కాంట్రాక్టు వ్యవసాయానికి కేంద్రం ఆమోదముద్ర…


తమిళనాడు చట్టానికి అంగీకారం

రైతుల ఆదాయం వృద్ధి చేసే దిశగా దేశంలోనే తొలిసారిగా తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. దీంతో దేశంలోనే తొలిసారిగా కాంట్రాక్టు వ్యవసాయంపై చట్టాన్ని రూపొందించి అమలు చేస్తున్న రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంవర్ధక ఒప్పంద సేవా సదుపాయాల చట్టం పేరుతో ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. పంట దిగుబడి అధికంగా ఉన్న సమయంలో, మార్కెట్‌ ధరల హెచ్చుతగ్గుల వేళ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాంటి పరిణామాలు ఎదురైనపుడు ముందుగా కొనుగోలుదారులతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం ధర చెల్లించడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. ఈ ఒప్పందాలను ఉన్నతాధికారుల సమక్షంలో కుదుర్చుకొనే విధంగా, తప్పకుండా వాటి వివరాలను నమోదు చేసుకునేలా చట్టంలో పొందుపరిచారు. కాంట్రాక్టు వ్యవసాయం చట్టం సక్రమంగా అమలయ్యేందుకు, పనితీరు మెరుగ్గా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడానికి ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ అండ్‌ సర్వీసెస్‌ అథారిటీ పేరుతో ఆరుగురు సభ్యుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది.
… ఈనాడు డిజిటల్‌, చెన్నై

About The Author