గ్రామ సచివాలయ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా…


గ్రామ సచివాలయ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా కార్యకలాపాలు నిర్వహించేలాగా సమన్వయ శాఖలు విధుల నిర్వహణలో ప్రణాళికలను పకడ్భందీగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సచివాలయంలోని సీఎస్ సమావేశమందిరంలో 3వ గ్రామ సెక్రటేకరీల నియామకంపై సమన్వయశాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శుల నియామక ప్రక్రియలను ఆయా శాఖల మార్గదర్శకాలకు, నియమ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలన్నారు. ఆ శాఖల ద్వారా సిబ్బందికి అందజేయాల్సిన శిక్షణను అందించేందుకు తగిన ప్రణాళికలను రూపుదిద్దాలన్నారు. నూతనంగా ఎంపికకాబడుతున్న గ్రామ సెక్రటరీ కార్యాలయ ఉద్యోగులకు తగిన విధంగా విధులను కేటాయించడంతో పాటు వాటి పర్యవేక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. పనిభారం ఆధారంగా సిబ్బందికి బాధ్యతలను, విధులను కేటాయించడం కోసం శాశ్వతమైన ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ) ఆధ్వర్యంలో ఎంపికయ్యే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆయా మండలాల పరిధికి అనుగుణంగా గ్రామాల్లో విధులను నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. 2000 మంది జనాభా పరిధిలో గ్రామ సెక్రటరీ 10 శాఖలకు సంబంధించి విధులను నిర్వర్తించడం జరుగుతుందన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తి చేసి అక్టోబర్ 2, 2019 నాటికి ఆయా ఉద్యోగులు విధుల్లో చేరాల్సి ఉంటుందన్నారు. గ్రామ సచివాలయ పరిధిలోని గ్రామ ప్రజలకు అవసరమైన కనీస సేవల నేపథ్యంలో వ్యవసాయం అనుబంధ రంగాలు, పశు సంవర్థక శాఖ, వైద్య ఆరోగ్యం, త్రాగునీరు, పరిశుభ్రత, సామాజిక భద్రత (పెన్షన్లు, ఇన్సూరెన్స్), సంక్షేమ కార్యక్రమాలు, జీవనోపాధి, ఉపాధి అవకాశాలు, మాతా శిశు సంక్షేమం, భద్రత, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపకార వేతనాలు, జలవనరులు, విద్యుత్తు, ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధారంగా ఆయా గ్రామ పంచాయతీల సచివాలయాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు.జులై నుండి సెప్టెంబర్ లోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసి నియామక పత్రాలను అందజేయాలని ప్రతిపాదించామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ నెలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆయా గ్రామాలకు ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ నెలాఖరుకల్లా నియామక ఉత్తర్వులు అందించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు, కరికాలవలనన్, శ్యామల రావు, హెచ్. అరుణ్ కుమార్, గిరిజా శంకర్, ఎం. రవిచంద్ర, విజయకుమార్, సాల్మన్ అరోఖ్యరాజ్, పి.ఉషారాణి,అదనపు డీజీ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. #iprap

About The Author