9 దుంగలు సహా మళయాళి స్మగ్లర్ పట్టివేత…
ఎస్పీవోల సహకారం… టెక్నాలజీ సాయం.
* అడవుల్లో నీరు లేక అవస్థలు.
* 9 దుంగలు సహా మళయాళి స్మగ్లర్ పట్టివేత
ఒక వైపు భారీ ఎండలతో అడవుల్లో జంతువుల సైతం నీరు లేకపోవడంతో బయటకు వచ్చేస్తున్నాయి… ఎన్నికల ఫలితాలు మరో వైపు కావడంతో సిబ్బంది భద్రతలో నిమగ్నమైయ్యారు…. ఇంకో వైపు ఇదే అదునుగా భావించి తమ కార్యకలాపాలను సాగించేందుకు యత్నించిన స్మగ్లర్లును టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎస్పీవోల సహకారంతో టెక్నాలజీ ఉపయోగించి పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ వాసు, డీఆర్వో పీవీఎన్ రావ్ బృందం రోజు వారి తనిఖీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం నుంచి కల్యాణి డ్యామ్ ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీవోల నుంచి వచ్చిన సమాచారం మేరకు నాగపట్ల ఈస్ట్ బీట్ లో రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్న క్రమంలో స్మగ్లర్ల జాడలను గుర్తించి వెంబడించారు. ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసీ అదనపు బలగాలను ఆ మార్గం బయటకు వచ్చే వైపు గస్తీ చేపట్టారు. ఈ క్రమంలో రాగిమాకుల కుంట ప్రాంతంలో సుమారు 12మంది స్మగ్లర్లును నైట్ విజన్ సహాయంతో గుర్తించి నిలువరించారు.
సిబ్బందిని గుర్తించిన స్మగ్లర్లు దుంగలను పారవేసి పారిపోయేందుకు యత్నంచారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రం కలవరాయన్ హిల్స్ కు చెందిన వెలయన్ అనే స్మగ్లర్ ను పట్టుకున్నారు.
పట్టుకున్న స్మగ్లర్ ను విచారించగా సుమారు 9 రోజుల క్రితం అడవిలోకి వెళ్లామని 30 కిలో మీటర్ల మేర నీరు లేకపోవడంతో బండపై నిలిచిన నీటిని తీసుకుని ఆహారం, తాగడానికి పెట్టుకుని భూమిలో ఉన్న మొద్దలను పెకలించామని చెప్పాడు. 9 రోజులుగా స్నానం లేకపోవడంతో స్మగ్లర్ వద్ద దుర్గంధం వస్తోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించగా ఆహారం, నల్లగా ఉన్న తాగునీరు, దుస్తులు , 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని టాస్క్ ఫోర్స్ డీఎస్పీలు వెంకటరమణ, అల్లాబక్ష్ష్, ఏసీఎఫ్ కృష్ణయ్య, ఆర్ఐ చంద్రశేఖర్ పరిశీలించారు. సిబ్బందిని టాస్క్ ఫోర్స్ ఐజీ శ్రీ డాక్టర్ ఎం కాంతారావు గారు అభినందించారు. ఎస్పీవోల ఏర్పాటు మంచి ఫలితాలు ఇస్తోందని కొనియాడారు.