హిందూగర్భిణీని కాపాడిన ముస్లిం ఆటో వాలా…


మతమా ..? మానవత్వమా ..??
హిందూగర్భిణీని కాపాడిన ముస్లిం ఆటో వాలా ..

మతఘర్షణలతో అట్టుడికిపోతున్న ప్రాంతంలో ఓ ముస్లిం సాహసం హిదూ గర్భిణీని కాపాడింది. కాన్పు కష్టమై అల్లాడిపోతున్న ఆ తల్లిని ఆసుపత్రికి తీసుకుపోయేందుకు అంబులెన్స్ కూడా వచ్చేందుకు వెనుకంజవేసినా కర్ఫ్యూనికూడా కాదని ఒక ఆటో డ్రైవర్ ఆమెను ఆసుపత్రికిచేర్చి సకాలంలో వైద్యం అందేట్టుచేయడంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మత ఘర్షణల కారణంగా అసోంలోని హైలాకండీలో కర్ఫ్యూ విధించారు.
రుబెన్‌ దాస్‌ అనే వ్యక్తి తన భార్య నందిత పురిటి నొప్పులతో బాధపడుతుండడం చూసి అంబులెన్స్‌ కోసం ప్రయత్నించాడు. అయినప్పటికీ, తమకు సాయం అందకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆయన బాధపడిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆటో డ్రైవర్ మక్బూల్‌.. వెంటనే తన ఆటోలో నందితను సరైన సమయానికి ఆస్పత్రికి చేర్చాడు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చుట్టూ ఉన్న వారు మతాల కోసం ఘర్షణ పడుతుంటే ఆ ఆటోడ్రైవర్‌ మాత్రం హిందూ మహిళను సాయం చేసి హీరో అయ్యాడు.
ఆ ప్రాంత డిప్యూటీ కమిషనర్‌ కీర్తి జల్లీ నందిత వద్దకు వచ్చి ఆమె పరిస్థితి తెలుసుకున్నారు. ‘హిందూ-ముస్లిం సామరస్యాన్ని చాటే ఇటువంటి ఉదాహరణలు మరిన్ని వెలుగులోకి రావాలి’ అని అన్నారు. కర్ఫ్యూ ఉన్న సమయంలోనూ సాహసోపేతంగా ఆమెను ఆస్పత్రికి చేర్చిన ఆటోడ్రైవర్‌ను ప్రత్యేకంగా కలిసి ప్రశంసించారు.

About The Author