ప్లాస్మా థెరపీ అంటే ఏంటి?


ప్లాస్మా థెరపీ అంటే ఏంటి?
రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉన్నవారిపై కోవిడ్-19 వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, వారి శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే, వారిలోని రోగనిరోధక కణాలు (తెల్ల రక్త కణాలు) దాడి చేసి ఆ వైరస్‌ను నాశనం చేస్తాయి. అందుకే, కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వారి రక్తంలో రోగనిరోధక కణాల సంఖ్య బాగా వృద్ధి చెంది ఉంటుంది.

కొందరిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటి వారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి శరీరంలో రోగనిరోధక కణాలను పెంచగలిగితే వ్యాధిని ఎదుర్కొనే వీలుంటుంది. అందుకు పరిష్కారంగా, కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి, అదే వైరస్‌తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ వైద్య విధానాన్నే ప్లాస్మా థెరపీ అంటారు.

స్పష్టమైన నిబంధనలు:
‘ప్లాస్మా ఇచ్చే దాత కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకోవాలి. ఒకట్రెండు సార్లు పరీక్షలు చేసి వారి శరీరంలో వైరస్ లేదని వైద్యులు నిర్థారించాలి. ఆ తర్వాత 14 రోజులు గడిచాక, వారిలో రోగనిరోధక కణాలు సరైన మోతాదులో ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు ఎలీసా పరీక్ష చేస్తారు. అంతా బాగుందని తేలితే, అప్పుడు వారి నుంచి ప్లాస్మాను తీసుకోవాల్సి ఉంటుంది”. కోవిడ్-19 నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి ప్లాస్మాను తీసుకునే ముందు, వారి రక్తం స్వచ్ఛతను వైద్య నిపుణులు పరిశీలిస్తారు. అందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. ఆ మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది.

ప్లాస్మాను ఎలా తీస్తారు?
ఎలాంటి సమస్య లేదని నిర్థారించుకున్న తర్వాత, దాత నుంచి ఆస్పెరిసిస్ అనే విధానం ద్వారా రక్తాన్ని సేకరిస్తారు. ఈ సాంకేతిక విధానంలో రక్తం నుంచి ప్లాస్మా లేదా ప్లేట్‌లెట్లను వేరు చేస్తారు. మిగతా రక్తం మళ్లీ దాత శరీరంలోకి వెళ్లిపోతుంది. ‘ప్లాస్మాలో మాత్రమే రోగనిరోధక కణాలు ఉంటాయి. ఒక దాత నుంచి దాదాపు 800 మిల్లీ లీటర్ల ప్లాస్మా తీస్తాం. దానిని ఒక్కొక్కరికి 200 మి.లీ చొప్పున, నలుగురు రోగులకు ఎక్కించవచ్చు. అందుకే నాలుగు ప్యాకెట్లలో నింపుతాం’ అని వైద్య నిపుణులు వివరించారు. అలా సేకరించిన ప్లాస్మాను కోవిడ్ -19తో బాధపడుతున్న రోగులకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.

ఎంత వేగంగా కోలుకుంటారు?
“సాధారణ జ్వరం, దగ్గు ఉన్నవారికి ప్లాస్మా ఇవ్వాల్సిన అవసరం లేదు. జ్వరం, దగ్గుతో పాటు ఆక్సిజన్ స్థాయి కాస్త తక్కువగా ఉన్నవారికి కూడా ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఆరోగ్యం బాగా క్షీణిస్తున్న వారికి, ఆక్సీజన్ స్థాయి మరీ తక్కువగా ఉండి, పరిస్థితి విషమించే స్థితిలో ఉన్నవారికి ప్లాస్మా ఎక్కించాల్సి ఉంటుంది”. రోగులకు అత్యంత దగ్గరగా పనిచేసే వైద్య సిబ్బందికి కూడా ముందు జాగ్రత్తగా ప్లాస్మాను ఇవ్వొచ్చు.

కన్వాలెసెంట్‌ ప్లాస్మా థెరపీ:
వైరస్‌ బారినపడి కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మాతో చేసే చికిత్సను కన్వాలెసెంట్‌ ప్లాస్మా థెరపీ అంటారు. సాధారణంగా మన శరీరంలోకి బయటి నుంచి వైరస్‌ ప్రవేశించినప్పుడు దాంతో పోరాడేందుకు యాంటీబాడీస్‌ విడుదలవుతాయి. అప్పుడు శరీరం తట్టుకుని నిలబడుతుంది. తట్టుకోలేని శరీరాలు రోగం బారిన పడతాయి. నయమైన తర్వాత కూడా యాంటీబాడీస్‌ రక్తంలో ఉండిపోతాయి. వీటితో చేసే కన్వాలెసెంట్‌ ప్లాస్మా థెరపీ ఒకరకంగా రక్తమార్పిడి లాంటిదే అని వైద్య నిపుణులు తెలిపారు.

ప్లాస్మా థెరపీతో సానుకూల ఫలితాలు:
‘ప్లాస్మా థెరపీ ద్వారా రోగులు కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పేందుకు దీర్ఘకాలిక సమాచారం లేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షల్లో మాత్రం ఒక రోగి కోలుకోవడం ప్రారంభమయ్యేందుకు 48 నుంచి 72 గంటల సమయం పడుతోంది’. కాగా, కోవిడ్-19 బాధితులకు ప్లాస్మా చికిత్సతో సానుకూల ఫలితాలు వస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా వెల్లడవుతోంది. భయంకరమైన ఈ వ్యాధి నుంచి బాధితులను కాపాడగలమనే ఆశలు కలిగిస్తోంది ప్లాస్మా థెరపీ. దీంతో ఆ దిశగా డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారు.

About The Author