ఈసీతో మరో పోరుకు సిద్దమైన చంద్రబాబు..!
*పోలవరం వెళ్తా..ఎవరు అడ్డొస్తారో చూస్తా..!*
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఢీకొట్టడానికి సిద్ధ పడుతున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో వరుసబెట్టి సమీక్షలు, సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి అధికారిక సమీక్షలను నిర్వహించే అధికారం లేదంటూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి స్పష్టం చేస్తున్నప్పటికీ.. ఆయన పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చేస్తోన్న సమీక్షలను కూడా ఆయన తప్పుపడుతున్నారు.
*జూలై నాటికి పోలవరం నీళ్లు..*
పూర్తిస్థాయి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇదివరకు ప్రతి సోమ, మంగళవారాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పర్యవేక్షించే వారు. అదే విధానాన్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలోనూ కొనసాగిస్తానని ఆయన అంటున్నారు. సోమవారం లేదా మంగళవారం తాను పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని, అక్కడ కొనసాగుతున్న నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని తేల్చి చెబుతున్నారు.
తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని పరోక్షంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల సంఘం అధికారులను ఉద్దేశించి సవాల్ విసిరారు. పోలవరం కుడి, ఎడమల ప్రధాన కాలువల నిర్మాణ పనులను పూర్తి చేసి, వచ్చే జులై నాటికి నీటిని విడుదల చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. ఇప్పటివరకు 69% ప్రాజెక్టు నిర్మాణం పూర్తైంది. మొత్తం 38.88 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను 28.16 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు, తవ్వకం పనులు 84.60% పూర్తయ్యాయని, ఎన్నికల నిబంధనల పేరుతో దీన్ని మధ్యలోనే వదిలేస్తే, ఎవరు పూర్తిచేస్తారని, దీనివల్ల సంభవించే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని చంద్రబాబు చెబుతున్నారు.
*ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏం చేస్తున్నారు?*
నిజానికి- ఓ పూర్తిస్థాయి ప్రభుత్వం చేయాల్సిన పనులన్నింటినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్వహిస్తున్నారు. ఫలితాల లెక్కింపు పూర్తయి, కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకూ పాలనలో ఎక్కడా జాప్యం లేకుండా ఆయన పర్యవేక్షిస్తున్నారు.
ఈ నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. చంద్రబాబు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఓట్ల లెక్కింపుల తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వం యథావిధిగా ప్రభుత్వ కార్యకలాపాలను కొనసాగిస్తారు. అప్పటిదాకా వేచి చూడటానికి చంద్రబాబు సిద్ధంగా లేరనేది ప్రతిపక్షాల వాదన. ప్రవర్తనా నియమావళిని అడ్డు పెట్టుకుని అటు ఎన్నికల సంఘం అధికారులపై, ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేయడంలో అర్థమే లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
*ఉద్దేశపూరకంగా కయ్యం..!*
ఉద్దేశపూరకంగానే చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులపై కాలు దువ్వుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున..లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులెవరూ ఎన్నికల సంఘంపై ఈ స్థాయిలో ధ్వజమెత్తట్లేదు. మన రాష్ట్రంతో పాటు పొరుగునే ఉన్న ఒడిషాలో కూడా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించారు. అక్కడి ముఖ్యమంత్రి ఏనాడూ ఎన్నికల సంఘంపై మండిపాటును ప్రదర్శించలేదు. ఫొని రూపంలో పెను తుఫాన్‌ను ఎదుర్కొన్నప్పటికీ.. ఆయన నిబ్బరంగా కనిపిస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారులను సంప్రదించి, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కోడ్‌ను ఎత్తేయించుకోగలిగారు. మన రాష్ట్రంలో కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ను ఎత్తేసిన విషయం తెలిసిందే.
*మంత్రివర్గ సమావేశాన్ని అడ్డుకోగలరా?*
ఎన్నికల సంఘం నిబంధనలను కాదని చంద్రబాబు తాజాగా చేసిన మరో ప్రకటన- మంత్రివర్గ సమావేశం ఏర్పాటు. ఈ నెల 10 లేదా 12వ తేదీల్లో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తానని, అధికారులు ఎలా గైర్హాజరు అవుతారో చూస్తానని ప్రకటించారు చంద్రబాబు. కోడ్ అమల్లో ఉన్న సమయంలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించే హక్కు గానీ, అధికారం గానీ ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉండదని, ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలిసే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ- నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం, మొండిగా వ్యవహరించడం పట్ల చంద్రబాబుకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు.
*దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారా?*
చంద్రబాబు వైఖరిని, ఆయన ద్వంద్వనీతిని ప్రతిపక్షాలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా సమీక్షలు చేయడం పట్ల ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అవినీతి పనులను కప్పి పుచ్చుకోవడం కోసమే చంద్రబాబు సమీక్షల పేరుతో హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు లక్షల కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని, ఇక అధికారంలోకి రావట్లేదనే అభద్రత భావంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు సమీక్షల పేరు నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే.. తన అవినీతి ఎక్కడ బయటపడుతుందోననే భయంతో చంద్రబాబు కీలక ఫైళ్లను గల్లంతు చేస్తున్నారని మండిపడుతున్నారు.