మాంసం, కోడిగ్రుడ్లు, చేపలను సక్రమంగా సరఫరా చేసి ప్రజలకు అందుబాటులో…


మాంసం, కోడిగ్రుడ్లు, చేపలను సక్రమంగా సరఫరా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పశుసంవర్ధక, మత్స్య శాఖ, పోలీసు, రవాణా శాఖల అధికారులతో జిల్లా స్థాయిలో సమన్వయం కోసం నోడల్ అధికారులను నియమించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో మాంసం, చికెన్, చేపల లభ్యత, సరఫరా పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చేవెళ్ళ mp రంజిత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, mla ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, ghmc చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకిల్, పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్, స్నేహ చికెన్ అధినేత రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం నాడు వివిధ మార్కెట్ లలో మాంసం, చికెన్, చేపలు సరైన విధంగా అందుబాటులో లేవని, ఉన్న కొద్దిమాత్రం అధిక ధరలకు విక్రయించారని పలు పిర్యాదులు అందిన నేపద్యంలో సోమవారం అత్యవసరంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ లాక్ డౌన్ నేపద్యంలో గొర్రెలు, మేకల సరఫరా లేని కారణంగా మాంసం ధరలు పెరిగాయని, గొర్రెలు, మేకల సరఫరాకు, విక్రయాలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం ద్వారా మాంసం ధరలను నియంత్రిస్తామని చెప్పారు. ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికావద్దని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో ప్రభుత్వం నిత్యావసర వస్తువులైన కూరగాయలు, పాలు, పండ్లు, కోడి గ్రుడ్లు తదితర సరుకుల రవాణా కు అన్ని రకాల అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. గొర్రెలు, మేకలను జంట నగరాలకు కాని, జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాలకు తీసుకెళ్ళి విక్రయించు కోవడానికి అన్ని రకాల అనుమతులు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. వాహనాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ అన్ని జిల్లాల sp లు, రవాణా శాఖ అధికారులకు సమాచారం అందించే విధంగా dgp కి లేఖ వ్రాయాలని పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రను మంత్రి ఆదేశించారు. పెంపకం దారులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మటన్ విక్రయ దుకాణాలపై అధికారులు తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోశాలల లోని జీవాలకు పశుగ్రాసం కొరత ఉందని పిర్యాదులు అందుతున్నాయని, వెంటనే గోశాలల నిర్వాహకులతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని ఆదేశించారు. పశుగ్రాసం సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, సంచార పశువైద్యశాల సేవలు అందుతున్నాయా? లేదా? అనే విషయాన్ని గోశాలల నిర్వాహకులతో సమీక్షించాలని ఆదేశించారు. అదేవిధంగా మత్స్యకారులు వివిధ నీటి వనరులలో సైజుకు వచ్చిన చేపలను పట్టుకొని విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ సువర్ణను ఆదేశించారు. హైదరాబాద్ కు చెందిన చేపల వ్యాపారులు ఎవరైనా ఇతర జిల్లాలకు వెళ్ళి చేపలు తీసుకొచ్చి విక్రయించు కోవాలనుకుంటే వారికి కూడా అవసరమైన అనుమతులు ఇస్తామని తెలిపారు. చికెన్ దుకాణాలలోని వ్యర్ధాలను తరలించకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ మంత్రి దృష్టికి తీసుకురాగా, స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ చికెన్ దుకాణాలలోని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు తీసుకోవాలని ghmc చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్ ను ఆదేశించారు. చికెన్ పై కొందరు తప్పుడు ప్రచారం చేసిన కారణంగా పౌల్ట్రీ రంగం ఎంతో నష్టపోయిందని, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెంటనే అప్రమత్తమై, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక నిర్ణయాలతో పౌల్ట్రీ రంగం ప్రస్తుతం మెరుగవుతుందని, ఈ యొక్క రంగాన్ని ఆడుకోవడానికి లాక్ డౌన్ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి అధ్యక్షతన మరో సారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తగు విధంగా ఆదుకునేలా ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రి వివరించారు.

About The Author