దేశంలోనే అద్భుత దివ్యధామంగా యాదాద్రి..!


యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుడి సన్నిధిలో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి..!
* ఉమ్మడి నల్లొండ జిల్లాలో విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి హిందూ ధర్మ ప్రచారయాత్ర ప్రారంభం
* యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న శ్రీ స్వాత్మానందేంద్ర
* స్వామిజీకి ఘనస్వాగతం పలికిన అర్చకులు, అధికారులు
* యాదాద్రి ఆలయ నిర్మాణపనులను పరిశీలించిన స్వామిజీ
* అద్భుత కట్టడమంటూ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు

భారతదేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక, దివ్యధామంగా యాదాద్రి విరాజిల్లబోతుందని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి ఆకాంక్షించారు. నవంబర్ 29, శుక్రవారం నాడు శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి తెలంగాణ హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి నల్లొండ జిల్లాలో ప్రారంభమైంది. యాత్రలో భాగంగా శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని దర్శించుకున్నారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ స్వాత్మానందేంద్రకు ఆలయ ప్రధాన అర్చకులు, ఈవో గీత, ప్రధాన స్థపతి డాక్టర్ ఆనందాచారి వేలు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తదితరులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. బాలాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న శ్రీ స్వాత్మానందేంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు స్వామిజీకి ప్రసాదాలు, చిత్రపటాలు సమర్పించి, ఘనంగా సత్కరించారు. పూజల అనంతరం యాదాద్రిలో జరుగుతున్న నూతన ఆలయ నిర్మాణపనులను శ్రీ స్వాత్మానందేంద్ర పరిశీలించారు. ప్రధానాలయం, మంటపం, గర్భగుడి, బాహ్య ప్రాకారాలు, అంతర ప్రాకారాలు, మాడ వీధులు, పసిడితో తీర్చిదిద్దుతున్న 7 రాజగోపురాలు..ఇలా ప్రతి నిర్మాణం గురించి స్వామిజీకి అధికారులు, ప్రధాన స్థపతులు వివరించారు. ఆలయ వాస్తు శిల్పకళను చూసి స్వామిజీ అచ్చెరువొందారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ.. ధార్మిక వాది అయిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సారథ‌్యంలో ఇంత తక్కువ కాలంలో వేగవంతంగా యాదాద్రి అద్భుత కట్టడంగా రూపుదిద్దుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆగమశాస్త్రాలకు అనుగుణంగా సుందరమైన వాస్తు, శిల్పకళతో యాదాద్రిని నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై స్వామిజీ ప్రశంసలు కురిపించారు. పూర్వం రాజుల కాలంలో ఇలాంటి దేవాలయాలను నిర్మించేవారని..మళ్లీ ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనలోనే ఇంతటి దేవాలయాన్ని నిర్మించడం చూస్తున్నామని కొనియాడారు. మున్ముందు యాదాద్రి భారతదేశంలోనే అద్భుత దివ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని శ్రీ స్వాత్మానందేంద్ర ఆకాంక్షించారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఎంతగానో కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు స్వామిజీ అన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు నల్లంథీఘల్‌ లక్ష్మీనరసింహచార్యులు, ఇతర అర్చకులు, ఆలయ ఈవో గీత, ప్రధాన స్థపతి డాక్టర్ ఆనంద్ వేలు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, హిందూ ధర్మ ప్రచారయాత్ర తెలంగాణ సమన్వయకర్త, టీటీడీ తెలంగాణ సలహామండలి ఉపాధ్యక్షులు సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author