ఇలాంటి వారిని చూసి నేర్చుకోండి..!
బ్రిటన్ నుంచి పది రోజుల కిందట హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన ఓ యువకుడికి కరోనావైరస్ లక్షణాలు కనిపించలేదు.. ఆయన్ను ఇంటికి వెళ్లిపోవచ్చన్నారు. కానీ ఆయన గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నాడు. ఫలితం.. ‘పాజిటివ్’ వచ్చింది. అక్కడే ఐసొలేషన్ వార్డులో ఉండి చికిత్స పొందుతున్నాడు.
”నాకు వైరస్ ఉందన్న విషయం నాకు తెలియదు. ఒకవేళ ఉంటే ఎవరికీ రాకూడదని అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాను. ఉందన్న విషయం తెలిశాక.. నేను తీసుకున్న జాగ్రత్తలకు నన్ను నేను అభినందించుకున్నాను”.
ఆ యువకుడి పేరు అఖిల్ ఎన్నంశెట్టి. వయసు 24 సంవత్సరాలు. వృత్తిరీత్యా న్యాయవాది. ఎడిన్‌బరో యూనివర్శిటీలో ఉన్నత విద్య చదువుతున్నాడు. బ్రిటన్ నుంచి వచ్చేటపుడు తనకు కరోనావైరస్ సోకలేదని దిలాసాగా తిరగలేదు. అలాగని వైరస్ సోకిందేమోనని బెదిరిపోలేదు. బాధ్యతగా నడుచుకున్నాడు.
జాగ్రత్తలు తీసుకున్నాడు. తనకు తానుగా వెళ్లి పరీక్ష చేయించుకున్నాడు. పాజిటివ్ అని ఫలితం వచ్చాక బెంబేలెత్తలేదు. అయినవాళ్లకి దూరంగా ఒంటరిగా ఉండాల్సి వస్తోందని కుంగిపోలేదు. భయం అవసరం లేదని భరోసా ఇస్తున్నాడు.
అఖిల్.. కరోనావైరస్తో తన పోరాటం, అనుభవాలను మనతో పంచుకున్నాడు. బ్రిటన్ నుంచి భారతదేశానికి రావడానికి దారితీసిన పరిస్థితులు, స్వచ్ఛందంగా పరీక్ష చేయించుకోవడం, ఐసొలేషన్ వార్డులో వాతావరణం, వైద్యసేవల తీరు తదితర అంశాల గురించి వివరించాడు.
జనం సరైన అవగాహనతో, జాగరూకతతో ప్రవర్తిస్తే ఈ వైరస్‌ను జయించవచ్చునని చెప్తున్నాడు. ఆ వివరాలు అఖిల్ మాటల్లోనే..!
బ్రిటన్ నుంచి హఠాత్తుగా ప్రయాణం..
”కరోనావైరస్ నియంత్రణ ప్రణాళికలో భాగంగా బ్రిటన్ మొదట్లో ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ విధానాన్ని పాటించింది. అంటే.. ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ సోకాలని, అప్పుడు వారి రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడుతుందని, తద్వారా వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం వారిలో పెరుగుతుందని భావించింది.
అందువల్లే ఎక్కువ మంది గుమికూడటాన్ని ప్రభుత్వం అడ్డుకోలేదు. విశ్వవిద్యాలయాలు, క్లబ్బులు, స్టేడియాలు, ఇలాంటి ఇతర ప్రదేశాలను మూసేయలేదు. దీంతో వైరస్ ఎక్కువగా వ్యాపించింది.
కానీ పరిస్థితి చేయిదాటిపోతోందని ప్రభుత్వం గ్రహించింది. తన విధానాన్ని మార్చుకుంది. విశ్వవిద్యాలయాలను మూసేసింది. క్రమంగా ‘లాక్డౌన్’ దిశగా చర్యలు మొదలుపెట్టింది.
లాక్డౌన్ సమయంలో బ్రిటన్‌లో ఉండటం మనకు చాలా కష్టమవుతుందని భారతీయ విద్యార్థులు భావించారు. ఇక్కడే ఉందామా, లేదా స్వదేశానికి వెళ్లిపోదామా అనే ఆలోచన మొదలైంది.
ఇంతలోనే.. బ్రిటన్, ఇతర ఐరోపా దేశాల నుంచి వచ్చేవారిని ఎవరినీ మార్చి 18 తర్వాత దేశంలోకి అనుమతించబోమని మార్చి 16న భారత్ హఠాత్తుగా ప్రకటించింది. వెంటనే మాలో చాలా మంది భారత్‌కు టికెట్లు బుక్ చేసుకున్నాం.’’
ప్రయాణంలో జాగ్రత్తలు..
‘‘మార్చి 17న లండన్ హీత్రూ విమానాశ్రయం బయలుదేరి ముంబయి మీదుగా హైదరాబాద్ చేరుకొనే విమానానికి నేను టికెట్ తీసుకున్నా.
చాలా మందికి టికెట్లు దొరకలేదు. వాళ్లు నేటికీ బ్రిటన్‌లోనే చిక్కుకుపోయి ఉన్నారు. భారత్ ఎప్పుడు తలుపులు తెరుస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
బయలుదేరే సమయానికి, నాకు వైరస్ సోకిందనే విషయం ఏ మాత్రం తెలియదు. వైరస్ గురించి నాకూ ఆందోళన ఉందిగానీ భయభ్రాంతులైతే లేవు.
ఈ పరిస్థితుల్లో ప్రయాణంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని నాకు తెలుసు. అందుకు అన్ని విధాలుగా సన్నద్ధమయ్యాను.
సాధ్యమైనంత వరకు ఇతరులకు దూరంగా ఉండేందుకు, వ్యక్తులను, వస్తువులను, ప్రదేశాలను తాకకుండా ఉండేందుకు ప్రయత్నించాను. నిజానికి అందరూ ఇలాంటి జాగ్రత్తలు పాటించారు.”
అమ్మా-నాన్నలకు ముందే చెప్పాను..
‘‘నాలో వైరస్ ఉందో, లేదో తెలియనప్పటికీ.. టికెట్ బుక్ చేసుకొనే సమయంలోనే అమ్మా-నాన్నకు ఒక మాట స్పష్టంగా చెప్పేశాను. కరోనావైరస్ పరీక్ష చేయించుకొని వైరస్ లేదని తేలిన తర్వాతే ఇంటికి వస్తానన్నాను. నన్ను ఇంటికి తీసుకెళ్లడానికి హైదరాబాద్‌కు రావద్దనీ చెప్పాను.
ముంబై విమానాశ్రయంలో చాలా గంటలు ఉన్నాను. అక్కడ నన్ను కలవాలనుకొన్న స్నేహితులకు కూడా రావద్దని ముందే చెప్పాను.
పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నట్లు నాకు అనిపిస్తున్నప్పటికీ.. నేను బయలుదేరే సమయానికి బ్రిటన్‌లో నెలకొన్న పరిస్థితులు కలిగించిన అనుమానంతోనే ఈ జాగ్రత్తలు తీసుకున్నాను.
ఒకవేళ బ్రిటన్‌లోనో, ప్రయాణంలోనో నాకు ఇన్ఫెక్షన్ సోకి ఉంటే.. నా వల్ల ఏ ఒక్కరికీ ఇది వ్యాపించకూడదని కోరుకున్నా. అందుకు తగినట్లుగా నడుచుకున్నా.
ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనేదానిపై ‘ఎమర్జెన్సీ పారామెడిక్’గా బ్రిటన్‌లో పొందిన శిక్షణ నాకు ఉపయోగపడింది.’’
హైదరాబాద్ వచ్చాక.. క్వారంటీన్ అవసరం లేదన్నారు..
”మార్చి 19 తెల్లవారుఝామున హైదరాబాద్ చేరుకున్నాను. గొంతులో కొంచెం నొప్పిగా ఉండటంతో విమానాశ్రయంలో హెల్త్ డెస్క్‌ను సంప్రదించాను. థర్మల్ స్క్రీనింగ్ చేశారు. శరీర ఉష్ణోగ్రత సాధారణంగానే ఉంది.
బ్రిటన్ నుంచి వచ్చిన వారికి ప్రభుత్వ క్వారంటీన్ (ఎవరినీ కలవకుండా, ఎటూ కదలకుండా నిర్దిష్ట కాలం పాటు ఒంటరిగా ఉండటం) తప్పనిసరి కాదని సిబ్బంది చెప్పారు. ఇంటికి వెళ్లిపోవచ్చని, ఇంట్లోనే క్వారంటీన్ పాటించాలని అన్నారు.
ఆ తర్వాత కొన్ని గంటలు ఓ హోటల్లో బస చేశాను. ఎందుకైనా మంచిదని, నాకు దగ్గరగా గాని, నా గదిలోకి గాని ఎవరూ రావద్దని హోటల్ వాళ్లకు చెప్పాను.
కాసేపటి తర్వాత హోటల్ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి చేరుకుని పరీక్ష చేయించుకున్నాను. వైరస్ సోకి ఉండదనే నమ్మకం ఉన్నప్పటికీ, ఇన్ఫెక్షన్ బాధిత దేశం నుంచి వచ్చినందున ఇది సోకిందో, లేదో పరీక్షతోనే తేల్చుకోవాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాను.”
టెస్ట్‌లో నెగటివ్ వస్తుందని అనుకున్నా.. కానీ..
”మరుసటి రోజు ఉదయంలోగా ఫలితం వచ్చింది. ‘పాజిటివ్’. తెలంగాణలో పేషెంట్ నంబర్ 16 నేనే.
ఇన్ఫెక్షన్ సోకి ఉండదని, పరీక్షలో ‘నెగటివ్’ వస్తుందని, వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చని నేను, మా అమ్మా-నాన్న అనుకొంటుండగా ‘పాజిటివ్’ అని వచ్చింది. ఆశ్చర్యం కలిగింది. కానీ నేను షాక్ అవ్వలేదు.
నా జీవితంలోనే అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటైన ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు నాకు నేనే థాంక్స్ చెప్పుకున్నా.
ఎందుకంటే పరీక్ష చేయించుకోకుండా ఇంటికి వెళ్లుంటే, మా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఇరుగుపొరుగుకూ నా నుంచి వైరస్ సోకేది కదా!’’
నా వల్ల ఎవరినీ ఐసొలేషన్‌లో ఉంచాల్సిన అవసరం రాలేదు..
‘‘పరీక్ష ఫలితం వచ్చాక, నేను బస చేసిన హోటల్ వివరాలు అధికారులకు చెప్పి ఇతరుల ఆరోగ్యం దృష్ట్యా దానిని శుభ్రం చేయించాలని కోరాను. విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి నా ప్రయాణ వివరాలు తెలియజేశాను.
నేను తీసుకున్న జాగ్రత్తల వల్ల నా ‘చైన్ ఆఫ్ కాంటాక్స్ట్’ – అంటే నేను కలిసిన వారిలో ఎవరినీ ఐసొలేషన్‌లో ఉంచాల్సిన అవసరం లేదని నిర్ణయించారు.
కరోనావైరస్ మహమ్మారి గురించి నాకు ఉన్న అవగాహన, నాకు ఇతర ఆరోగ్య సమస్యలు లేకపోవడం, యుక్త వయసు కావడం వల్ల నాకు తీవ్రమైన ముప్పు లేదని తెలుసు.
అందువల్లే, ఇన్ఫెక్షన్ ఉందని చెప్పినప్పుడు నాకు ఆందోళన కలగలేదు. వ్యాధి నుంచి ఖచ్చితంగా కోలుకుంటాననే నమ్మకం అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది.”
ఈ పది రోజుల్లో వైరస్ లక్షణాలు పెద్దగా కనిపించలేదు..
”కాస్త గొంతు నొప్పి తప్పితే వైరస్ లక్షణాలు నాలో కనిపించలేదు. ఓ రోజు గడిచాక గొంతు నొప్పి కూడా తగ్గిపోయింది. ఆస్పత్రిలో ఉన్న ఈ పది రోజుల్లో జ్వరంగాని, దగ్గుగాని రాలేదు.
అప్పుడప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతోంది. అలసటగా అనిపిస్తోంది. వ్యాధి లక్షణాలు ఎక్కువగా బయటపడకపోవడమే ఈ వ్యాధి ప్రత్యేకతేమో అనిపిస్తుంది.
నాకు తెలిసి చాలా మంది పేషెంట్ల అనుభవం కూడా ఇదే.
ఈ వ్యాధి రోజులు గడిచే కొద్దీ, పేషెంట్ మనోబలాన్ని పరీక్షిస్తుంది. వైరస్‌తో శరీరం సాగించే పోరాటం మనకు తెలియడం మొదలవుతుంది. ఈ పోరాటం శరీరంలో శక్తిని హరించి వేస్తుంటుంది. నిస్సత్తువ ఆవరిస్తుంటుంది.
అందుకే మనల్ని మనం ఉత్సాహపరచుకోవాలి. మనకు మనం ధైర్యం చెప్పుకోవాలి. ఈ దశలోనే గుండెనిబ్బరంతో ఉండాలి.
మొదటి రోజు నుంచి నేను సానుకూల ఆలోచనలతోనే ఉన్నాను. పక్కన ఉన్న కొందరు పేషెంట్ల పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్నప్పుడు మనకు కూడా కొంచెం కలవరం కలుగుతుంది. ఇలా మన మనోస్థైర్యానికి పరీక్ష ఎదురవుతుంది. మనం మానసికంగా బలంగా ఉండాలి.”
ఆస్పత్రిలో వాతావరణం బాగుంది..
”గాంధీ ఆస్పత్రిలో సానుకూల వాతావరణం ఉంది. పేషెంట్లను నిరుత్సాహపరిచే వాతావరణం లేదు. నేనున్న గది బాగుంది. గది వెంటిలేషన్ కూడా బాగుంది. ఇతర గదులూ శుభ్రంగా ఉన్నాయి. నిర్వహణ చక్కగా ఉంది. బెడ్షీట్లు, వైరస్ వ్యాప్తి నివారణకు ధరించే హజ్మట్ సూట్లు రోజూ మారుస్తారు.
వైద్యులు క్రమం తప్పకుండా మమ్మల్ని చెక్ చేస్తారు. కొందరు హెల్త్‌కేర్ సిబ్బంది నాకు స్నేహితులయ్యారు. వీరిలో కొందరు గ్రాడ్యుయేట్లు ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
నెలకు కేవలం ఎనిమిది వేల రూపాయల వేతనానికి ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వీళ్లు సేవలు అందిస్తున్నారని తెలిశాక నాకు చాలా బాధ కలిగింది. వాళ్ల పరిస్థితిని ట్వీట్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను.
ఎంతో ధైర్యంతో కూడిన వాళ్ల హార్డ్‌వర్క్‌ను ప్రభుత్వం గుర్తిస్తుందని, తగినంత వేతనం ఇస్తుందని ఆశిస్తున్నాను.
మాకు రోజుకు నాలుగు సార్లు పోషకాహారం ఇస్తున్నారు. ఉదయం దక్షిణాది అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి తెలుగువారి భోజనం పెడుతున్నారు. భోజనంతోపాటు ఉడకబెట్టిన గుడ్డు, ఏదైనా పండు ఇస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ స్నాక్స్‌గా ఇస్తున్నారు.”
ఆన్లైన్లో వర్సిటీ క్లాసులు వింటున్నా..
”మా కుటుంబాన్ని, స్నేహితులను మిస్ అవుతున్నాను. మెసేజ్‌లు, కాల్స్ ద్వారా వాళ్లతో టచ్‌లో ఉన్నాను.
వాళ్లను ఎవరినీ కలవకుండా ఆస్పత్రికి వచ్చి పరీక్ష చేయించుకోవాలన్న నా నిర్ణయం పట్ల నేను గర్విస్తున్నా.
భారత్‌లోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న స్నేహితులు నా ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ, నాకు ధైర్యం చెప్తున్నారు.
ఇక్కణ్నుంచే మా యూనివర్శిటీ ఆన్లైన్ క్లాసులు వింటున్నా. అలాగే క్లింటన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నా ‘మానవ హక్కుల ప్రాజెక్టు’ పని కూడా కొనసాగిస్తున్నా.”
మీడియా సెన్సేషలిజంతో భయాందోళనలు..
”మీడియాలో కథనాలు, చర్చలు గమనిస్తే కొన్నిసార్లు మీడియా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని అనిపిస్తోంది. అనవసరమైన సెన్సేషనలిజం – సంచలనాత్మకతతో ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చేస్తున్నట్లు కనిపిస్తోంది.
సోషల్ మీడియా మరో సమస్య సృష్టిస్తోంది. అవగాహన పెంచడం కంటే కూడా తప్పుడు సమాచారంతో అపోహలు, లేనిపోని భయాందోళనలు కలిగిస్తోంది.
వైరస్ వ్యాప్తికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని నమ్మి తన తల్లి ఆందోళన చెందుతున్నారని ఓ పేషంట్ నాతో చెప్పారు.
పేషెంట్లలో చాలా మంది పరీక్ష చేయించుకోక ముందే కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడిపారని విన్నాను. కొందరైతే ఎక్కువ మంది హాజరయ్యే కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.
వాళ్లు సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఇరుగుపొరుగువారికి చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాస్త అవగాహన, బాధ్యతతో మెలిగితే ఇలాంటి పరిస్థితులను నివారించవచ్చు.’’
థర్మల్ స్క్రీనింగ్ ఒక్కటే సరిపోదు..
‘‘థర్మల్ స్రీనింగ్‌లో శరీర ఉష్ణోగ్రత మాత్రమే తెలుస్తుంది. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా లేనంత మాత్రాన వైరస్ సోకలేదని అనుకోవడానికి వీల్లేదు.
నా విషయంలో జరిగింది అదే కదా! ఇప్పుడు ఐసొలేషన్ వార్డులో ఉన్న చాలా మంది విషయంలో ఇలాగే జరిగింది.
అందువల్ల విదేశాల నుంచి వచ్చినవారు నిర్దేశిత కాలంపాటు ఒంటరిగా ఉండటం వారికి, వారి కుటుంబానికి, సమాజానికి, దేశానికి, మొత్తం మానవాళికే మంచిది. లక్షణాలు ఏ మాత్రం కనిపించినా వైద్యాధికారులకు తెలియజేయాలి.
విదేశాల నుంచి వచ్చినవారికి థర్మల్ స్రీనింగ్ మాత్రమే కాకుండా ఇతర పరీక్షలు కూడా చేసి ఉండాల్సింది.’’
కరోనావైరస్ బాధితులను దోషులుగా చూడకూడదు..
‘‘ఈ వ్యాధితో ఆస్పత్రిలో చేరడమనేది సిగ్గు పడాల్సిందేమీ కాదు. వెంటనే ఆస్పత్రిలో చేరితే చాలా మంది ప్రాణాలు కాపాడినవారు అవుతారు. సమాజం కూడా కోవిడ్-19 పేషెంట్లను దోషులుగా చూడకూడదు. వివక్షాపూరితంగా వ్యవహరించకూడదు.
అలా చేస్తే వ్యాధి నయమైన తర్వాత కూడా బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. స్టిగ్మటైజేషన్ను నేను వ్యతిరేకిస్తున్నా. అందుకే నా పేరు, ఇతర వివరాలు ఇక్కడ వెల్లడిస్తున్నా.
కరోనావైరస్ వ్యాప్తి ఒక అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి. దీనిపై మనందరం కలసికట్టుగా పోరాడాలి. ఈ పోరాటాన్ని ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు.
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని అందరినీ కోరుకొంటున్నా.
డిశ్చార్జి చేయాలంటే 48 గంటల్లో వరుసగా రెండుసార్లు కరోనావైరస్ పరీక్షలో ‘నెగటివ్’ రిజల్ట్ రావాలి. తెలంగాణలో ఇంతవరకు ఒక్కరే కోవిడ్-19 నుంచి కోలుకున్నారు.
నేను కూడా ఇంకో వారం రోజుల్లో కోలుకుని డిశ్చార్జి అవ్వొచ్చని భావిస్తున్నా. త్వరలోనే తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాను. ఉత్సాహంగా చేయాల్సిన పనులు, సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి.
థాంక్యూ.
ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి.”