ఆసియాలో ప్రథమంగా తెలంగాణలో జరగనున్న 32వ ఇస్టా కాంగ్రెస్ సదస్సు…
ఆసియాలో ప్రథమంగా తెలంగాణలో జరగనున్న 32వ ఇస్టా కాంగ్రెస్ సదస్సుతో తెలంగాణ విత్తనరంగం మరింత బలోపేతం కావాలని, అత్యంత నాణ్యమయిన విత్తనాలను రైతులకు అందించేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న విత్తన పరిశోధనలు ఉపయోగపడుతున్నాయని, దానికి ఇస్టా సదస్సు మరింత దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. ఈ నెల 26 నుండి జులై 3 వరకు ప్రతిష్టాత్మకంగా జరగనున్న 32వ అంతర్జాతీయ విత్తన కాంగ్రెస్ సదస్సు నేపథ్యంలో టూరిస్ట్ ప్లాజాలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకుముందు నోవాటెల్, హైటెక్స్, హెచ్ఐసీసీలలో ఇస్టా కాంగ్రెస్ సదస్సు వేదికల ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అంతర్జాతీయ విత్తనరంగంలో పరిశోధనల అనుభవాలను అందిపుచ్చుకుని తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుకుంటున్నామని, తెలంగాణ సీడ్ బౌల్ కావాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష అని, అందుకు అనుగుణంగా కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు గత ఐదేళ్లుగా కార్యాచరణ చేయడం జరిగిందని, ఆ అనుభవంతోనే ఇస్టా కాంగ్రెస్ కు అతిథ్యమిస్తున్నామని మంత్రి అన్నారు. ఈ సదస్సుతో అంతర్జాతీయ విత్తన మార్కెట్ కు రాష్ట్రం నుండి విత్తనాల ఎగుమతికి అవకాశాలు మెరుగవుతాయని, నూతన సాంకేతికతతో కూడిన విత్తనాలు రైతులకు అందుబాటులోకి వస్తాయని నిరంజన్ రెడ్డి గారు తెలిపారు. ప్రపంచ విత్తనభాండాగారంగా తెలంగాణ ఎదిగేందుకు ఇది దోహదపడుతుందని, ప్రకృతి, నైసర్గిక స్వరూపం, భౌగోళికతలపరంగా ప్రపంచంలోని అన్ని దేశాలలో పండే పంటలన్నీ తెలంగాణలో పండుతాయని, వాతావరణం, నేలలు, నాణ్యమయిన విత్తన ఉత్పత్తికి తెలంగాణ ప్రాంతం అనుకూలం అని అన్నారు. రైతులకు విత్తనపంటల సాగుతో అధికాదాయం అందించాలంటే పంటల ఉత్పాదకత, నాణ్యత పెరగాలని, ఇస్టా కాంగ్రెస్ చర్చలు, మేధోమధనంతో పలు నూతన విషయాలు రైతులకు అందుతాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతం అనుకూలతలో 40 ఏళ్ల క్రితమే రాష్ట్రంలో అంతర్జాతీయ మెట్ట పరిశోధనల పంటలపై పరిశోధనలు చేసే ఇక్రిసాట్ ఇక్కడ నెలకొల్పారని, మారుతున్న పర్యావరణ మార్పులను తట్టుకుని నిలబడే వంగడాలు, విత్తనోత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం అని అన్నారు. సదస్సుకు దేశంలోని పలు పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల నుండి 300 మంది నిపుణులు హాజరవుతారని, 70 దేశాల నుండి 800 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ముగింపు వేడుకలకు గవర్నర్ నరసింహన్ గారు హాజరవుతారని, తెలంగాణ వైభవం, సంస్కృతిని చాటేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా కమీషనర్ రాహుల్ బొజ్జా, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసి సజ్జన్నార్, తెలంగాణ సీడ్స్ డైరెక్టర్ కేశవులు తదితరులు హాజరయ్యారు.