APSRTC లో వయోవృద్ధులకు ఇప్పుడు రిజర్వేషన్..
శ్రీకాకుళం: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులలో వయోవృద్ధులకు సీట్లలో ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆర్.టి.సి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఆర్.టి.సి కాంప్లెక్స్ లో తనిఖీలు నిర్వహించారు. కాంప్లెక్స్ లో సౌకర్యాలు, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీసారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో రిజర్వేషన్ కౌంటర్లు, దుకాణాలు, మరుగుదొడ్లు, ప్లాట్ ఫారాలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. దూర ప్రాంతాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. విశాఖపట్నం నాన్ స్టాప్ బస్సులకు, ఇతర దూర ప్రాంత బస్సులకు కల్పిస్తున్న రిజర్వేషన్ ప్రక్రియను పరిశీలించారు. గంటన్నర సమయం దాటి ప్రయాణించవలసిన ఇచ్ఛాపురం, పలాస, సీతంపేట తదితర బస్సలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. వెంటనే రిజర్వేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. వయోవృద్ధులకు బస్సులలో ప్రత్యేకంగా సీట్లు రిజర్వ్ చేయాలని చెప్పారు. కాంప్లెక్స్ దుకాణాల్లో విక్రయిస్తున్న తినుబండారాలు, కూల్్డ్రింకులు తదితర సామగ్రిని గరిష్ట రిటైల్ ధర (ఎం.ఆర్.పి) కంటే అధికంగా విక్రయించరాదని చెప్పారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని, నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలని అన్నారు. మరుగుదొడ్లలో వాడిన నీరు నిలువలేకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కాంప్లెక్స్ ఆవరణలో వర్షం కురిసినపుడు నీటి నిలువ లేకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రయాణీకులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నిస్తామని అన్నారు. అందుకు లోతట్టు ప్రదేశంలో సంప్ ఏర్పాటు చేయుటకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఆర్.టి.సి కాంప్లెక్స్ లో మురుగునీటి కాలువను మునిసిపల్ మురుగునీటి కాలువతో అనుసంధానం చేసి సమస్య పరిష్కారం చేయుటకు కృషి చేస్తామని అన్నారు. మునిసిపల్ మురుగు నీటి కాలువ నుండి నీటిని త్వరితగతిన పంపింగు చేసి తొలగించుటకు అవకాశాలు పరిశీలించాలని మునిసిపల్, ఆర్ టి సి అధికారులు, ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేసారు. ఆర్ టి సి తనిఖీ అనంతరం పాత బ్రిడ్జి – జాతీయ రహదారి అనుసంధాన రహదారి పనులను కలెక్టర్ పరిశీలించారు. రహదారి పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. రహదారి విస్తరణ చేపట్టిన చోట తారు రహదారి నిర్మాణం జరగాలని అన్నారు. రహదారి విస్తరణలో భాగంగా తొలగించాల్సిన భవనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్ధ కమీషనర్ ఆర్.శ్రీరాములు నాయుడు, రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, ఆర్.టి.సి డిప్యూటీ సి.టీ.ఎం కె. శ్రీనివాసరావు, డిపో మేనేజర్ వి.ప్రవీణ, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ పి.సుగుణాకర రావు, మునిసిపల్ ఇంజినీర్ జి.వెంకటేశ్వర్లు, సహాయ సిటీ ప్లానర్ కుమార్, తహసీల్దార్ ఐ.టి. కుమార్ తదితరులు పాల్గొన్నారు. #iprap Srikakulam District