35ఏళ్ల జెంటాక్ మాత్రకు కాలం మూడింది..
https://youtu.be/Q0eInOqPxcc
జెంటాక్ మాత్రలు క్యాన్సర్ కారక రసాయనాలు కలిగిఉన్నాయన్న వార్త కలకలం రేపుతోంది. జింటాక్ మాత్రలో ర్యానిటిడిన్‌అనే రసాయనం ఉంది. ఈ ఔషధంలో కేన్సర్ కారక మాలిన్యాలు ఉన్నాయనే వార్తలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. వచ్చిన విషయం తెలిసిందే. ర్యానిటిడిన్ ఔషధాన్ని ప్రధానంగా అసిడిటీని తగ్గించటానికి వినియోగిస్తున్నారు. ఇంటెస్టినల్ అల్సర్లు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ , పలు రకాల జబ్బులను అదుపు చేయటానికి వాడుతున్నారు. ‘అసిడిటీ’… ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో ఎంతోమంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్య. మానసిక ఒత్తిడి, వేళకు భోజనం చేయకపోవటం, ఉష్ణ- శీతల పానీయాలు అతిగా సేవించటం, ఇంకా పలు రకాల కారణాల వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. అసిడిటీ పెరిగిపోతే పొట్ట ఉబ్బరంగా మారటం, అల్సర్లు ఏర్పడటం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి సమయంలో వైద్యులను సంప్రదిస్తే,… వారు సిఫారసు చేసే మందుల్లో ర్యానిటిడిన్ ఒకటి. మూడున్నర దశాబ్దాలకు పైగా ఈ ఔషధం మార్కెట్లో ఉన్నట్లు అవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తయారు చేసిన ‘అత్యవసర ఔషధాల జాబితా’ లో ఉన్న ఔషధాల్లో ర్యానిటిడిన్ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) డాక్టర్ వి.జి.సోమానీ రాష్ట్రాల్లోని ఔషధ నియంత్రణ సంస్థలకు ఒక లేఖ రాశారు. ‘‘రోగుల భద్రతను దృష్టిలో పెట్టుకొని తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవలసిందిగా మీమీ పరిధుల్లోని ఫార్మా కంపెనీలకు సూచించండి’’ అని ఆయన అందులో స్పష్టం చేశారు. అదే సమయంలో మరోపక్క డీసీజీఐ పర్యవేక్షణలో ఔషధ నిపుణుల బృందం ర్యానిటిడిన్ విషయంలో తగిన పరిశీలన చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఈ ఔషధాన్ని వినియోగిస్తున్న రోగులను సంశయంలో పడవేస్తున్నాయి. ఔషధ కంపెనీలు కూడా దీని తయారీని నిలిపివేయటం, ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఔషధాన్ని వెనక్కి తీసుకోవటం, స్వచ్ఛందంగా ఔషధ శాంపిల్స్‌ను ప్రయోగశాలకు పరీక్షల నిమిత్తం పంపించటం… వంటి చర్యలు చేపడుతున్నాయి.
‘జెన్‌ట్యాక్’ బ్రాండుతో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఔషధాన్ని ప్రయోగశాలలో విశ్లేషించినప్పుడు ఎన్‌ఎండీఏ అనే ‘నైట్రోసమైన్ ఇంప్యూరిటీ’ కొద్దిమొత్తంలో కనిపించిందని, దీనివల్ల కేన్సర్ ముప్పు ఉంటుందని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డిఏ) ఈ నెల 9న వెల్లడించింది. ఈ ఔషధాన్ని యూఎస్‌లోని ఫార్మసీల్లో ఓవర్-ద-కౌంటర్ (ఓటీసీ) పద్ధతిలో విక్రయిస్తారు. ఈ ఔషధం వినియోగాన్ని నిలుపు చేయాలని యూఎస్‌ఎఫ్‌డీఏ రోగులకు సూచించలేదు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఆధారంగా వైద్యుల నుంచి సలహా తీసుకోవాలని కోరింది. అంతేగాక ర్యానిటిడిన్ వినియోగం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురైన పక్షంలో తమ దృష్టికి తేవాలని సూచించింది. మరోపక్క ముందు జాగ్రత్త చర్యగా కెనడా ఔషధ నియంత్రణ సంస్థ అయిన హెల్త్ కెనడా, సింగపూర్‌లోని హెల్త్ సైన్సెస్ అథారిటీ ఆఫ్ సింగపూర్ మార్కెట్ నుంచి ఈ ఔషధాన్ని వెనక్కి పిలిపిస్తున్నాయి. ఐరోపా ఔషధ సంస్థ (యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ) సైతం దీనిపై దృష్టి సారించింది.