ఆదాయ పన్ను రిటర్నుల ఫైలింగ్ కోసం పాన్ కార్డు తప్పనిసరి కాదు…
న్యూదిల్లీ: ఆదాయ పన్ను రిటర్నుల ఫైలింగ్ కోసం పాన్ కార్డు తప్పనిసరి కాదని, ఆధార్ కార్డుతోనూ రిటర్నుల ఫైలింగ్ చేయొచ్చని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్.. ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాన్ నంబర్‌ను ఇవ్వాల్సిన అవసరమున్న చోట ఆధార్ నంబర్‌ను పొందుపరిస్తే సరిపోయే వీలు కలిగింది. దీంతో పాన్ కార్డు లేని వారు ఆధార్ నెంబరుతో వీటిని వేసుకునే అవకాశం వచ్చింది. అయితే, దీనిపై స్పందించిన కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ పలు కీలక విషయాలు తెలిపారు. ‘‘పాన్ కార్డు లేకుండా కేవలం ఆధార్ కార్డుతో రిటర్నులు దాఖలు చేసే వారికి నేరుగా కొత్త పాన్ కార్డును అందించాలనుకుటున్నాం. ఇందుకు సంబంధించిన అధికారి.. పన్ను చెల్లింపుదారుడికి స్వయంగా పాన్ కార్డును ఇచ్చే అధికారాన్ని చట్టం ఇస్తోంది’’ అని చెప్పారు.
ఆధార్ కార్డుతోనూ రిటర్నుల ఫైలింగ్ చేయొచ్చని నిర్మలా సీతారామన్ ప్రకటన చేసిన అనంతరం.. ఇక పాన్ కార్డు మరుగున పడినట్లేనా? అని ప్రమోద్ చంద్రను మీడియా అడిగింది. దీనికి ఆయన సమాధానం చెబుతూ… ‘‘ఈ విషయాన్ని ఇలా అర్థం చేసుకోవడం సరికాదు. పాన్ కచ్చితంగా మరుగున పడలేదు. అది మనుగడలోనే ఉంటుంది. ఆదాయ పన్ను రిటర్నుల ఫైలింగ్ వేసేవారికి ఇది ప్రభుత్వం కల్పిస్తున్న అదనపు సౌకర్యం మాత్రమే. పాన్ లేకపోతే.. రిటర్నుల ఫైలింగ్ ప్రక్రియలో వారు ఇబ్బందులు ఎదుర్కోకుండా దానికి బదులుగా అవసరమున్న చోట ఆధార్ నంబర్‌ను పొందుపర్చే సౌకర్యాన్ని కల్పిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. ఆధార్ కార్డు, పాన్ కార్డులను అనుసంధానం చేయడం ఇప్పుడు తప్పనిసరి అని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో 120 కోట్ల మంది ఆధార్‌ను, 41 కోట్ల మంది పాన్‌ను కలిగి ఉన్నారు. 22 కోట్ల పాన్ కార్డులు.