ఇస్మార్ట్ శంకర్… సినిమా రివ్యూ…
https://www.youtube.com/watch?v=JLgYXA_q5t8
వేరొకరి మెమరీని తీసి మరొకరి బ్రెయిన్‌లో ఇంప్లాంట్ చేయడమనే ‘సైన్స్ ఫిక్షన్’తో కూడిన ఐడియా చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. కానీ ఆ విషయాన్ని న్యూరో సైంటిస్ట్ చెబుతున్నప్పుడు ‘ఆడిది తీసి ఈడికి పెట్టేయ్’ అంటాడు సిబిఐ ఆఫీసర్… ‘వాడి చొక్కా తీసి వీడికి వేసేయ్’ అన్నంత ఈజీగా. చాలా కాంప్లెక్స్ విషయాన్ని చాలా మామూలు విషయమన్నట్టు చూపించడం పూరీ ప్రత్యేకత.
ఇక లవ్‌స్టోరీ విషయానికి వస్తే… హీరోయిన్‌ని రేప్ చేద్దామని వెళ్లిన రౌడీషీటర్ అయిన హీరో గురించి పోలీసులకి కాల్ చేసి కంప్లయింట్ చేస్తుంది సివిల్ ఇంజినీర్ అయిన హీరోయిన్. పోలీసులు వచ్చి తలుపు కొడితే ‘వీడు నాకు నచ్చాడు. మీరు వెళ్లిపోండి’ అంటుంది. ఈ లవ్‌స్టోరీతో కనక్ట్ అవుతారా లేదా అనేది పూరీకి అనవసరం. తన హీరో ఇలాంటోడు, తన హీరోయిన్ అలాంటిది. ఇద్దరూ ప్రేమించుకుంటే ఇలా వుంటది అనేది ఇలా చెప్పడం పూరీ ‘ప్రతిభ’.
పైన చెప్పినలాంటి వాటికి ఎలా రియాక్ట్ అవుతారు, వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై ‘ఇస్మార్ట్ శంకర్’ ఆడియన్స్ డివైడ్ అవుతారు. ఇది ఫక్తు పూరీ మార్కు సినిమా. మెమరీ ట్రాన్స్‌ఫర్ అనే కాన్సెప్ట్‌ని 2016లో వచ్చిన క్రిమినల్ అనే అమెరికన్ సినిమా నుంచి తీసుకుని దానికి తన మార్కు ట్రీట్‌మెంట్ జోడించాడు పూరి జగన్నాథ్. ఆ కాన్సెప్ట్ ఒక్కటీ తీసేస్తే… ఇటీవల వచ్చిన పూరి సినిమాలకి, దీనికీ పెద్ద తేడా ఏముండదు. కాకపోతే ఇంతకాలం ‘లవర్‌బాయ్’లా క్యూట్‌గా కనిపించిన రామ్ ఈసారి ‘బ్యాడ్‌బోయ్’గా మారిపోయాడు. అచ్చమయిన రౌడీని తలపించే వేష భాషలతో ఇలాంటి మాస్ క్యారెక్టర్ ఇస్తే ఏమి చేయగలడో రామ్ చూపించాడు. ఈ చిత్రానికి అతనెంత ఆకర్షణ అయ్యాడంటే… ఆకట్టుకునే లక్షణం ఒక్కటీ లేని కొన్ని సన్నివేశాలని కూడా చూడగలిగేలా చేసాడు.
మణిశర్మ సంగీతం మరో కవచంగా మారడంతో పూరీ బలహీనతలు కొన్ని చోట్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో కలిసిపోయాయి. రెండు మాస్ పాటలతో పాటు నేపథ్య సంగీతం అదరగొట్టిన మణిశర్మ ఆల్రెడీ అంచనాలు రేకెత్తించిన సినిమాని ‘పాసబుల్’ ఫేర్‌గా మార్చగలిగాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అచ్చంగా పూరీ స్కూల్ సినిమాలకి తగ్గట్టే వున్నాయి. ‘నువ్వు ఇంట్లో పెరిగితే నేను పెంటలో పెరిగాను’ అని తన గురించి చెప్పుకుంటాడు హీరో. అలా పెరిగినవాడు ఎలా మాట్లాడతాడో పూరి తన హీరోతో అలాగే మాట్లాడించాడు. అలాంటోడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే చూపించాడు. అలాంటి వాడు ప్రేమలో పడితే ఆ ప్రేమ ఎంత విపరీతంగా వుంటుందో అదే తెరకెక్కించాడు.
పూరి సినిమాల మధ్య ‘ఇస్మార్ట్ శంకర్’కి ఎలాంటి ఇస్పెషల్ క్వాలిటీస్ లేవు. కానీ ఆ ఇస్మార్ట్ శంకర్‌గా నటించిన రామ్ మనకింతవరకు తెలియని నటుడ్ని తెర మీద చూపించి దీనిని తనకో ఇస్పెషల్ సినిమాగా మార్చుకున్నాడు. పూరి సినిమాల్లో కనిపించే విపరీత ధోరణులు అడపా దడపా కనిపించినా కానీ ఈసారి కాస్త కంట్రోల్‌లో వుంచాడు. తన కథకి, సన్నివేశాలకీ ఎంగేజ్ చేయగలిగే లక్షణాలు లేవు కనుక తన హీరోని మాత్రం నమ్ముకున్నాడు. ఆ క్యారెక్టరైజేషన్‌నే కథని నడిపించడానికి వాడుకున్నాడు. ఇది ఇస్మార్ట్ శంకర్‌కి కలిసి వచ్చింది. ఆరంభంలో స్టాండర్డ్ తెలుగు సినిమా హీరోలకి భిన్నంగా కనిపించే అతని తత్వంతో ఆకట్టుకునే హీరో క్యారెక్టర్‌తో చివరి వరకు అదే గ్రాఫ్ మెయింటైన్ చేయించడం దీనికి ప్లస్ అయింది.
ఎంతగా అంటే ద్వితియార్థంలో స్టోరీని ముందుకి తీసుకెళ్లే ఎలాంటి అరెస్టింగ్ పాయింట్ వుండదు. విలన్స్ ట్రాక్ డెడ్ వీక్ అవడంతో అటునుంచి టెన్షన్ అంటూ ఏమీ బిల్డ్ అవదు. డబుల్ ధిమాక్ వల్ల ఆఫీసర్ మెదడులో దొరికిన గొప్ప ఇన్‌ఫర్మేషన్ కానీ, దాని వల్ల హీరో పాత్రలో ట్రాన్స్‌ఫర్మేషన్ కానీ పెద్దగా వుండదు. హీరోయిన్ ట్రాక్‌ని పొడిగించడానికి, మరో రెండు పాటలు జోడించడానికి ఈ ‘డబుల్ సిమ్ కార్డ్’ కాన్సెప్ట్ హెల్పవుతుందే తప్ప కథనం ఆసక్తికరంగా మారదు. అయినా కానీ హీరో వీటిని ఓవర్ లుక్ చేయగలిగేంత విలక్షణమైన కాలక్షేపాన్ని అందిస్తాడు.
ఎప్పటిలానే తుపాకీ మోతలతో కూడిన యాక్షన్‌తో పూరి లాగించేసాడు. దర్శకుడిగా పూరి డెఫినెట్‌గా మునుపటి ఫామ్‌లో లేడు. ఎందుకంటే ఇంత కథతో ‘ఇంతే’ సినిమా తీయగలిగాడు. వంద ఎనర్జీ డ్రింక్‌లు తాగినట్టుగా ప్రతి సీన్‌లోను ఫుల్ ఛార్జ్‌డ్‌గా వున్న రామ్ ఈ చిత్రాన్ని నిలబెడితే, తన పని అయిపోయిందనుకునే వారికి ఇంకా తనలో ఎంత ‘పనితనం’ వుందో చూపించాలనే కసితో పని చేసినట్టున్న మణిశర్మ తన సంగీతంతో శంకర్‌ని నడిపించాడు. నభా నటేష్ సగటు పూరీ మార్కు హీరోయిన్‌లా ‘రౌడీయిజం’ చూపిస్తూ అలాంటి పాత్రలు నచ్చే వారిని ఆకర్షించింది. నిధి అగర్వాల్ పాసివ్ రోల్ పోషించింది. తన బాయ్‌ఫ్రెండ్ మెమరీ మరొకడిలో వుందంటే ఎమోషనల్‌గా ఈ పాత్రకి స్కోప్ వుండాలి. కానీ పూరి ఈ పాత్రకి పూర్తి అన్యాయం చేస్తూ బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీగా పరిమితం చేసాడు ఎందుకో మరి.
పోకిరి టైమ్‌లో పూరి చేతిలో ఇదే కథ పడితే మాస్ సినిమాల్లో క్లాసిక్ అయిపోయి వుండేది. ఇప్పుడు మాత్రం పూరీ ఇటీవల తీసిన సినిమాలతో పోలిస్తే కాస్త మెరుగు అనిపించుకుని ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయింది. ఈ చిత్రానికి ఆల్రెడీ వచ్చేసిన క్రేజ్‌కి తోడు ఓవరాల్‌గా ఓకే అనిపించేట్టు వుంది కనుక ఈసారికి పూరీ ఎఫర్ట్ ‘క్రిటిక్ ప్రూఫ్’ అయిపోయింది. పూరీ ఈజ్ బ్యాక్ అనడానికి లేదు కానీ… ఈసారికి పడిపోకుండా రామ్ చెయ్యి అతడిని గట్టిగా పట్టుకుంది. మాస్ సినిమాలకి మొహం వాచిన టైమ్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ టార్గెట్ ఆడియన్స్ సపోర్ట్‌తో కమర్షియల్ సక్సెస్‌ని అందుకునే అవకాశం మెండుగా వుంది. ఆ పాయింట్‌ని పక్కన పెట్టి సినిమాగా చూస్తే మాత్రం బొటాబొటిగా మెప్పించి ఇది కాస్త ఫరవాలేదులే అనిపిస్తుంది.
సినిమా: ఇస్మార్ట్ శంకర్
రేటింగ్: 2.75/5
బ్యానర్: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనక్ట్స్
తారాగణం: రామ్ పోతినేని, నభా నటేష్, నిధి అగర్వాల్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, సయాజి షిండే, పునీత్ ఇస్సార్, తులసి తదితరులు
కూర్పు: జునైద్ సిద్ధికీ
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: రాజ్ తోట
నిర్మాణం: పూరి కనక్ట్స్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్
విడుదల తేదీ: జులై 18, 2019