గ్రామ రెవెన్యూ వ్యవస్థ ముఖచిత్రం మార్చాలని భావిస్తున్న ప్రభుత్వం..


ఏ స్థాయి నుంచి మార్పులు చేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంగళవారం వరంగల్‌లో రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌లు గ్రామ రెవెన్యూ వ్యవస్థ సమూల మార్పులపై కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టంతోపాటు వీఆర్‌ఓ వ్యవస్థలో మార్పులు, చేర్పులపై కలెక్టర్ల అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభిప్రాయాలను కూడా వారి ముందుంచినట్లు తెలిసింది. గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) భూ దస్త్రాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీఆర్‌ఏలు కేవలం సహాయ సహకారాలు అందిస్తుండగా తహసీల్దారు నుంచి మిగిలిన సిబ్బందికి వీఆర్‌ఓలే కళ్లు, చెవులుగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో భూ దస్త్రాల నిర్వహణ అంతా కాగితాలపైనే ఎక్కువగా సాగుతోంది. మున్ముందు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే(ధరణి) నిర్వహణ చేపట్టనున్నారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో భూముల విచారణలు, నివేదికలు అందించే ప్రక్రియ తగ్గిపోనున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు సాంకేతికతతో ముడిపడి ఉన్న విధులే ఉండనున్నాయి. అర్హులైన సిబ్బందితోనే క్షేత్రస్థాయిలో పనులు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అర్హులకు పెద్దపీట వేయాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

అర్హులకు భూముల నిర్వహణలో అవకాశం
రాష్ట్రంలో 7,038 వీఆర్‌ఓ స్థానాలు ఉండగా 5,088 మంది సిబ్బంది ఉన్నారు. 24,035 వీఆర్‌ఏ స్థానాలు ఉండగా 22 వేల మంది ఉన్నారు. వీఆర్‌ఓలలో దాదాపు రెండు వేల మంది వరకు ప్రభుత్వం నేరుగా నిర్వహించిన పరీక్షల ద్వారా ఎంపికైన వారు ఉన్నారు. వీఆర్‌ఏలలో కూడా 2700 మంది వరకు ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో నియామకమైన వారున్నారు. మిగిలిన వారిలో వీఆర్‌ఏ నుంచి వీఆర్‌ఓలుగా పదోన్నతులతో వచ్చిన వారు, కారుణ్య నియామకాల ద్వారా ఎంపికైన వారు ఉన్నారు. వీఆర్‌ఏలలో కావలికారు, మస్కూరీ తదితర వ్యవస్థల నుంచి గుర్తింపు లభించిన వారు ఉన్నారు. భూమి విలువైన సంపదగా మారడంతో భూ దస్త్రాల నిర్వహణకు కూడా విలువ పెరిగింది. దీంతో ప్రభుత్వ సేవల్లో భూముల నిర్వహణ అనేది కీలకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం భూముల నిర్వహణ విధానాన్ని పూర్తిగా ఆధునికీకరిస్తుండటంతో సాంకేతికతకు పెద్ద పీట వేయనున్నారు. దీనిలో భాగంగా వీఆర్‌ఓ, వీఆర్‌ఏలలో అర్హులైన వారిని భూ దస్త్రాల నిర్వహణ విధానానికి అనుసంధానం చేసుకుని మిగిలిన వారిని గ్రామ స్థాయిలో అనుబంధంగా ఉన్న శాఖలకు మళ్లించాలని భావిస్తున్నారు. ప్రత్యక్ష పద్ధతుల్లో ఎంపికైన వారికి రోస్టర్‌, సర్వీస్‌ రూల్స్‌, పదోన్నతులు తదితర అంశాల్లో సమస్యలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం రూపొందించిన అనంతరం క్రమంగా జనవరి నాటికి గ్రామ రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

About The Author