలు ప్రారంభించినట్టు అటార్నీ జనరల్ చెప్పారు.
అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రంజాన్ కి ముందు 3,005 మంది ఖైదీలను విడుదల చేయాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పరిపాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖసీమీ కూడా 377 మందిని విడుదల చేశారు. రస్ అల్ ఖైమాలో 306 మందిని సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, రస్ అల్ ఖైమా పరిపాలకుడు షేక్ సౌద్ బిన్ సఖ్ర్ అల్ ఖసీమీ విడుదల చేశారు. ఉమ్ అల్ ఖువైన్ లో కూడా పలువురు ఖైదీలను సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, ఉమ్ అల్ ఖువైన్ పరిపాలకుడు షేక్ సౌద్ బిన్ రాషిద్ అల్ ముఅల్లా విడుదల చేశారు.