కేసీఆర్‌కు పెద్ద సమస్య…


తెలంగాణలో లాక్‌డౌన్ కంటే అసలు సమస్య లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాతే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రం నుంచి దాదాపు 6లక్షల మంది వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో..అగ్రికల్చర్, మాన్యుఫ్యాక్చరింగ్, గ్రానైట్ఇండస్ట్రీ దాకా ఎన్నో రంగాలపై ఎఫెక్ట్ పడే పరిస్థితి కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో రవాణా సదుపాయం లేకపోయినా… లారీల్లో కొందరు.. సైకిళ్లపై కొందరు..నడుస్తూ కొందరు.. సొంత ఊళ్లకు బయలుదేరారు. ఇప్పటికే చాలా మంది తమ సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు. మరికొంత మంది సరిహద్దుల్లో, షెల్టర్లలో గడుపుతున్నారు. లాక్ డౌన్‌ ఎత్తేస్తే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారని, మళ్లీ వస్తారో రారో తెలియదు.
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మందికిపైగా వలస కార్మికులున్నట్లు అంచనా. లాక్ డౌన్ అనౌన్స్ చేసిన వెంటనే 6 లక్షల మంది సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు నిర్వహించిన సర్వేలో 6.47 లక్షల మంది ఉన్నట్లు తేలింది. వీళ్లలో కూడా చాలా మంది లాక్ డౌన్ నుంచి సడలింపులు వచ్చిన వెంటనే సొంత ప్రాంతాలకు వెళ్లి పోయేందుకు సిద్ధమవుతున్నారు. దీని కారణంగా లాక్ డౌన్ నుంచి ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా.. బిల్డింగ్ కన్ స్ట్రక్షన్, వుడ్ వర్క్, హోటల్ బిజినెస్, ప్రైవేటు కంపెనీలు, మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు ఇప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. లక్షలాది మంది కార్మికుల లోటు.. ఈ వ్యాపార రంగాలన్నింటినీ కుదిపేయనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

About The Author