బిచ్చమెత్తుకుంటూనే చదివాడు.. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో సీటు సంపాదించాడు.!


జయవేల్. చెన్నయ్ లో ఈ పేరొక ప్రభంజనం. వాడవాడలా ఈ యువ కెరటానికి జన నీరాజనం. అంత ఆషామాషీ విజయం కాదది. అతని గురించి చెప్తుంటే వినేవారికే గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఇంతకూ ఎవరా జయవేల్..? ఏం సాధించాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

బిచ్చమెత్తుకుంటేగానీ పూటగడవదు. రోడ్ల మీద అయ్యా అని అడుక్కుంటే తప్ప నాలుగు మెతుకులు నోట్లోకి పోవు. అలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం అంటే అయ్యే పనికాదు. ఒకవేళ కష్టపడి స్కూలుకి వెళ్లినా ప్రాథమిక విద్యతోనే సరిపెట్టుకోవాలి. ఇంతటి దయనీయ స్థితిలో ఉన్న ఓ యాచకురాలి కొడుకు అడ్వాన్సుడ్ మొబైల్ ఇంజినీరింగ్ లో సీటు సాధించడం అంటే మాటలు కాదు. అది కూడా ప్రఖ్యాత లండన్ కేంబ్రిడ్జి యూనివర్శిటీలో అంటే.. కనీసం ఆ సీన్ ఊహకు కూడా అందదు.

దయనీయ స్థితిలో ఉన్న కుటుంబంలోని ఓ 23 ఏళ్ల కుర్రాడు అంతటి ఘనవిజయాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? ఇది తెలియాలంటే ఒక 26 సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి.

అది 1980. వేసిన పంట చేతికి రాలేదు. వేరే గత్యంతరం లేదు. జయవేల్ కుటుంబం పొట్ట చేతపట్టుకుని నెల్లూరు నంచి చెన్నయ్ కి వచ్చింది. రానైతే వచ్చారు. కానీ చేసేందుకు ఏ పనీ దొరకలేదు. ఆకలి ఎంత పనైనా చేయిస్తుంది. అలా ఆత్మాభిమానం చంపుకుని బిచ్చమెత్తడానికి సిద్ధమయ్యారు. ఆకలికి తాళలేక అయ్యా ధర్మం అని ఓ రైతు చేయి చాచాడూ అంటే.. మనతల్లి అన్నపూర్ణ అని చెప్పుకునే ఈ దేశ దౌర్భాగ్యం కాక మరేంటి?

సొంత ఊరు కాదు. సొంత ఇల్లు లేదు. అయినవాళ్లు లేరు. విధి వక్రిస్తే వచ్చి వీధిన పడ్డారు. ఫుట్ పాతే ఇల్లూ వాకిలీ. రోడ్డువారనే జీవితాలు. రాత్రిళ్లు మూసి వున్న షాపుల ముందు కాళ్లు డొక్కలో ముడుచుకుని పడుకునేవాళ్లు. ప్రతీసారీ పోలీసులు వచ్చి తరిమేవాళ్లు.

ఒక్కోసారి విధి మనిషిని ఎంత చిత్రవధ చేస్తుందో జయవేల్ కుటుంబమే ఉదాహరణ. పంచభూతాలనే ఒంటిమీద కప్పుకుని తిరిగిన జయవేల్ తండ్రి గుండె భారంతో కన్నుమూశాడు. అమ్మ జబ్బు ముదిరి పూర్తిగా నేలవాలి పోయింది. ఏం చేయాలో తెలియని అయోమయం. అప్పుడు జయవేల్ కు ఆరేళ్ల వయసు.. ఫుట్ పాత్ మీద అచేతనంగా పడిపోయిన అమ్మ పక్కన గుక్క పట్టి ఏడుస్తున్నాడు.

ఈ దృశ్యం ఉమా మధురమన్ అనే దంపతుల కంట పడింది. కుర్రాడి దీనావస్థ ఆ భార్యాభర్తలను కలచివేసింది. ఎలాగైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఎలా? ఇవాళరేపు సమాజం ఎలా వుందంటే.. అయ్యా ఇదీ సంగతి అని మాటలతో చెప్తే ఎవరూ స్పందించరు. ఒకవేళ ముందుకొచ్చినా అంతగా లాభం వుండదు. అందుకే మాట కంటే దృశ్యం శక్తివంతమైందని భావించారు. అంతలో ఒక మెరుపులాంటి ఆలోచన. కుర్రాడి దైన్యంపై ఒక వీడియో స్టోరీ తీశారు. దానికి పేవ్ మెంట్ ఫ్లవర్ అని పేరుపెట్టారు. చూసిన ప్రతీ ఒక్కరి హృద‌యం ద్రవించిపోయింది.

ఇంకా కలిసొచ్చిన అంశం ఏంటంటే ఉమా మధురమన్ సూయం అనే ఎన్జీవో నడుపుతున్నారు. ఆ ట్రస్ట్ సాయంతో జయవేల్ బడిబాట పట్టాడు. అమ్మకోసం పగలంతా భిక్షాటన. రాత్రంతా చదువు. ఒకవైపు అమ్మ ఆలనా పాలనా. మరోవైపు పరీక్షలకు ప్రిపేరేషన్. ఆకలి, కసి, ఆరాటం, తపన, మొక్కవోని దీక్ష.. రోజులు దొర్లాయి. ఇంటర్మీడియెట్ దాకా వచ్చాడు. ఇక ప్రయాణం ఆపొద్దని నిర్ణయించుకున్నాడు. విజయమో వీరస్వర్గమో తేలిపోవాలనుకున్నాడు. ఆకలిని అణచిపట్టి పుస్తకాలను ఒకపట్టు పట్టాడు. లక్ష్మీ కటాక్షం లేకుంటేనేం.. సరస్వతి అతడిని ఒడిలోకి తీసుకునింది. ప్లస్ టూలో టాప్ ర్యాంకర్ గా నిలిచాడు. విషయం తెలుసుకున్న కొందరు మనసున్న మరాజులు సాయం చేశారు. వాళ్ల చల్లని దీవెనలతో కేంబ్రిడ్జి యూనివర్శిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేశాడు. వెంటనే వేల్స్ లోని గ్లెండ్యూర్ యూనివర్శిటీ ఆటోమోటివ్ ఇంజినీరింగ్ లో సీట్ ఆఫర్ చేసింది.

చెత్తకుండీ పక్కన పడివున్న అమ్మకు సీటు గురించీ ర్యాంకు గురించీ చెప్పాడు. కానీ ఆ పిచ్చితల్లికి అర్ధం కాలేదు. కానీ ఆమె గుండెతడి కన్నీళ్ల రూపంలో వచ్చి ఆశీర్వదించింది.

ప్రస్తుతం జయవేల్ ముందు చాలా లక్ష్యాలున్నాయి. చదువు కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత ఒక ఎన్జీవో రన్ చేయాలి. తనలాంటి అభాగ్యులను, అనాథలను అక్కున చేర్చుకుని, వారికి చదువు చెప్పించాలి. వీధిబాలల జీవితాల్లో మార్పులు తేవాలి. తన జన్మ సార్ధకం చేసుకోవాలి…….!!!

About The Author