ఒకవైపు ప్రాణాలతో పోరాటం, మరోవైపు ఆశయం కోసం ఆరాటం…
ఒకవైపు ప్రాణాలతో పోరాటం, మరోవైపు ఆశయం కోసం ఆరాటం… ఒక మహా సంకల్పాన్ని అడ్డుకునే విధిని ఎదిరించే ఈ అమ్మాయి నేటి యువతకు స్ఫూర్తి దాయకం…అరుదైన ఎముకల వ్యాధి (ఆస్టియోజెనెసిస్ ఇంపెర్ఫెక్టా)తో బాధపడుతున్న ఓ మహిళా అభ్యర్థి ఏకంగా ప్రాణవాయువు సిలిండర్‌తోనే సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యారు. కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాకు చెందిన 24 ఏళ్ల లతీషా అన్సారీ పుట్టినప్పటి నుంచి ఎముకలు పెళుసుబారిపోయే వ్యాధికి చికిత్స పొందుతున్నారు. దీనికితోడు ఏడాది కాలం నుంచి శ్వాసపరమైన ఇబ్బందులూ పెరిగిపోయాయి. ఫలితంగా ఆమె వెంట 24 గంటలూ ప్రాణవాయువు సిలిండర్ ఉండాల్సిన పరిస్థితి. ఆమెకు సివిల్స్ అంటే ప్రాణం. దీంతో ఆదివారం ఆమె చక్రాల కుర్చీలో ప్రాణవాయువు సిలిండర్‌తో తిరువనంతపురం పరీక్ష కేంద్రంలో సివిల్స్ పరీక్షకు హాజరయ్యారు. లతీషా దుస్థితి గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ పీఆర్ సుధీర్‌బాబు ప్రాణవాయువు సమకూర్చే చిన్నపాటి పరికరాన్ని పరీక్ష హాలులో ఏర్పాటుచేయించారు. ఇలాంటి పరికరాన్ని ఆమెకు ఉచితంగా అందజేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఏడాదిన్నర కాలంగా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్నానని, తప్పక విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందని లతీషా తెలిపారు. ఎంకామ్ చేసిన లతీషా మలయాళం ఐచ్ఛికంగా సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. మరోవైపు, అరుదైన వ్యాధుల బారిన పడిన చిన్నారులకు సేవలు అందించే అమృతవర్షిణి స్వచ్ఛంద సంస్థకు చెందిన లతా నాయర్ మాట్లాడుతూ.. లతీషా వంటి అభ్యర్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆమెకు వైద్య పరమైన ఖర్చుల నిమిత్తం నెలకు రూ.25,000 అవసరం అవుతాయని తెలిపారు.