తెలుగు రాష్ట్ర్రాల్లో ఖాళీగా రిజర్వాయర్లు


ఆందోళనకరంగా 60 లక్షల ఎకరాల ఆయకట్టు

ఖరీఫ్‌సీజన్‌ ప్రారంభమై 50 రోజులు కావస్తున్నా రెండు ప్రధాన నదుల్లోని రిజర్వాయర్లలోకి ఎలాంటి ప్రవాహాలు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని లక్షల ఎకరాల ఆయకట్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎగువ రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే ఈ నెలాఖరుకు కూడా ఖరీఫ్‌ ఆయకట్టు గురించి ఆలోచించే పరిస్థితి కనిపించడం లేదు. ఆగస్టులో రిజర్వాయర్లలోకి ప్రవాహాలు మొదలైతే ఆలస్యంగా ఖరీఫ్‌కు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అత్యధిక ఆయకట్టు ఆధారపడి ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌, జూరాల తదితర ప్రాజెక్టుల్లోకి ఇప్పటివరకు చుక్కనీరు రాలేదు. మరో ప్రధాన ప్రాజెక్టు తుంగభద్రలోకి కూడా నామమాత్రంగానే వచ్చాయి. దీంతో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద సుమారు 60 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వర్షాధార పంటలు సాగు చేసే రైతుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది.

• ఆలమట్టితో ఆశలు చిగురించినా…!

కృష్ణాబేసిన్‌లో ఎగువన ఉన్న ఆలమట్టిలోకి గత కొన్ని రోజులుగా మెరుగైన ప్రవాహం ఉండటంతో ఆశలు చిగురించాయి. అయితే రెండు రోజులుగా ప్రవాహం 50 వేల క్యూసెక్కులకు పడిపోయింది. 22 వేల క్యూసెక్కుల నీటిని నారాయణపూర్‌కు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు కర్ణాటక నీటిని విడుదల చేసింది. ఆలమట్టి, నారాయణపూర్‌ నిండటానికి మరో 30 టీఎంసీలు అవసరం. మళ్లీ ప్రవాహం పెరిగితేనే కర్ణాటక దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అది కూడా భారీగా వరద వస్తేనే పరిస్థితి మెరుగుపడుతుంది. 9.66 టీఎంసీల సామర్థ్యం గల జూరాలలోకి ఇప్పటివరకు స్థానికంగా కురిసిన వర్షాల వల్ల 0.13 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది.ఈ ప్రాజెక్టు ఆయకట్టుతోపాటు నెట్టెంపాడు, భీమా కోయిల్‌సాగర్‌లు కూడా దీనిమీదే ఆధారపడి ఉన్నాయి. 100 టీఎంసీల సామర్థ్యం గల తుంగభద్రలోకి 12 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. తుంగభద్ర హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కాలువ, ఆర్డీఎస్‌ తదితర ప్రాజెక్టుల కింద ఆయకట్టు తుంగభద్రపై ఆధారపడి ఉంది. తుంగభద్ర నిండి దిగువకు రావడం ద్వారా శ్రీశైలానికి ఉపయోగపడేది. ఈ సంవత్సరం ఆ పరిస్థితి కూడా కనపడటం లేదు. శ్రీశైలంలోకి ఇప్పటివరకు కేవలం 0.33 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. కల్వకుర్తి, హంద్రీనీవా, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు-నగరి ఇలా అనేక ప్రాజెక్టులు దీనిపై ఆధారపడి ఉన్నాయి. ఈ నెలాఖరుకు శ్రీశైలంలోకి కొంత ప్రవాహం వచ్చినా, ఇది నిండి సాగర్‌లోకి వచ్చేది ఆగస్టులోనే. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఆయకట్టు ఉన్న ప్రాజెక్టు నాగార్జునసాగర్‌. కుడి, ఎడమ కాలువలతోపాటు ఏఎంఆర్‌పీతో కలిపి 23 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణాడెల్టా అవసరాలకు కూడా కొంత ఇవ్వాల్సి ఉంది. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు ఇవ్వాల్సి ఉంటుంది.

• గోదావరిలో అతి తక్కువ వరద

గోదావరిలో ఇంత తక్కువ వరద ఎప్పుడూ లేదు. తెలంగాణలో అత్యధిక ఆయకట్టు కలిగిన శ్రీరామసాగర్‌లోకి ఇప్పటివరకు చుక్కనీరు రాలేదు. సింగూరు పూర్తిగా ఎండిపోయింది. నిజాంసాగర్‌దీ ఇదే పరిస్థితి. కడెం, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ రెండోదశ, వరదకాలువ ఇలా అన్ని ప్రాజెక్టుల కింద పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. దిగువన ఉన్న గోదావరి డెల్టాకు మాత్రమే నీటిని విడుదల చేస్తుండగా, పట్టిసీమ ద్వారా ఐదువేల క్యూసెక్కులు కృష్ణాడెల్టాకు విడుదల చేస్తున్నారు. గోదావరిలో ఇప్పటివరకు 90 టీఎంసీలు రాగా, ఇందులో 53 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలో గత పదేళ్లతో పోలిస్తే ఇంత తక్కువ నీటి లభ్యత ఎప్పుడూ లేదు. మొత్తమ్మీద ఖరీఫ్‌ పరిస్థితి ఆందోళనకరంగా మారింది

About The Author