సోయా… లాభాల సోనా…!
* ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
వర్షాధార పంటగా పండించే సోయా సాగు రైతులకు లాభసాటిగా మారింది. తెలంగాణలో ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో సుమారుగా లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో యేటా 2.5 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. సోయా సాగు ఖర్చు తక్కువ.. లాభం ఎక్కువ అంటున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు.
సోయా చిక్కుడు పంటను సాగు చేసేందుకు నల్లరేగడి నేలలు ఎంతో అనుకూలం. అలాగే అధిక సేంద్రియ కర్బనం కలిగిన నీరు నిలువని ఆమ్ల, క్షార గుణం లేని నేలలు అనుకూలంగా ఉంటాయి. ఖరీఫ్ సమయంలో సాగు చేసే సోయా పంటను జూన్ 15 నుంచి జూలై మొదటి వారం వరకు విత్తుకుంటే లాభదాయకంగా ఉంటుంది. రబీ కాలానికి అనుకూలమైన పంట కాదు.
• ఈ వంగడాలు భేష్
జాతీయ స్థాయిలో చేపట్టిన పరిశోధనల ద్వారా దక్షిణ భారతదేశపు రాష్ర్టాలలో సాగుకు అనుకూలమైన నూతన సోయా, చిక్కుడు రకాలు.. ఎంఎ యూఎస్-612, ఎంఎ సీఎస్-1188 -1281, డీఎస్ బీ- 21- 232, కె.డీ.ఎస్ -344/762, ఎస్ఆర్సీఎస్ 7/37 రకాలతో పాటు జే.ఎస్ -335, జె.ఎస్ -93 -05, బాసర-105-110, బీమ్- 105-110 రకాలు మేలైన రకాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ జిల్లాలలో బాసర, బీమ్ రకాల విత్తన సాగు అధికంగా జరుగుతుంది.
• ఈ తెగుళ్లతో జాగ్రత్త
ముఖ్యంగా సోయా, చిక్కుడు పంటను 5 రకాల తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. ఇందులో..
రసం పీల్చే పురుగులు: ఈ రకం పురుగు ఆశించడంతో ఆకుల్లోని రసం పీల్చడం వలన ఆకులు పసుపు, గోధుమ రంగులోకి మారి దిగుబడులు తగ్గుతాయి. వీటి నివారణకు ఎసిఫేట్- 1.5 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
* కాండం తొలిచే ఈగ: ఆలస్యంగా విత్తన చేనులో దీని ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ పురుగు లేత ఆకులపై చిన్న చిన్న గుంటలు చేసి గుడ్లు పెడతాయి. అలాగే ఈగ సోకిన మొక్కల కాండంపై గుండ్రని రంధ్రం కనిపించి దానిచుట్టూ ఎర్రని పదార్థం కనిపిస్తుంది. దీనిని గమనించిన వెంటనే ఎసిఫేట్ – 1.5గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* పెంకు పురుగు: ఈ పురుగు కాండంపై అర్ధ చంద్రకారంలో రంధ్రం చేసి లోపలికి పోయి ప్రధాన కాండం లోపలి పదార్థాన్ని తినడం వల్ల కొమ్మల చివరి భాగం పండిపోతుంది. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ – 2.5 మి.లీ., లేదా ట్రైజోపాస్ 2 మి.లీ., లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* పొగాకు లద్దె పురుగు: ఈ పురుగు ఆకులలోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు జల్లెడగా మరిపోతాయి. దీని నివారణకు మొదటి రెండు దశలలో క్లోరిఫైరిఫాస్ – 2.5 మి.లీ లేదా 1.5 గ్రా, థయోడికార్బ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
శనగ పచ్చ పురుగు: ఈ పురుగు సోయా పంటను ఆగస్టు, సెప్టెంబరులో ఆశిస్తుంది. పంట ఎదిగే దశలో పూత, కాతను తినడం వల్ల పంటను నష్టపోవాల్సి వస్తుంది. దీని నివారణకు గాను ఎకరానికి 20 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పురుగు ఉధృతిని బట్టి ప్లుబెండమైడ్ 0.2 గ్రా. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ – 0.5 గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది.
• సస్యరక్షణ చర్యలు ప్రధానం
సోయా పంట ఎదుగు దశలో సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. భూమి లోపల తేమ సంరక్షణ కోసం ఎడ్ల గుంటుకను వాడాలి. మొక్కలు ఆరోగ్యకరంగా లేవని గమనిస్తే రసాయన ఎరువులను వాడాలి. ఎకరానికి 25 – 30 కిలోల యూరియా, 15 – 20 కిలోల పోటాష్ దుక్కిలో వేయాలి. అలాగే నీళ్లలో కరిగే రసాయనిక ఎరువులు – 13-0-45, 20-20-20, 19-19-19 ఎన్పీకే రసాయన ఎరువులను ఎకరానికి 2 కిలోల చొప్పున పిచికారీ చేసుకొని చిన్నపాటి మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయి.
– శ్రీధర్చౌహాన్, సీనియర్ శాస్త్రవేత్త, ఆదిలాబాద్..