బేబి పాటకు బోయిలు వీరే!
బేబి పాటకు బోయిలు వీరే!
మట్టిలో మాణిక్యాల్ని వెదికి పట్టుకోవడం అంత సులభమైన విషయం కాదు. వెదకాలంటే మనసుండాలి. అంతకుమించి కళాతృష్ణతో కూడిన తపన ఉండాలి. అలాంటి మాణిక్యాలను వెదికినా.. వారి గురించి నలుగురికి చెప్పగలిగే ధైర్యం కావాలి. ‘నేను.. నా’ అనే స్వార్థ ప్రపంచాన మరొకరికి మేలు చేయడం అంటే నిజంగానే ఈ రోజుల్లో అదొక వింత. ఇటీవల కాలంలో పల్లెటూరి కోయిలగా వినతికెక్కిన గాయని బేబీని అందరూ ‘మట్టిలో మాణిక్యం’గా పిలుస్తున్నారంటే.. ఆ మాణిక్యాన్ని వెలుగులోకి తెచ్చిన నిస్వార్థమైన మాణిక్యాలూ ఉన్నాయి. ఆ మాణిక్యాల పేర్లే రాణి, వీరబాబు.. నిజానికి వీరిద్దరూ గాయనీ గాయకులే. కానీ, తమ గురించి తాము మరచిపోయి.. మరో గాయనిని ప్రపంచానికి పరిచయం చేశారంటే.. వారికెంతటి సహృదయం ఉండాలి! ఇప్పుడు బేబీ పాట ప్రపంచ నలుమూలల వరకూ చేరినా.. ఆ గొంతులో అవలీలగా పలికే గమకాలు ‘మెగాస్టార్’ వాకిట్లోకి వాలేలా చేసినా.. తెలుగునాట ‘కోటి’ రాగాలై ‘బోల్‌బేబీ బోల్’ అంటూ మారుమోగేలా చేస్తున్నా.. అందుకు అసలు సిసలైన కారకులు ఈ ఇద్దరే. వీళ్ళూ బేబీలాంటి మట్టిలో మాణిక్యాలే. ”ఓ చెలియా.. నా ప్రియసఖియా..’ అంటూ ఎలుగెత్తి పాడుతున్న పల్లెకోయిల పాటను అందరికంటే ముందుగా భుజాన్నెత్తుకుని పల్లకీ మోసిన మేథమెటిక్స్, హిందీ పండిట్ వీరబాబు, మరో పల్లె గొంతుక రాణి పరిచయం ‘జీవన’ పాఠకులకు ప్రత్యేకం.
రాణి ఓ పేదింటి అమ్మాయి. కూలీనాలీ చేసుకునే జీవితమే. ఇద్దరు ఆడపిల్లలతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఒంటరితల్లిగా జీవిక సాగించే ఆడపిల్ల. సొంతూరు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం. బతుకు పోరాటంలో.. పొట్టకూటి కోసం.. వ్యవసాయ పనులు చేసుకోవడానికి దగ్గరలోని వడిశలేరుకు వలసొచ్చింది. అక్కడే చిన్నహోటల్లో పనిచేస్తూ.. తాటాకు బంగ్లాలో నివాసం ఉంటుంది. వ్యవసాయ పనులున్నప్పుడు కూలీగా.. లేనిరోజుల్లో హోటల్లో పనులు చేసుకునే రాణీకి సహజ సిద్ధమైన ‘పాట’ ఓ అలంకారం. బతుకు కోసం కూలిపనులు చేసుకుంటూనే అప్పుడప్పుడు చిన్నచిన్న సంగీత కార్యక్రమాల్లో పాటలు పాడుతుంది. ఇదీ సూక్ష్మంగా రాణి కథ.
పాటకు పట్టం కట్టిన రాణి
బేబీ పక్కింట్లోనే రాణి ఉంటుంది. ఒక మంచిపని కుదరాలంటే.. దానికి వారథి కట్టే సందర్భాలు అతి సామాన్యంగానే మొదలవుతాయి. అలా సాదాసీదాగా మొదలై, కొందరి జీవితాలకవే వెలుగునిస్తాయి. అలాంటిదే ఈ సందర్భం కూడా. బట్టలకుపెట్టే గంజి కోసం.. పక్కింట్లో ఉన్న రాణి దగ్గరకొచ్చింది బేబి. ‘గంజి కావాలమ్మాయి.. పోస్తావా?’ అని అడిగింది. అప్పటికే బేబీ పాటలు పాడుతుందనే అవగాహన ఉండటంవల్ల .. గంజి మాట కాసేపు పక్కనపెట్టి, పాటల ప్రస్తావనలోకి దిగింది రాణి. అది ఇలా సాగింది..
‘అక్కా..! గంజి పోస్తానుగానీ.. నువ్వు బాగా పాటలు పాడతావంట కదా..?! నా కోసం ఏదైనా సినిమా పాట పాడవా?’ అని అడిగితే.. ‘సినిమా పాటలు పెద్దగా రావు.. ఏదైనా ఏసుగీతం పాడతా.. సరేనా?’ అని బదులిచ్చింది బేబి. ‘కాదు కాదు.. నువ్వు నా కోసం సినిమా పాట పాడాల్సిందే..!’ అంటూ పట్టుపట్టింది రాణి. అలా రాణి ప్రేమగా బలవంతం పెట్టడంతో బక్కెట్ పక్కనపెట్టుకునే.. గొంతు సవరించి.. పాటకు సిద్ధమై ‘ఓ చెలియా.. నా ప్రియసఖియా..’ అంటూ సింగిల్‌టేక్‌లో.. తొలిసారిగా రాణి చేతుల మీదుగా వీడియోలోకి ఎక్కింది బేబీ పాట.
‘అక్కతో పాట పాడించాలని అనుకున్నా.. ఎందుకంటే నాకు పాటలంటే ఇష్టం. చిన్నచిన్న ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. అందుకే అక్క ఎలా పాడుతుందో చూడాలని ఆసక్తితో పాడమన్నా.. మొదట తను పాడను.. అని సిగ్గుపడింది’ అంటూ నాటి సందర్భం గురించి ఆసక్తిగా చెప్పుకొచ్చింది రాణి. ‘మా అమ్మాయి కడుపుతో ఉంది కదా..! చికెన్ కూర చేసిపెడతానంటేనే పాడతా!’ అంటూ నాతో సరదాగా షరతు కూడా పెట్టింది. నువ్వు పాడితే.. నిజంగా చికెన్ కూర చేసిస్తా!’ అని అక్కతో సరదా సరదాగా అంటూనే పాట పాడించా. నేనూ పాటలు పాడతాను. కానీ, అక్క పాడిన పాట, పలికే గమకాలు, గొంతు విని ఆశ్చర్యపోయాను. వెంటనే నా తోటి కళాకారుడైన వీరబాబుగారికి ఆ వీడియో వాట్సప్‌లో పంపి.. ”చూడండి సార్..! అక్క ఎంత బాగా పాడిందో?!” అని మెస్సేజ్ పెట్టాను. ఇదంతా సరదాగా చేసిందే’ అంటూ ఎంతో సంబరపడుతూ.. అమాయకంగా చెప్పే రాణి నిజంగానే బేబీ పాటకు తనకు తెలియకుండానే తానో వేదికయ్యింది. అదే.. ప్రపంచాన్ని రాత్రికి రాత్రే తట్టిలేపినంత పనిచేసింది.
వీరబాబుకెయ్యాలి.. వీరతాళ్ళు
బేబీ విషయంలో.. రాణితో పాటు సమానంగా వీరబాబుకీ వెయ్యాలి వీరతాళ్ళు.. ఎందుకంటే.. రాణి వీడియో తీస్తే ఆ వీడియో.. సంచలనం అయ్యింది వీరబాబు చేతుల్లోనే. వీరబాబుది తూర్పు గోదావరి జిల్లా, ఏలేశ్వరం మండలంలోని సిరిపురం గ్రామం. బిఎస్సీ మ్యాథమేటిక్స్, హిందీ భాషాప్రవీణ కోర్సు పూర్తిచేశాడు. రెండుసార్లు డిఎస్సీ ప్రయత్నించినా, ఉద్యోగం రాకపోవడంతో బతుకుతెరువు కోసం స్థానికంగా ఓ ప్రయివేటు కంపెనీలో స్టోర్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్నాడు. స్వతహాగా మంచి స్వరజ్ఞానం, గాత్రం గల ఇతడు ఖాళీ సమయాల్లో బ్యాండ్ పార్టీలు, మ్యూజికల్ ఆర్కెస్ట్రాల్లో పాటలు పాడుతుంటాడు. అలా పరిచయమైన రాణి, వీరబాబు ఆర్కెస్ట్రాల్లో కలిసి పాడుతుంటారు. ముందే అనుకున్నట్టు.. ఒక మంచిపని జరగడం కోసం.. ఎక్కడెక్కడ వాళ్ళో.. అనుకోకుండా కలుస్తారు. అనుకోకుండానే మరొకరికి బాటలు వేస్తారు.
అలా ఇద్దరూ సంగీతరంగంలో స్నేహితులు కావడంతో రాణి తీసిన వీడియో.. వీరబాబుకి చేరింది. వీరబాబుకీ తన వీడియోల కంటే.. తనతో పాడిన కో సింగర్స్ పాటలు పాడుతున్నప్పుడు వీడియోలు తీసి.. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం అలవాటు. రాణి నుంచి వాట్సప్‌లో వచ్చిన బేబీ పాట చూసిన వీరబాబు.. ‘నిజంగానే గొంతులో తేనె నింపుకున్నారీవిడ’ అని మనసులోనే అనుకుని వెంటనే తన ఫేస్‌బుక్ వాల్‌పై పోస్ట్ చేశాడు. తెల్లారేసరికి.. అప్పటిదాకా అతి సామాన్యంగా ఉన్న తన ఫేస్‌బుక్ స్టేటస్ వేలాది మంది చూసేలా మారిపోయింది. పరిశీలించడానికీ సాధ్యం కానన్ని ఫ్రెండ్ రిక్వెస్టులు, మెస్సేజులతో.. ఆ వీడియోకి లక్షలాది వీక్షకుల స్పందన వచ్చింది. వీరబాబుకి ఇదంతా ఏదో మాయలా అనిపించింది.
‘నేను పెట్టిన వీడియోను నా వాల్‌పై లక్షలాది మంది చూడ్డమేకాక.. వేలాది మంది తమ వాల్‌పై, వాట్సప్‌ల్లో షేర్ చేయడంతో.. అది చాలామందికి చేరింది. సినీరంగంలో చిరంజీవి, ఏఆర్ రెహమాన్, కోటి, బాలు, రఘు కుంచె, ప్రవాసాంధ్రులు ఇలా చాలామంది బేబీ పాట విన్నారు. ‘ఆవిడ ఎక్కడుంటుంది..?’ అని నా ఫేస్‌బుక్ మెసెంజర్లో అడగడం మొదలెట్టారు. అలా రఘు కుంచెగారు నా నెంబర్ పట్టుకుని, బేబీ గారి గురించి వివరాలు తెలుసుకున్నారు. అదే సమయంలో ఓ టీవి (హెచ్‌ఎంటీవి) షో ద్వారా.. సంగీత దర్శకులు కోటీగారూ బేబీని లైవ్‌షోలో స్వయంగా ‘బోల్‌బేబీ బోల్’ కార్యక్రమానికి ఆహ్వానించారు’ అంటూ తను షేర్ చేసిన బేబీ వీడియో సంచలనం గురించి ఇప్పటికీ అంతే ఆశ్చర్యంతో, ఉబ్బితబ్బిబైన సంతోషంతో చెప్పాడు వీరబాబు.
వెండితెర పాటైన వేళ!
బేబీ పాట.. వీడియో ద్వారా వెలుగులోకొచ్చిన క్రమంలో తొలుత రఘుకుంచె తన సంగీత దర్శకత్వంలో వస్తున్న ‘పలాస’ సినిమా కోసం రచయిత లక్ష్మీభూపాల రాసిన ‘మట్టిమనిషినండి నేను.. మాణిక్యమ్మన్నారు నన్నూ.. పల్లెకోయిలమ్మ తెల్లవారు కూసే కూతే నా పాట.. పంట చేనులోన పైరుకంకిపైన గాలే నా తాళం.. యేలేలో.. యేలేలో..’ అనే చక్కటి మాధుర్యం గల పాట పాడించడంతో బేబీ ‘ప్లేబ్యాక్ సింగర్’గా ప్రస్థానం ప్రారంభమైంది.
కోటి.. ఆశలు
సినీ పరిశ్రమలో అందరికంటే ముందుగా.. హెచ్‌ఎంటీవి ఛానల్ లైవ్‌షో ద్వారా బేబీని పరిచయం చేసుకున్నారు సంగీత దర్శకులు కోటి. అప్పటి నుంచీ వెన్నంటి ఉంటూ.. బేబీలో మనోధైర్యాన్ని నింపుతూ, సినిమా సంగీతంలో ప్రత్యేక శిక్షణనిస్తూ ఈ రంగంలో ఎందరెందరికో.. పరిచయం చేస్తూ.. అడుగడుగునా ఆసరాగా నిలుస్తున్న కోటి ‘బోల్‌బేబీ బోల్’ పాపులర్ షో కోసం ఇప్పటికే నాలుగు పాటలు పాడించారు. త్వరలో తనుచేసే సినిమాలతోపాటు బేబీ గాత్రంతో ఓ ప్రత్యేక ఆల్బమ్ తీసుకొచ్చే ఆలోచనలోనూ ఉన్నారాయన. అంతేకాదు, తన వంతుగా, స్నేహితుల తరపునా బేబీకి కొంత ఆర్థిక సహాయం అందించడమూ జరిగింది. ‘సినిమా రంగంలో సుశీల, జానకి, చిత్ర ఇలా ఎవరి గాత్రాన్నీ అనుకరించకుండా.. తనదైన గొంతుకతో పాడుతున్న బేబీ స్వరం నిజంగా.. ఓ ప్రత్యేకం. ఆవిడ పలికించే గమకాలు.. ఎంతో శిక్షణ, సాధన ఉంటేగానీ సాధ్యం కాదు. కానీ బేబీ అవలీలగా పాడుతున్నారు’ అంటూ వందలాది సినిమాలకు సంగీతం చేసిన కోటిలాంటి దర్శకుడు బేబీ సంగీత ప్రతిభకు, గాత్రానికి ఓ బ్రాండ్ ఇమేజ్‌ని సంతరింపజేయడం, ప్రోత్సహించడం నిజంగానే అభినందనీయం. కోటి చొరవతోనే మెగాస్టార్ చిరంజీవిని, గాయని జానకమ్మను కలిశారు.. రేపో మాపో రెహమాన్.. ఇలా ఎందరినో కలిసే అవకాశాన్నీ దక్కించుకోనున్నారు బేబి.
నిన్నటిదాకా ఒక పల్లెపట్టున పనీపాటలో.. ఆడుతూ పాడుతూ చడీచప్పుడు లేకుండా.. సాగినపాట.. ఇప్పుడు కొంగ్రొత్త స్వర నైపుణ్యాన్ని దిద్దుకుని.. సుశ్రావ్యమైన గొంతుకుగా మారేందుకు కారణమైన వర్ధమాన గాయనీ గాయకులు రాణి, వీరబాబులిద్దరూ.. ఇప్పుడు వీర విజేతలనే చెప్పాలి. ఎందుకంటే, బేబీ పాటను పల్లకీలో ఉంచి జనాల్లోకి తీసుకొచ్చిన నిజమైన బోయీలు వీరు. బేబీ పాటతో పాటు వీరిద్దరి జీవితాల్లోనూ వెలుగులు విరజిమ్మాలి. ఎవరో ఒకరు వెలుగులోకి తేవాలి.. వారి కళ్లల్లోనూ ఆనందం మెరవాలని కోరుకుందాం!!