ఒడిషా కు మా శాయశక్తులా సాయం చేస్తాం… ఏపీ సీఎస్
ఫోని తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిషా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున శాయశక్తులా అండగా ఉంటామన్నారు… ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఆదివారం ఫోని తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. కూలిపోయన చెట్లను తొలగించేందుకు అవసరమైన 200 పరికరాలను ఇప్పటికే అందించామన్నారు. 12 లక్షల వాటర్ ప్యాకెట్లతో పాటు 20 వాటర్ ట్యాంకర్లతో తాగునీరు పంపిణీ చేశామన్నారు.
సోమవారం మరో 20 ట్యాంకర్లతో తాగునీరు అందజేస్తామని, విద్యుత్ సేవల పునరుద్ధరణకు శ్రీకాకుళం లో సిద్ధంగా ఉన్న 1100 మంది విద్యుత్ సిబ్బందిని ఒడిశాకు పంపేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇనుప విద్యుత్ స్తంభాలు, 5 వేల లీటర్ల కెపాసిటీ కలిగిన 500 సింటెక్స్ వాటర్ ట్యాంకులు అందజేయాలని ఒడిశా సీఎస్ కోరారన్నారు. వాటర్ ట్యాంకుల పంపిణీకి చర్యలు తీసుకుంటామని, ఇనుప విద్యుత్ స్తంభాలు తమ దగ్గర లేవని, ఏపీలో సిమెంట్‌తో తయారు చేసిన విద్యుత్ స్తంభాలే వాడుతున్నట్లు తెలిపామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి డి.వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఒడిశా తుపాన్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.15కోట్లు విరాళం ప్రకటించారు. ఛత్తీస్ఘర్ 11కోట్లు, ఉత్తరప్రదేశ్, తమిళనాడులు తలా 10 కోట్ల విరాళాలు ప్రకటించాయి.