కార్బైడ్ తో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి…
వేసవి కాలంలో సహజంగానే మామిడి పండ్లకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అనేక రకాల జాతులకు చెందిన మామిడి పండ్లు మనకు ఈ సీజన్లో కనిపిస్తూ నోరూరించేలా చేస్తుంటాయి. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం అనేక మంది వ్యాపారులు కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లనే విక్రయిస్తున్నారు. దీంతో అలాంటి పండ్లను మనం కొని తింటున్నాం.. అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం.. అయితే కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లను మనం సులభంగానే గుర్తించవచ్చు. అదెలాగంటే….
1. కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లపై అక్కడక్కడా ఆకుపచ్చదనం ఉంటుంది. అదే సహజంగా పండిన పండ్లయితే కాయ మొత్తం ఒకే రంగులో ఉంటుంది. ముదురు ఎరుపు, పసుపు రంగులో ఈ పండ్లు ఉంటాయి.
2. సహజంగా పండిన మామిడి పండ్లపై నొక్కితే మెత్తగా అనిపిస్తుంది. అలాగే ఆ పండ్ల తొడిమల దగ్గర మంచి వాసన వస్తుంది.
3. కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లు లోపల అక్కడక్కడా పచ్చిగానే ఉంటాయి. దీంతో పులుపు తగులుతుంది. అదే సహజంగా పండిన పండ్లయితే రసం ఎక్కువగా వస్తుంది. అలాగే రుచి కూడా తియ్యగా ఉంటుంది.
4. కార్బైడ్ ఉపయోగించి పండించిన పండ్లను నీటిలో వేస్తే పైకి తేలుతాయి. అదే సహజంగా పండించిన పండ్లయితే నీటిలో మునుగుతాయి.