మతం, కులం వద్దని కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు..!


తమ హక్కును గౌరవిస్తూ తమ కొడుకుకు జననం (బర్త్) మొదలు మరణం వరకూ’ ప్రభుత్వం ఇచ్చే ఏ సర్టిఫికెట్ లోనైనా ‘మతం – కులం’ (No Religion – No Caste) లేనివాళ్ళు అని గుర్తింపు ఇవ్వమని కోరుతూ హైదరాబాద్ కు చెందిన రూప, డేవిడ్ దంపతులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ శ్రీ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డిల తో కూడిన ధర్మాసనం వీళ్ళ డిమాండ్ పైన కౌంటర్ దాఖలు చేయమని కోరుతూ జనన మరణ ధ్రువీకరణ అధికారులకు (Register, Census), రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శికి,కొత్తకోట మున్సిపాలిటీ అధికారులకు నోటీసులు పంపింది. తదుపరి విచారణను నాలుగు వారాల గడువు విధించింది. గత సంవత్సరం మార్చి 23న జన్మించిన తమ కొడుకు ఇవాన్ రూడే బర్త్ సర్టిఫికెట్ కోసం కొత్తకోట మున్సిపాలిటీ వెళ్లారు. జనన నమోదు ఫారం లోని కుటుంబ ‘మతం’ అనే కలామ్ నింపితే తప్ప బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని చెప్పడంతో, కులాంతర, మతాంతర వివాహం చేసుకున్న వీళ్ళు మతాన్ని, కులాన్ని విశ్వసించడం లేదు కాబట్టి అందులో ఉన్న ‘కుటుంబ మతం’ అనే కాలామ్ నింపడానికి నిరాకరించారు. ఆ కాలామ్ నింపితే తప్ప బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరని మున్సిపాలిటీ అధికారులు చెప్పడంతో వాళ్ళు జిల్లా కలెక్టర్ మొదలు పై అధికారులను ఆశ్రయించారు. సంవత్సరం గడుస్తున్నా తాము కోరిన పద్ధతుల్లో బర్త్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో వాళ్ళు ఎట్టకేలకు హైకోర్టులో పిల్ ను దాఖలు చేశారు. ఈ దేశంలో కుల,మతాలకు అతీతంగా జీవిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారని, వీటికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాట చరిత్ర కూడా ఉందని, మతాన్ని, కులాన్ని వదులు కుంటామని ఎవరైనా ముందుకు వస్తే వ్యక్తిగత స్థాయిల్లో ఏదో సర్దుబాటు చేస్తూ పరిష్కారం చూపుతున్నారే తప్ప చట్టం చేయడానికి మాత్రం ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. తమిళనాడు కు చెందిన న్యాయవాది ‘ఎం.స్నేహ’ తనకు ఇచ్చే సర్టిఫికెట్ లో No Caste – No religion అనే అప్షన్ ఉండాలని ప్రయత్నిస్తే ఎట్టకేలకు స్థానిక కలెక్టర్ ఆమెకు సర్టిఫికెట్ అందజేశారు కానీ ఆన్లైన్ లో ఏదైనా దరఖాస్తు చేసుకోవాలన్నా మళ్ళీ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది వీరి తరపున పిల్ దాఖలు చేసిన న్యాయవాదులు ఎస్. వెంకన్న, డి. సురేష్ కుమార్ లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన డి.వి.రామకృష్ణ రావు, ఎస్. క్లారెన్స్ కృపాళిని దంపతులు కూడా ఇదే డిమాండ్ పై కోర్టును ఆశ్రయించారు. తమ పిల్లల అడ్మిషన్ సందర్భంగా మతం అనే కాలామ్ నింపితే తప్ప అడ్మిషన్ ఇవ్వమని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. మతం చెప్పడానికి నిరాకరించిన కారణంగా అడ్మిషన్ ఇవ్వకపోవడం సరైనది కాదని కోర్టు చివాట్లు పెట్టడంతో స్కూల్ యాజమాన్యం ఎట్టకేలకు అడ్మిషన్ ఇచ్చింది. కానీ ఆన్లైన్ వ్యవహారాల్లో మతం, కులం అనే కాలం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది కాబట్టి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకునేలా కోర్టు ఆదేశించాలని కోరారు. మతాన్ని నమ్మే హక్కు ఎలాగైతే ఉందో, వాటిని నమ్మకుండా ఉండే హక్కు కూడా రాజ్యాంగమే కల్పించింది కాబట్టి తమ హక్కును గుర్తించాలని వీరు కోరుతున్నారు.

About The Author