ఆమె ఆలోచనకు రూపం బడిలో పొలం!
ప్రతీ పాఠశాల ఆవరణలో ఒక చిన్న వంటగది, న్యూట్రీషన్ గార్డెన్ ఉండాలనుకున్నాం. ఒకవేళ స్థలం దొరక్కపోతే, టెర్రస్ మీద గార్డెన్ ఏర్పాటుచేయాలని సూచించాం. ఇప్పుడు ఆయా పాఠశాలల్లో వారు పండించుకున్న కూరగాయలతోనే మధ్యాహ్న భోజనాన్ని పోషక విలువలతో తయారుచేస్తున్నారు. గతంలోలాగా సిల్‌చార్, ఐజావల్ నుంచి వచ్చే ట్రక్కుల కోసం ఎదురుచూడటం మానేశారు.
మారుమూల గ్రామాల్లో ఉన్న పిల్లలు చదువుకోవడానికి అనేక సమస్యలుంటాయి. ముఖ్యంగా పోషక విలువలుండే ఆహారం దొరక్క చాలామంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతుంటారు. ఎంతో దూరంలో ఉండే జిల్లా కేంద్రాల నుంచి ఆహార పదార్థాలు, కూరగాయలు వస్తే గానీ పాఠశాలలో సరైన భోజనం పెట్టే పరిస్థితులు ఉండవు. మిజోరాం వంటి బాగా వెనకబడిన రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలు చాలా పాఠశాలలు ఎదుర్కొంటున్నాయి. విద్యార్థులకు సరైన భోజనం దొరక్క, వారు ఉండాల్సిన బరువు కన్నా తక్కువగా ఉంటున్నారనే విషయాన్ని గ్రహించిన ఐఏఎస్ అధికారిణి శశాంకా ఆలా చేసిన గొప్ప ఆలోచన అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆమె ఆలోచనతో అక్కడి లాంగ్‌త్లాయ్ జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం లభిస్తోంది.
మిజోరాంలోని మారుమూల, వెనకబడిన జిల్లాగా పేరొందిన లాంగ్‌త్లాయ్‌కు డిప్యూటీ కమిషనర్ అయిన ఈ ఐఏఎస్ ఇంతకీ ఏం చేశారంటే…!!!
‘కాన్ సికుల్, కాన్ హువన్’ (అంటే నా స్కూలు, నా వ్యవసాయ క్షేత్రం)… శశాంకా ఆలా చేసిన ఈ ఆలోచన మిజోరాంలోని కొండ ప్రాంతమైన లాంగ్‌త్లాయ్ జిల్లాలో ఉన్న పాఠశాలలను ఒక్కసారిగా వ్యవసాయ క్షేత్రాలుగా మార్చేసింది. 2014 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శశాంక ఈమధ్యనే లాంగ్‌త్లాయ్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. మిజోరాం రాష్ట్ర రాజధాని ఐజావల్ నుంచి బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో ఉండే లాంగ్‌త్లాయ్ జిల్లా కేంద్రానికి సుమారు 296 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఐజావల్ నుంచి వర్షాకాలంలో సరిగా లేని రోడ్లపై కారులో వెళ్లడానికి శశాంకకు పది గంటల సమయం పట్టింది. అంటే ఒక రోజు పనివేళలు వృథా అయ్యాయన్నమాట.
వర్షాకాలంలో లాంగ్‌త్లాయ్ జిల్లాలోని 40 నుంచి 170 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఉత్తర ఐజావల్‌లో ఉండే సిల్‌చార్ (180 కిలోమీటర్ల దూరం) నుంచి ట్రక్కుల్లో ఈ ప్రాంతానికి పండ్లు, కూరగాయలు రవాణా అవుతుంటాయి. రోడ్లు బాగోలేకపోవడం, కొండచరియలు విరిగిపడటం వల్ల ఒక్కోసారి సరకు రవాణాకు రెండు మూడు రోజులు పడుతుంది. దాంతో సరకుల ధరలను వర్తకులు అమాంతం పెంచేస్తారు. అంతేకాదు ట్రక్కుల్లో ఎక్కువకాలం నిల్వ ఉండటం వల్ల కూరగాయలు, పండ్ల నాణ్యత లోపిస్తుంది. చక్కెర, ఉప్పులాంటి నిత్యావసర సరకులు కూడా నాణ్యమైనవి లభించవు. ‘‘ఈ జిల్లాకు చెందిన పాఠశాల విద్యార్థుల్లో అధికులు చక్మా, లాయ్ మైనారిటీ వర్గానికి చెందినవారు. ఖరీదైన కూరగాయలు, పండ్లు కొనలేని పరిస్థితి వారిది. దాంతో ఐదేళ్ల వయసులోనే పౌష్టికాహారానికి దూరమై అనారోగ్యం బారిన పడుతున్నారు. పిల్లలు చదువుతున్న పాఠశాలల్లో కూడా వివిధ కారణాల వల్ల పోషక విలువలున్న మధ్యాహ్న భోజనం లభించడం లేదని అర్థమైంది’’ అన్నారు శశాంక.
• ఇంటి తోట ఆలోచన పాఠశాలకు…!
ఐఏఎస్ అధికారిణిగా నగరంలోని తన ఇంటి ఆవరణలోనే రకరకాల పండ్లు, కూరగాయల మొక్కలను పెంచేవారు శశాంక. ఇదే ఆలోచనను స్కూళ్లలో, అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రవేశపెడితే బాగుంటుందనుకున్నారామె. అలా పుట్టిందే ‘కాన్ సికుల్, కాన్ హువన్’. పిల్లలకు పౌష్టికాహారం అందాలంటే మరొకరి మీద ఆధారపడకుండా, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలోనే కావాల్సిన పండ్లు, కూరగాయలు పండించాలనుకున్నారు. ఈ ఆలోచనను ఆమె జిల్లా అధికారులతో పంచుకున్నారు. జిల్లా ఉద్యానవనశాఖ అధికారి, వ్యవసాయాధికారి, స్థానిక కృషి విజ్ఞాన్ కేంద్రానికి చెందిన అధికారి, జిల్లా భూసార పరీక్షాధికారిని టీమ్ మెంబర్లుగా చేసుకుని ‘నా స్కూలు, నా వ్యవసాయ క్షేత్రం’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వారి ద్వారా పాఠశాలల్లో మొక్కలను ఎలా పెంచాలో టీచర్లకు, హెడ్‌మాస్టర్లకు, ఆయా గ్రామాల్లోని స్వచ్ఛంద కార్యకర్తలకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఆయా డిపార్ట్‌మెంట్ల నుంచి మొక్కల పెంపకానికి అవసరమైన మట్టి, ఎరువు, విత్తనాలను అందించారు. ‘‘ప్రతీ పాఠశాలలో మొక్కలు నాటడానికి కనీసం 100 చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించాం. విస్తీర్ణాన్ని బట్టి ఏయే మొక్కలు పెంచాలో నిర్ణయించుకున్నాం. మొదట్లో అసోం నుంచి విత్తనాలను కొన్నాం. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కొన్ని స్వయం సహాయక బృందాలతో చేరి, కేంద్రానికి చెందిన ‘ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన’ (పీఎంకెఎస్‌వై) సాయం తీసుకున్నాం. ఇప్పుడు విత్తనాలను కూడా మేమే ఉత్పత్తి చేసుకుంటున్నాం’’ అన్నారు శశాంక. ‘పీఎంకెఎస్‌వై’ స్కీమ్‌లో భాగంగా జిల్లాకు చెందిన వివిధ శాఖలు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యాయి. పంటలకు అవసరమైన మట్టిని, విత్తనాలను, సేంద్రియ ఎరువులను, తోటపని పరికరాలను వ్యవసాయ, ఉద్యానవన శాఖ అందించాయి. విద్యాశాఖ ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొనేలా చేయూతను అందించింది. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అనుసరించి ప్రాజెక్టుకు కావాల్సినవి సమకూర్చుకున్నారు.
• పిల్లలతో వ్యవ‘సాయం’…
పాఠశాల ఆవరణలో మొక్కల పెంపకానికి విద్యార్థులను భాగస్వాములను చేయాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయలు, పండ్లను తామే పండించుకుంటున్నామనే ఉత్సాహాన్ని పిల్లల్లో తీసుకొచ్చారు. ఆయా పాఠశాలల్లోని సైన్సు టీచర్ల సహకారంతో సాగు ఎలా చేయాలనే విషయాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పారు. శిక్షణలో జిల్లా వ్యవసాయాధికారులు, ఉద్యానవనశాఖ అధికారులు కూడా పాల్గొనేవారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రూపొందించిన టైమ్‌టేబుల్ ప్రకారం ప్రతీ విద్యార్థి వారంలో కనీసం ఒక గంటపాటు ‘న్యూట్రీషన్ గార్డెన్’లో పనిచేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ టైమ్‌టేబుల్‌ను పాఠశాల ఆవరణలో అందరికీ తెలిసేలా ప్రదర్శించారు. మొత్తానికి ఒక క్రమపద్ధతిలో ‘నా స్కూలు, నా వ్యవసాయ క్షేత్రం’ కార్యక్రమాన్ని తొలిదశలో జిల్లాలోని 213 పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విజయవంతం చేశారు శశాంక. ‘‘ప్రతీ పాఠశాల ఆవరణలో ఒక చిన్న వంటగది, న్యూట్రీషన్ గార్డెన్ ఉండాలనుకున్నాం. ఒకవేళ స్థలం దొరక్కపోతే, టెర్రస్ మీద గార్డెన్ ఏర్పాటుచేయాలని సూచించాం. ఇప్పుడు ఆయా పాఠశాలల్లో వారు పండించుకున్న కూరగాయలతోనే మధ్యాహ్న భోజనాన్ని పోషక విలువలతో తయారుచేస్తున్నారు. గతంలోలాగా సిల్‌చార్, ఐజావల్ నుంచి వచ్చే ట్రక్కుల కోసం ఎదురుచూడటం మానేశారు’’ అన్నారామె.
ఈ ప్రయత్నం వల్ల పిల్లలకు పౌష్టికాహారం అందడమేగాక, వారికి ప్రకృతి పట్ల ప్రేమ, సేంద్రియ సాగు పట్ల అవగాహన ఏర్పడటం మొదలయ్యింది. ఇప్పుడిప్పుడే కూరగాయలు, పండ్లతో పాటు పసుపు, అల్లం, మొక్కజొన్న, ముల్లంగి వంటివి కూడా పండిస్తున్నారు. దాంతో ప్రతీ విద్యార్థి ప్లేటు తెలుపు (అన్నం, ఆలుగడ్డ- కార్బోహైడ్రేట్లు), పచ్చ (ఆకు కూరలు, బీన్స్, క్యాబేజీ – విటమిన్లు), ఎరుపు (క్యారెట్, చనా- ఐరన్) రంగుల పదార్థాలతో నిండుగా మారింది. ‘‘ మధ్యాహ్న భోజన పథకానికి ఈ ప్రయత్నం వల్ల మరిన్ని పోషక విలువలను సమకూర్చుతున్నాం.
పౌష్టికాహారం వల్ల పిల్లల ఎదుగుదలకు కృషిచేస్తున్నాం’’ అన్నారు శశాంక. రెండోదశలో ఈ ప్రయోగాన్ని 500 పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు విస్తరించే దిశగా ఆమె ఆలోచన చేస్తున్నారు. మూడోదశలో పౌలీ్ట్రని కూడా జత చేయాలని భావిస్తున్నారు. ఆర్గానిక్ గుడ్లు, చికెన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉత్పత్తి చేసి విద్యార్థులకు అందించాలనుకుంటున్నారు. శశాంక తన ప్రయోగ ఫలితాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా అప్‌డేట్ చేస్తున్నారు. ‘‘దేశవ్యాప్తంగా ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాన్ని ఆయా జిల్లా యంత్రాంగాల ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల్లో అమలుచేస్తే ఎంతో బాగుంటుంది’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవల తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారంటే… ‘నా స్కూలు, నా వ్యవసాయ క్షేత్రం’ కాన్సెప్ట్ ఎంతగా సక్సెస్ అయ్యిందో అర్థమవుతోంది కదా!!