ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు…
ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, దేవాలయ లీజు భూములపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగుల వేతన సమస్యల పరిష్కారం, ఆలయ భూముల పరిరక్షణ, లీజు భూములు, ఆన్ లైన్ సేవలు, తదితర అంశాలపై ఆ శాఖ అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సుధీర్ఘంగా సమీక్షించారు. సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… ఆలయ భూములు కబ్జా చేసిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది వద్దని, దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల లీజుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలన్నారు. దేవాలయ భూములకు సర్వే చేసి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయలన్నారు. న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నామమాత్రపు ధరకు దేవాదాయ శాఖకు సంబంధించిన షాపులను లీజుకు తీసుకొని తిరిగి వాటిని అధిక అద్దెకు సబ్ లీజుకు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అద్దెల విషయంలో కూడా పునఃసమీక్ష చేసుకోవాలని సూచించారు. ఆలయ భూముల ద్వారా వచ్చే ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలన్నారు. ఉద్యోగుల పే స్కేల్ విషయంలో వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. దేవాలయాల్లో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు- ప్రత్యమ్నాయ మార్గాలను చూడాలన్నారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ బ్యాగులను నిషేదించాలన్నారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వసతి గృహాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని చెప్పారు. కామన్ గుడ్ ఫండ్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం అర్చకుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ధూపదీప నైవేద్య పథకం ద్వారా అర్చకుల గౌరవం వేతనం పెంచిందని…. ఆలయాల్లో స్వామి వారికి సరిగా ధూపదీపం అందుతుందో లేదో అనే విషయంలో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ఆన్ లైన్ సేవలను అంతరాయం లేకుండా కొనసాగించాలని, యాదాద్రి, వేములవాడ ఆలయాల్లో ప్రత్యేక ఐటీ విభాగాన్ని ప్రారంభించి, ప్రత్యేక వైబ్ సైట్ ను రూపోందించాలని చెప్పారు.
ఈ సమీక్షలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్ శ్రీనివాస రావు, రీజినల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, హైదరాబాద్, వరంగల్ జిల్లాల డిఫ్యూటీ కమిషనర్లు, వివిధ జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు, ఈవోలు పాల్గోన్నారు.