రాజ్యసభలో ఆర్టికల్ 370రద్దు బిల్లు..!
జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన బిల్లును నేడు రాజ్యసభ్యలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రతిపాదించారు. ఉదయం 11 గంటలకు మొదలైన రాజ్యసభ సెషన్‌లో ఆయన జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లుతోపాటు ఆర్టికల్ 370 రద్దు చేస్తామని ప్రకటించారు. దీంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఆందోళనకు దిగాయి. గందరగోళం మధ్య కొద్దిసేపు రాజ్యసభ టీవీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ద్వారానే ఈ బిల్లు రద్దు జరుగుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు కశ్మీర్‌లో నియోజకవర్గ పునర్ వ్యవస్థీకరణ బిల్లు కూడా రాజ్యసభ ముందుకు వచ్చింది*.
ఆర్టికల్ 370; ‘కశ్మీర్‌కు ప్రత్యేకం
*జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 370 పేరిట చేర్చిన తాత్కాలిక నిబంధన ఇది. 1947 అక్టోబరు 26న కశ్మీర్‌ను భారత యూనియన్‌లో విలీనం చేశారు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు అనే మూడు అంశాలకే ఈ విలీనం పరిమితమైంది. విలీనం తుది విధి విధానాలు అప్పటికింకా ఖరారు కాలేదు. వీటిపై 1949 జులైలో నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత షేక్ అబ్దుల్లా భారత ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించారు*. *పర్యవసానంగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం రక్షణ, విదేశీ, ఆర్థిక, కమ్యూనికేషన్ వ్యవహారాలు తప్ప మిగతా వాటిలో కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఇతర చట్టాల్ని అమలుచేయాలంటే రాష్ట్ర సమ్మతిని పార్లమెంటు తీసుకోవాల్సి ఉంటుంది. పౌరసత్వం, ఆస్తిపై హక్కు, ప్రాథమిక హక్కుల విషయంలో రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక చట్టాలు ఉంటాయి. అందువల్ల ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వారు భూముల్ని కొనలేరు. ఆర్టికల్ 360 కింద ఈ రాష్ట్రంలో కేంద్రం ఆర్థిక ఎమర్జెన్సీని విధించలేదు*.