“అక్షయ” అంటే ‘నిత్యమైనదని’ అర్థం….


భారతదేశంలో కొన్ని పండగలను చాలామంది ప్రజలు గొప్ప ఉత్సాహంతో ఆర్బాటంగా జరుపుకుంటారు.
అక్షయ తృతీయ (లేదా) అఖ టీజ్ అనే పవిత్రమైన రోజును ఆరాధనాభావంతో, హిందువులు మాత్రమే కాదు, జైనులు కూడా జరుపుకుంటారు…

ఈ పవిత్రమైన రోజున వివిధ రాష్ట్రాలలో ఒక్కొక్క ప్రాముఖ్యతతో జరుపుకుంటారు.
భారతదేశం గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే “భిన్నత్వంలో ఏకత్వమును” కలిగిన ఒకేఒక్క దేశం.
ఈ పండుగ విషయానికి వస్తే, ఆ పదంలో ఉన్న నిజము మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల పేర్లతో “అక్షయ తృతీయ” పేర్గాంచింది.
దీనిని ఛత్తీస్ఘడ్లో – ‘అక్తి’ అని, గుజరాత్ & రాజస్థాన్లలో దీనిని ‘అహ టీజ్’ అని పిలుస్తారు.
హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం, వైశాఖ మాస శుక్లపక్షం నాడు ఈ పవిత్ర దినాన్ని జరుపుకుంటారు.
*పరాశురాముని పుట్టుక :*

ఈ అక్షయ తృతీయ ప్రాముఖ్యతను గూర్చి మనము మాట్లాడేటప్పుడు, మనకు గుర్తుకు వచ్చే మొట్టమొదటి విషయం “పరశురామును” పుట్టుక. విష్ణువు 6 అవతారం అయినా ఇయన, అనిశ్చయమైన పాలకుల నుంచి ప్రపంచాన్ని 21 సార్లు రక్షించాడు.
*మహాభారత ప్రారంభం :*

శ్రీ మహా గణేషుడు, వేదవ్యాసుని చేత చెప్పబడిన మహాభారతాన్ని ఈ అక్షయ-తృతీయ నాడే రచించడం ప్రారంభించాడని అందరూ నమ్ముతారు.

పాండవుల విజయాన్ని సూచిస్తుంది : మహాభారతానికి, అక్షయ తృతీయకు సంబంధించిన మరొక కథనం ప్రాచుర్యంలో ఉంది. పాండవులు అక్షయ తృతీయనాడే ఒక చెట్టు క్రింద కనుగొన్న ఖగోళ ఆయుధాలతోనే, కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు వ్యతిరేకంగా పోరాడి గెలిచారన్న ఒక కథనం విస్తృతంగా ప్రచారంలో ఉంది.

కుబేరుని ప్రాశస్త్యం : అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజు గురించి అనేక పురాణాల్లో ప్రస్తావించబడింది. శివ పురాణం ప్రకారము, కుబేరుడు తన సంపదను అన్నింటికీ శివ భగవానుడి నుంచి అందుకుని, లక్ష్మీదేవితో పాటు అతనూ కూడా సంపదలకు అధిపతి అయ్యాడు.
పురాణాల ప్రకారం, అక్షయ తృతీయ అనేది త్రేతాయుగానికి అనగా శ్రీ రాముని యుగానికి చెందినది అని కూడా సూచిస్తుంది.

ప్రజలు ‘ధర్మ’ మార్గమును అనుసరించిన కాలం ఇది. అందువల్ల, అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున కొత్తగా మొదలుపెట్టే ఏ పనైనా, మీకు విజయమును & శ్రేయస్సు అందించి, మీ జీవితాన్ని మరింత గొప్పగా మారుస్తోంది. మీరు ఈ రోజున ఏదైనా ప్రారంభించాలనుకున్నప్పుడు జపాలు, దానాలు, పితృతర్పణం, వంటి వాటిని ఆచరించడం ద్వారా దేవుడి ఆశీర్వాదాన్ని పొందడమే కాకుండా శాంతిని కూడా పొందగలుగుతారు.

*దాని ప్రాముఖ్యత:*

1. పరశురాముని జన్మదినం.
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.
3. త్రేతాయుగం మొదలైన దినం.
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం.
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

అక్షయ తృతీయనాడు జ్ఞానాన్ని సంపాదించడం, దానాలను చేయడం వల్ల, మామూలు దినములకన్నా, అనేకరెట్లు ఫలితాలను పొందగలరని వేదాలు చెప్పాయి.

అక్షయ అనగా తరగనిది అని అర్ధం. తృతీయ అనగా మూడవది అని అర్ధం. మనకు ధర్మ, అర్ధ, కామ మోక్షములు అని నాలుగు పురుషార్ధాలు ఉన్నాయి. కామము అనగా కోరిక.

వస్తువులను కూడబెట్టి దాచుకున్న కొద్ది కోరికలు పెరుగుతుంటాయి కానీ ఎన్నడూ తరగవు. కోరికను తగ్గించడానికి ఉత్తమ ఉపాయం దానమే. ఏదో ఒకటి దానం చేయకూడదు.

యద్యుత్‌ ఇష్ట తమం స్వస్య
తత్తత్‌ విప్రాయ దాపయేత్‌

అనునది నారద పురాణ వాక్యం. అనగా మనకు ఏది అత్యంత ఇష్టమైన వస్తువో దానిని సద్బ్రాహ్మణునకు/పేదలకు దానం చేయాలని అర్థం.

అసలు అర్ధము భగవంతుని చేరడానికి నాలుగు ఉపాయాలు ఉన్నాయి. కర్మ, జ్ఞానము, భక్తి, ప్రపత్తి. అక్షయ తృతీయ అంటే తరగని భక్తి అని అర్ధం.

భక్తి తరగకుండా ఉండాలంటే మనకు సంసారంలో దేనిమీద భక్తి ఉందో వాటిని భగవంతుడికి అర్పించాలి. ఆయన తీసుకోడు కావున భక్తి కలిగిన ఉత్తమ బ్రాహ్మణునకు అర్పించాలి.

మానవుని రూపంలో ఉన్న మాధవుడు, పూట గడవని బీద సాదలకు, అనాధలకు అన్నదానం, వస్త్ర దానం, పుస్తక దానం ఆరోజున చేస్తే భగవంతుని మీద మనకు ఉన్న భక్తి తరగకుండా ఉంటుంది. ఈ విధంగా దాన, ధర్మాలు చేసి మన భక్తి తరగలేదని మనలో విశ్వాసాన్ని ,జ్ఞానాన్ని పెంచుకొనుటే అక్షయ తృతీయ అంతరార్ధం…

About The Author