కష్టాలకు ఎదురొడ్డి సొంతంగా పొలం దున్ని పంటలు పండిస్తోన్న మహిళ…
జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం సూరారం శివారు చర్లతండాకు చెందిన లాకవత్ కమల మగవారికి దీటుగా వ్యవసాయ పనులు చేస్తోంది.
కమల చిన్నతనం నుంచే సాగు పనుల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేది. సోదరుల సాయంతో ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. 25 ఏళ్ల క్రితం చెర్లతండాకు చెందిన లాకవత్ యాకుబ్‌తో కమలకు వివాహమైంది.
యాకుబ్ సంపాదించిన వ్యవసాయ భూమి 18 ఎకరాలు ఉంది. భర్త ఉన్నప్పుడు ట్రాక్టర్, పశువుల సాయంతో వ్యవసాయ పనులు చేసేవారు.
యాకుబ్ మరణించడంతో ఒంటరిగా వ్యవసాయ పనులు ఎలా చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన భరోసాతో పాలేరులు లేకుండానే మూడేళ్ల పాటు సాగు పనులు చేసింది.
తమ సొంత ట్రాక్టర్‌తో పొలం దున్ని పంటలను సాగు చేసింది. పంట దిగుబడులు అంతంత మాత్రంగానే ఉండడంతో ఓ రైతుకు 7 ఎకరాల భూమిని కౌలుకు ఇచ్చింది.
కమలకు చిన్నప్పటి నుంచే అవగాహన ఉండడంతో పురుషులకు దీటుగా పనులు చేస్తోంది. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలను పాటిస్తూ మంచి దిగుబడులు సాధిస్తోంది.
తన ద్విచక్రవాహనంపై ఎరువులు, విత్తనాలను తెచ్చుకుంటుంది. పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తోంది.