ఉన్నదంతా దానం చేస్తే మనం బతికేదెలా: అక్షయ్ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ దాతృత్వం వెల కట్టలేనిది. సమాజంపై ఆయన ప్రేమాభిమానాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అక్షయ్‌కుమార్ కంటే ధనికులైన హీరోలు బాలీవుడ్లో ఎంతో మంది ఉండొచ్చు. కానీ విపత్తు సమయంలో కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకోడానికి సొంత డబ్బు ఇవ్వడానికి చాలా పెద్ద మనసు కావాలి. ఆ మనసు, దేశ ప్రజలపై తనకు ప్రేమ ఉన్నాయని అక్షయ్‌కుమార్ రూ.25 కోట్ల విరాళం ఇవ్వడం ద్వారా నిరూపించారు.
ప్రస్తుతం కరోనా సృష్టిస్తున్న విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పీఎం కేర్స్ ఫండ్‌కి రూ.25 కోట్ల విరాళాన్ని అక్షయ్‌కుమార్ అందించి ప్రధాని మోడీ మొదలుకుని దేశ ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ నటీనటులలో ఇంత అధికమొత్తంలో ఎవరూ విరాళం ప్రకటించలేదు.
అక్షయ్ భారీ విరాళాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆయన భార్య ట్వింకిల్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇంతకూ ఆమె ఎలా స్పందించారంటే…
‘నా భర్త రూ. 25 కోట్లు విరాళం ఇచ్చి నేను ఎంతో గర్వపడేలా చేశారు. అయితే ఆయన ఈ విరాళం ప్రకటించే ముందు నేను కూడా ఒకసారి ఆలోచించుకోమని అన్నాను. ఇంత మొత్తం ఇస్తే.. మనకి కూడా కొంత మనీ అవసరం కదా.. అని అన్నాను’ అని ఆమె ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఒక ఇల్లాలిగా తన కుటుంబ మంచీచెడ్డల గురించి ఆలోచించడం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అలాగే ఇదే ట్వీట్లో తన భర్త ప్రతిస్పందనను కూడా ఆమె ఇచ్చారు. దాని గురించి కూడా తెలుసుకుందాం.
‘దీనికి ఆయన ఏమన్నారంటే.. ‘నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు ఇలాంటి స్థాయిలో ఉన్నానంటే కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఏమీ లేని వారి కోసం ఏదైనా సహాయం చేయకుండా ఎలా ఉండగలను’ అనే సమాధానం ఇచ్చారు..’ అని ట్వింకిల్ ఖన్నా తన ట్వీట్లో తెలిపారు. మొత్తానికి ట్వింకిల్ ట్వీట్ మొత్తం ప్రపంచ దృష్టిని ఆలోచింపజేస్తోంది.