హిందువులు బొట్టు ఎందుకు పెడతారు? ఆ ప్రదేశంలో ఏముంటుంది?
బ్రెయిన్ ప్రోగ్రామింగ్ – హిందువులు బొట్టు ఎందుకు పెడతారు? ఆ ప్రదేశంలో ఏముంటుంది?
రెండు కళ్ల మధ్య నుదుటి మీద బొట్టు పెట్టడం చాలామంది హిందువులకు అలవాటు. దీని వెనుక ఒక పెద్ద లాజిక్ ఉంది. తల్లి గర్భంలో పిండం రూపాంతరం చెందే సమయంలో, రకరకాల అవయవాలు ప్రాణం పోసుకునేటప్పుడు, బ్రెయిన్ విషయానికొస్తే అన్నిటికంటే చిట్టచివర ఆకారం సంతరించుకునేది బ్రెయిన్లోని ముందు భాగమైన ఫ్రాంటల్ లోబ్. ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆరవ నెలలో తయారవుతుంది.
ఇది మన శరీరంలో రెండు కళ్ళకు పైన నుదుటి ప్రదేశంలో ఉంటుంది. “నేను, నాది” అని మనం క్రియేట్ చేసుకునే ఇగో మొత్తం ఇక్కడే ఏర్పడుతుంది. మన గురించి మనం అనుకునేది మొత్తం భద్రపరచబడే ప్రదేశం ఇది. ఇక్కడ ఉండే సమాచారం ఆధారంగానే మనం బయటి ప్రపంచంతో ఎలా ఉంటాం, బయటి ప్రపంచాన్ని ఎలా స్వీకరిస్తాం అన్నది ఆధారపడి ఉంటుంది. ఇది మన ప్రవర్తనను నిర్దేశిస్తుంది. కొత్తగా చేయాల్సిన లక్ష్యాల గురించి కలలు కంటుంది, జీవితం మొత్తం మనకు మార్గదర్శకంగా ఉండటంతో పాటు ఏవైనా నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మెదడులోని ఈ భాగం పనిచేస్తుంది.
మనం ఏం మాట్లాడతాం అనేది కంట్రోల్ చేసేది కూడా ఇదే భాగం (అంటే మన ఆలోచనల ద్వారా ఫ్రేమ్ చేసుకునే మాటలు, అంతే తప్పించి మాటలను గొంతుకి పంపించే భాగం కాదు). అలాగే మనం చూపించే కోపం, ద్వేషం, భయం వంటి ఎమోషన్లు కూడా ఈ ఫ్రాంటల్ లోబ్ ద్వారానే జరుగుతూ ఉంటాయి.ఈ నేపథ్యంలో క్రీస్తుపూర్వం 3000 సంవత్సరంలో రాయబడిన వేదాలలో శరీరంలోని చక్రాల గురించి ప్రస్తావించబడుతూ.. ఆజ్ఞా చక్రం గురించి వివరించబడింది. ఆజ్ఞా చక్రం మనం పైన చెప్పుకున్న ఫ్రాంటల్ లోబ్ ప్రదేశంలో.. అంటే రెండు కనుబొమల మధ్య నుదుటి భాగంలో ఉంటుంది అని ప్రస్తావించబడింది.
ఈ ప్రదేశంలో బొట్టు పెట్టడం ద్వారా.. వేలితో ఆ ప్రదేశంలో వత్తిడి సృష్టించడం ద్వారా ఆ ఆజ్ఞా చక్రం ఉత్తేజితం చేయొచ్చు అన్న కారణంలో బొట్టు పెట్టడం అలవాటుగా మారింది. ఇలా బొట్టు పెట్టడం ద్వారా ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లు చూడడం అలవాటు అవుతుంది అని, ఎలాంటి పక్షపాత ధోరణి ఉండదని, అలాగే ఆలోచనల్లో ఉండే తప్పుడు అభిప్రాయాలు, అహంభావం తొలగిపోతుందని పేర్కొనబడింది. శాస్త్రానికి, సైన్స్కీ ముడిపడదని చాలామంది అభిప్రాయపడుతుంటారు. లోతుగా ఆలోచిస్తే ఇలాంటి ఎన్నో రకాల అంశాలు రెండింటికీ మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని తెలియజేస్తాయి.
మరింత సమాచారం తో ఇంకోసారి కలుస్తాను.
గమనిక: ఇది హిందూ మతం గురించి చెప్పినది కాదు. శాస్త్రానికీ సైన్స్కీ ఒక అంశంలో ఉన్న బలమైన సంబంధం గురించి మాత్రమే రాసినది. ఒకవేళ మీరు నాస్తికులు అయితే ఈ ఆర్టికల్ని వ్యతిరేకించినందు వల్ల లాభం ఏమీ లేదు. కావాలంటే మీకు మీరు పరిశోధించి తెలుసుకోండి, అర్థమవుతుంది. ఇక్కడ నేను సైన్స్ చెబుతున్నాను.. మతం గురించి కాదు.