చంద్రయాన్ 2 గురించి వివరంగా…
వాస్తవానికి చంద్రుడి మీద దక్షిణ ధృవంలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా క్లిష్టమైన వ్యవహారం. ప్రపంచవ్యాప్తంగా ఇలా దక్షిణ ధృవం లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్న రెండవ దేశంగా ఈ ప్రయోగం ద్వారా భారత్ సంతరించుకుంటుంది. చైనాకు చెందిన ఛాంఘీ 4th మిషన్ అనేది జనవరి 3, 2019న చంద్రుని దక్షిణ ధృవంలోకి ప్రవేశించటం జరిగింది. అయితే చైనా ఉపగ్రహానికంటే దక్షిణం వైపు మరింత లాటిట్యూడ్‌లో చంద్రునికి మరింత సమీపంగా చంద్రయాన్ -2 ప్రయోగం జరగటం విశేషం.
ఎలా పనిచేస్తుంది?
చంద్రయాన్ -2లో లూనార్ ఆర్బిటర్, లాండర్, రోవర్ భాగాలుగా ఉంటాయి. ఈ మూడూ దేశీయంగానే అభివృద్ధి పరచటం విశేషం. వీటిలో చక్రాలతో కూడిన రోవర్ అనేది చంద్రుని ఉపరితలం మీద కదులుతూ రసాయన విశ్లేషణ చేస్తుంది. అలా సేకరించిన సమాచారం మొత్తాన్నీ చంద్రయాన్ – 2లోని ఆర్భిటర్, లాండర్ ద్వారా భూమికి చేరవేస్తుంది.
లక్ష్యం ఇది!
రోవర్ ద్వారా చంద్రుని స్థలాకృతి, చంద్రుని మీద ఖనిజాలు, మూలక సంపద, వాటర్ ఐస్ వంటి అనేక అంశాల మీద అధ్యయనం చేయడంతోపాటు, ఆర్భిటర్ చంద్రుని ఉపరితలాన్ని 3D మ్యాప్‌లనూ తయారు చేస్తుంది.
15 జూలైన చంద్రయాన్ 2ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినప్పటికీ సాంకేతిక లోపం కారణంగా 56 నిమిషాల ముందు ఈ ప్రయోగాన్ని వాయిదా వేయడం జరిగింది.
చరిత్ర
12, నవంబర్ 2007న రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ మరియు మన ఇస్రో చంద్రయాన్ – 2 ప్రాజెక్ట్ మీద పనిచేయటానికి సంయుక్తంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఆర్భిటర్, రోవర్‌లను రూపొందించే బాధ్యతను ఇస్రో తీసుకోగా, రష్యా స్పేస్ ఏజెన్సీ లాండర్‌ని రూపొందించే బాధ్యతను తీసుకుంది. 2008లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి ఆమోదం తెలిపింది.
2009లో స్పేస్ క్రాఫ్ట్ రెడీ కాగా, 2013లో చంద్రయాన్ -2 పేలోడ్‌ని ఇస్రో సిద్ధం చేసింది. 2016 లోనే చంద్రయాన్ -2 ప్రయోగం చేద్దామని భావించినప్పటికీ ఆ సమయానికి రష్యా లాండర్‌ని సిద్ధం చేయకపోవడంతో అప్పట్లో అది సాధ్యపడలేదు. రష్యా అదే సమయంలో మార్స్ గ్రహం కోసం ఉద్దేశించిన ఫోబోస్-గ్రట్ మిషన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, చంద్రయాన్ -2 ప్రయోగం కోసం లాండర్‌ని రెడీ చెయ్యలేని పరిస్థితుల్లో.. ఎవరి మీదా ఆధారపడకుండా తనకు తాను లాండర్‌ని సిద్ధం చేసుకోవాలని భారత్ భావించింది. మార్చి 2018 లోనే చంద్రయాన్-2 ప్రయోగం జరగాల్సి ఉన్నప్పటికీ అది ఆ తర్వాత ఏప్రిల్, అక్టోబర్‌లకు వాయిదా పడి ఎట్టకేలకి ఇన్నాళ్లకు తుది ప్రయోగానికి సిద్ధమైంది. టెస్ట్ ప్రయోగం సమయంలో ఫిబ్రవరి 2019లో లాండర్ లెగ్స్ రెండు డామేజ్ కావడం జరిగింది.
అంతరిక్ష పరిశోధనల్లో రష్యా, యూఎస్, చైనా వంటి దేశాలతో పాటు నిరంతరం పోటాపోటీగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ భారత్ అగ్రస్థానంలో దూసుకుపోవడానికి సన్నాహాలు చేస్తోంది.