యాదాద్రిలో ఆర్జిత పూజలు…


యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఆదివారం నిత్యారాధనలు, భక్తులు ఆర్జిత పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజాము నుంచి మొదలైన కైంకర్యాలు రాత్రి నిర్వహించిన శయనోత్సవ పర్వంతో ముగిశాయి. సుప్రభాతం చేపట్టాక పూజారులు వైష్ణవ ఆచారంగా ప్రతిష్ఠామూర్తులను ఆరాధిస్తూ హారతి నివేదించారు. ఉత్సవమూర్తులను పంచామృతంతో అభిషేకించి తులసీ పత్రాలతో అర్చించారు. కవచమూర్తులకు స్వర్ణ పుష్పార్చన, సహస్రనామ పఠనాలతో అష్టోత్తరం చేపట్టారు. బాలాలయ మహామండపంలో కొనసాగిన అష్టోత్తరంలో పలువురు భక్తులు కుటుంబ సభ్యులతో పాల్గొని ఆశీస్సులు పొందారు. పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నిత్యకల్యాణం, శ్రీ సుదర్శన నారసింహహోమం పర్వాలు జరిగాయి. పలు ప్రాంతాలకు చెందిన భక్తులు మొక్కు పూజలు చేపట్టి ఆశీస్సులు పొందారు. శ్రీ స్వామి కల్యాణోత్సవంలో భక్త దంపతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణోత్సవంలో గజవాహన సేవోత్సవాన్ని చేపట్టారు. సాయంత్రం అలంకార సేవోత్సవాలను నిర్వహించి రాత్రి ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన జరిపారు. దర్బారు సేవోత్సవాన్ని చేపట్టి నిత్యరాబడిని వెల్లడించారు. పలు ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. చరమూర్తుల మందిరంలో రామలింగేశ్వరుడిని కొలుస్తూ అభిషేకం, అర్చనలు నిర్వహించారు. అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట ఆలయంలోనూ నిత్యారాధనలు, భక్తుల ఆర్జిత పూజలు కోలాహలంగా కొనసాగాయి.

గుట్టలో భక్తజన సందోహం
యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: రాష్ట్ర అవతరణ దినోత్సవం, వారాంతపు సెలవురోజు కావడంతో పలు జిల్లాలకు చెందిన యాత్రికులతో ఆదివారం యాదాద్రి పుణ్యక్షేత్రం భక్తులమయంగా మారింది. మొక్కు పూజలు తీర్చుకునే భక్తులతో ఆలయ మండపాలు కిక్కిరిసి పోయాయి. శ్రీ స్వామి అమ్మవారల నిత్యకల్యాణ మహోత్సవాన్ని 101 మంది దంపతులు జరిపించారు. దైవదర్శనం కోసం సముదాయాలలో గంటలకొద్ది నిల్చున్నారు. లఘు దర్శన విధానాన్ని అమలుపరిచారు. పట్టణ, ఆలయ వీధుల్లోనే కాకుండా పాతగుట్టలోనూ కోలాహలం ఏర్పడింది. రద్దీతో ఆలయానికి రూ.23.27 లక్షల నిత్య ఆదాయం చేకూరింది. ప్రత్యేక దర్శనాలతో రూ.6.68 లక్షలు చేకూరాయి. ప్రసాదాల విక్రయంతో రూ.8.73 లక్షలు జమయ్యాయి.

About The Author