ప్రేమంటే ఏమిటోతెలుసా…?
ప్రేమంటే ఏమిటోతెలుసా…?
అయితే బాద్ షా , శృతి బంధం తెలుసుకోవలసిందే..
క్యాన్సర్ వ్యాధిని అరికట్టేందుకు ఇచ్చే కీమో ట్రీట్ మెంట్ కు భార్యకు వెంట్రుకలు రాలిపోయాయని భర్త గుండు చేయించుకున్నాడు.. ఆమెకు కీమో ఇచ్చిన ప్రతిసారి ఆమెకు తోడుగా గుండు చేయించుకుంటాడు. అసలు ఈ ప్రేమ కదా ఎన్ని మలుపులు తిరిగి , యెంత త్యాగాన్ని కోరిందో తెలుసా…?
ఇద్దరిదీ కేరళలోని త్రిశ్శూర్. 2014లో స్థానికంగా ఉన్న కో ఆపరేటివ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీకాం మొదటి ఏడాదిలో చేరారు ఇద్దరు. అతని పేరు షాన్ ఇబ్రహీం బాద్షా. ఆమె శ్రుతి… చదువు మధ్యలోనే బాద్షాకి ఆర్మీ సెలక్షన్స్ లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. శిక్షణకు వెళ్లేముందు… శ్రుతి ఇంటికెళ్లి ప్రేమ విషయం చెప్పి పెళ్లి ఆలోచనా వివరించాడు. ఆమె తండ్రి ఒప్పుకోలేదు .. కొన్నాళ్లకే ఆమె పీజీలో చేరింది. ఎంత దూరంలో ఉన్నా… ఇద్దరూ మాట్లాడుకునేవారు. అతను శిక్షణ పూర్తి చేసుకునే సమయానికి ఆమె ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆమె అతడిని తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. దాంతో శ్రుతిని కొట్టడమే కాదు గడప దాటకుండా చేశారు. గదిలో బంధించారు. అయినా శ్రుతి అతడినే చేసుకుంటానని పట్టుబట్టింది. అతడింట్లో పరిస్థితి వేరు. ఇద్దరి మతాలు వేరు కావడంతో ‘ఆ అమ్మాయి మతం మారితేనే పెళ్లి చేసుకో’ అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రేమ జంట బయటకు వెళ్లి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అలా 2017 నవంబర్ 1న స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.అతడు ఆర్మీ ఉద్యోగి కావడంతో సికింద్రాబాద్లోని ఆర్మీక్వార్టర్స్లో కాపురం పెట్టారు. ఇంట్లోవాళ్లని నెమ్మదిగా ఒప్పించుకుందాం అనుకున్నారు. కానీ ఇంతలోనే మరో సమస్య వచ్చిపడింది. కొన్నాళ్లకి ఆమెకు గొంతు భాగంలో చిన్న కణితలా వచ్చి వాచిపోయింది. అది క్రమంగా పొట్టకూ పాకింది. అక్కడే ఓ ఆసుపత్రిలో మరిన్ని పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్ కావచ్చన్నారు. చివరకు బయాప్సీ చేసి లింఫోమా క్యాన్సర్ నాలుగోదశలో ఉందని తేల్చారు. క్యాన్సర్ పేరు వినగానే ఇద్దరిమీద పిడుగు పడినట్లు అయ్యింది. ఏదయినా ఆత్మవిశ్వాసంతో జయించొచ్చని నమ్మే శ్రుతి తనకు క్యాన్సర్ అని తెలిసి డీలా పడిపోయింది. కానీ బాద్షా ‘నువ్వు ధైర్యవంతురాలివి. చికిత్సకు నీ శరీరం సహకరించాలంటే నువ్వు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు’ అంటూ ధైర్యం చెప్పాడు. ఇప్పటివరకూ ఆమె పది కీమోథెరపీలు చేయించుకుంది. మరో రెండు మిగిలి ఉన్నాయి. మొదటి రెండు కీమోలు చేయించుకునే వరకూ కాస్త ధైర్యంగానే ఉన్నా ఆ తరువాత జుట్టు రాలడం, ఆమె బలహీనపడటంతో భయపడిపోయింది. దాంతో బాద్షా ‘జుట్టంటూ ఉంటేనే కదా! రాలిపోతే భయపడటానికి. అందుకే గుండు చేస్కో’ అని సలహా ఇచ్చాడు. అలా చెప్పడమే కాదు… ఆమెతోపాటు అతడూ ఎప్పటికప్పుడు గుండు చేయించుకుంటున్నాడు. ఆమె చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చుపెట్టేంత స్థోమత వాళ్లకు లేదు. అందుకోసం తాను ఎన్నో కష్టాలు పడుతున్నాడు. బాద్షా మంచి కళాకారుడు కావడంతో అతడు గీసిన చిత్రాలను ఫేస్బుక్ ద్వారా అమ్మడం మొదలుపెట్టాడు. నవంబర్ 1న వాళ్ల పెళ్లి రోజు కావడంతో ఫేస్బుక్లో ఆ జంట తమ ప్రేమకథను పరిచయం చేసింది. క్షణాల్లోనే అది వైరల్ అయ్యింది. ఎందరో దాతలూ స్పందించి సాయం చేస్తున్నారు. అతడి ప్రేమ, అందరి ఆశీస్సులతో ఆమె దీన్నుంచి బయటపడతానని నమ్ముతోంది. ఇద్దరూ ఆనందంగా ఉండాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుందాం.