గోదావరి పలుకరింపు

-ఇటు మేడిగడ్డనుంచి.. అటు సుందిల్లనుంచి గోదావరి పలుకరింపు
-అన్నారంలో పెరుగుతున్న నీటిమట్టం.. బరాజ్‌కు చేరిన 1.60 టీఎంసీల నీరు
-కొనసాగుతున్న ప్రాణహిత వరదప్రవాహం
-వరదతో కళకళలాడుతున్న త్రివేణిసంగమం
-కన్నెపల్లిలో నాలుగు మోటర్లతో ఎత్తిపోత
-నేడు ఐదో మోటర్ ప్రారంభం!
-సుందిల్ల బరాజ్‌నుంచి దిగువకు గోదారి పయనం
-అప్రోచ్ చానల్ ద్వారా హెడ్‌రెగ్యులేటరీకి
-వెట్న్‌క్రు సిద్ధమవుతున్న అన్నారం పంప్‌హౌస్

ఒకవైపు మేడిగడ్డ బరాజ్ నుంచి ఎదురేగుతున్న జలాలు.. మరోవైపు సుందిల్ల బరాజ్ నుంచి దిగువన అన్నారం పంప్‌హౌస్‌కు చేరుకుంటున్న నీరు.. వెరసి.. గోదారమ్మ తనను తానే పలుకరించుకుంటున్నది. ప్రాణహిత వరదనీటితో కాళేశ్వరం సమీపంలోని త్రివేణి సంగమం కళకళలాడుతున్నది. మేడిగడ్డ బరాజ్ అప్రోచ్ చానల్ ద్వారా వస్తున్న నీటిని కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని మోటర్ల ద్వారా ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తున్నారు. దీంతో గోదావరి జలాలు ఎదురెక్కుతున్నాయి. ఇప్పటికే మంథని మండలం ఆరెంద, మల్లారం, ఖాన్‌సాయిపేట, ఖానాపూర్ గ్రామ తీరాలకు చేరుకున్నాయి. క్రమంగా గోదావరిలో నీరు పెరుగుతుండగా, మరో రెండ్రోజుల్లో మంథని తీరానికి చేరుకోనున్నాయి. తెలంగాణలో గోదావరికి ఎగువన పెద్దగా వర్షాలు లేకపోవడంతో ప్రాణహిత నుంచి వస్తున్న కాళేశ్వరం నీళ్లే ఈ ప్రాంతానికి వరప్రదాయినిగా మారనున్నాయి. ప్రాణహిత వరద కొనసాగుతుండటం, మేడిగడ్డ బరాజ్ అప్రోచ్ చానల్ నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుతున్న నీరు మోటర్లకు సరిపోయేంత ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా ఇంజినీర్లు ఎత్తిపోస్తున్నారు. ఇప్పటివరకు మూడు మోటర్లతో నీటిని ఎత్తిపోయగా, బుధవారం నాలుగో మోటర్‌ను ఇంజినీర్లు విజయవంతంగా ప్రారంభించారు. బుధవారం వరకు అన్నారం బరాజ్‌కు 1.63 టీఎంసీల నీరు చేరుకున్నది. అన్నారం బరాజ్‌లో ఎనిమిది కిలోమీటర్ల వరకు గోదావరి నీరు రివర్స్ పంపింగ్‌తో నదిలో పరుచుకుంటున్నది.

మొదలైన నాలుగో మోటర్
కన్నెపల్లి పంప్‌హౌస్‌లో గత మూడురోజులుగా మూడు మోటర్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో నంబర్ మోటర్‌ను బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభించి, మధ్యా హ్నం రెండున్నరకు ఆఫ్ చేశారు. తిరిగి రాత్రి మళ్లీ ప్రారంభించి, నీటిని ఎత్తిపోశారు. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నదని ఇంజినీర్లు తెలిపారు. ఈ క్రమ ంలో గురువారం ఐదో మోటర్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. నీటి ఎత్తిపోతలు ఊపందుకోవడంతో కన్నెపల్లి పంప్‌హౌస్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది.

కొనసాగుతున్న ప్రాణహిత ప్రవాహం
మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నదిలోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. గత ఐదురోజులుగా కొనసాగుతున్న ప్రవాహంతో ప్రాణహిత కళకళలాడుతున్నది. నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో నదిలో నాటు పడవల ప్రయాణం నిలిపివేశారు. రాపనపల్లి సమీపంలో తెలంగాణ- మహారాష్ట్ర మధ్య నిర్మించిన వంతెనపై రాకపోకలు సాగుతున్నాయి. నదిలోకి వస్తున్న వరదనీటితో కాళేశ్వరం సమీపంలోని త్రివేణి సంగమం జలకళ సంతరించుకుంది.

భద్రాద్రి వద్ద 16.3 అడుగులకు..
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం పట్టణం వద్ద బుధవారం సాయంత్రం ఆరు గంటలకు గోదావరి నీటిమట్టం 16.3 అడుగులుగా ఉన్నది. ఉదయం 6 గంటలకు 16.7 అడుగులున్న నీటిమట్టం క్రమేపీ తగ్గుముఖం పట్టిం ది. జూన్ నెల వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 2.3 అడుగులు మాత్రమే ఉండగా, ఇటీవలి వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. నిన్నమొన్నటివరకు ఎడారిని తలపించిన గోదావరికి జలకళ వచ్చింది.

బుధవారం వరకు అన్నారం బరాజ్‌కు
1వ మోటర్ నుంచి 0.8 టీఎంసీ నీరు (9320 క్యూసెక్కులు)
3వ మోటర్ నుంచి 0.2 టీఎంసీ నీరు (2312 క్యూసెక్కులు)
4వ మోటర్ నుంచి 600 క్యూసెక్కులు
6వ మోటర్ నుంచి 0.5 టీఎంసీ నీరు (5225 క్యూసెక్కులు)
మొత్తం 18857 క్యూసెక్కులు (1.63 టీఎంసీలు).
Kaleshwaram2
తుపాకులగూడెం వద్ద తగ్గుతున్న ప్రవాహం
దేవాదుల ఇన్‌టేక్ వెల్, తుపాకులగూడెం బరాజ్ వద్ద రెండు రోజుల క్రితం 75.6 మీటర్లకు చేరుకున్న గోదావరి నీటిమట్టం తగ్గుముఖంపట్టి, బుధవారం సాయంత్రం 74.16 మీటర్లకు చేరుకొన్నది. వర్షాలు తగ్గడంతో గోదావరి ప్రవాహం కూడా తగ్గింది. అయితే దేవాదుల ఇన్‌టేక్ వెల్‌వద్ద నీటిమట్టం మోటర్లు నడిచేందుకు అవసరమైన ప్రవాహం కంటే ఎక్కువ ఉండటంతో పంపింగ్ కొనసాగుతున్నది.

సుందిల్ల బరాజ్ మూడో గేటు ఎత్తివేత
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన సుందిల్ల బరాజ్ మూడో గేటు ను అన్నారం పంపుహౌస్ మోటర్ల వెట్న్ నిర్వహించేందుకు ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బుధవారం ఎత్తారు. దిగువకు వదిలిన 0.06 టీఎంసీల నీరు అప్రోచ్ చానల్ ద్వారా అన్నారం పంప్‌హౌస్ హెడ్‌రెగ్యులేటరీకి చేరుకొంటున్నది. పూర్తిగా నీరు చేరిన తర్వాత హెడ్‌రెగ్యులేటరీ గేట్లను ఎత్తి, పంప్‌హౌస్‌లోకి తరలిస్తారు. ఆ తర్వాత మోటర్లకు వెట్న్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సుందిల్ల బరాజ్ ఈఈ బండ విష్ణుప్రసాద్, డీఈ వేణుబాబు, అన్నారం పంపుహౌస్ ఈఈ ఎలకొండ యాదగిరి, డీఈలు మధుసూదన్, వెంకటేశ్వర్లు, జేఈలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

About The Author