ఒలింపిక్స్ కు సన్నద్ధమవుతున్న తిరుపతి చిన్నోడు…


ఒలింపిక్స్ కు సన్నద్ధమవుతున్న తిరుపతి చిన్నోడు…
8 ఏళ్లకే డాక్టరేట్…
10 వ యేట నాలుగు గిన్నిస్ రికార్డులు…

ఆస్ట్రేలియా క్రికెటర్ గ్రెగ్ చాపెల్ భారత్ క్రికెట్ టీమ్ కు కొంతకాలం కోచ్ గా వ్యవహరించారు కోచ్ హోదాలో భారత్ కు మొదటిసారి వచ్చినప్పుడు మీడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా అత్యుత్తమ క్రీడాకారులు వీధుల నుంచి వస్తారని, వారిని గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు.
తిరుపతికి చెందిన దేవి శ్రీ ప్రసాద్ ఆ కోవకు చెందుతారు. నగరంలో ఈ పేరు తెలియని వారు ఉంటే ఆశ్చర్యమే. గత కొన్నేళ్లుగా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ తిరుపతి పతాకాన్ని అంతర్జాతీయ యవనికపై ఎగరవేసిన బుడతడు ఈ దేవిశ్రీ ప్రసాద్.
తండ్రి లోకనాథం, తల్లి పద్మ, పెద్దమ్మ మీనాప్రభ లకు దేవిశ్రీ నే లోకం…. పంచాయతీరాజ్ శాఖలో డ్రాఫ్ట్ మెన్ గా పనిచేసి రిటైరయిన లోకనాథంకు 55 ఏళ్ల వయసులో కలిగిన సంతానం దేవీశ్రీప్రసాద్. అప్పటివరకు పిల్లల కోసం పడిన ఆరాటం ఆ వయసులో నెరవేరింది… లోకనాథం భార్య పద్మ కు అప్పటికే ఎనిమిది సార్లు గర్భ స్రావం కావడంతో ఇక పిల్లలు పుట్టరన్న ఆందోళనలో ఉండగా పద్మమ్మ గర్భం దాల్చింది… మూడు నెలల పాటు వేలూరు సిఎంసి ఆసుపత్రిలో అడ్మిట్ అయి తగిన జాగ్రత్తలు తీసుకుని దేవిశ్రీ ప్రసాద్ కు జన్మనిచ్చింది… దేవిశ్రీప్రసాద్ గెలుపు పోరాటం అమ్మ గర్భం నుండే ప్రారంభమైంది… దేవిశ్రీప్రసాద్ కుటుంబం సాదా, సీదా మధ్య తరగతి కి చెందినది… కొడుకును ఉన్నత స్థానంలో చూడాలన్న లోకనాథం పట్టుదల పద్మమ్మ ఆశయం వెరసి చిన్నప్పుడే అతనిలోని ప్రతిభను తల్లిదండ్రులు గమనించారు…
చక్రాల బొమ్మలంటే ఎంతో ఇష్టంగా ఆడుకునే దేవిశ్రీప్రసాద్ కాళ్ళకి చక్రాలనే బహుమతిగా ఇచ్చారు… చిన్నతనంలో స్విమ్మింగ్ నేర్పించడానికి తీసుకెళితే స్కేటింగ్ లో చేరుతానని పట్టుబట్టడంతో బిడ్డ కోరికను కాదనలేక చేర్చారు… ఆనాడు కాలికి కట్టిన స్కేటింగ్ చక్రాలు జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ఖండాంతరాలు చుట్టి వస్తాయని వారు ఊహించలేదు… మొదటి పోటీలోనే బంగారు పతకాన్ని సాధించాడు… పట్టుదల మరింత పెరిగింది… అత్యుత్తమ రికార్డులను సాధించాలన్న లక్ష్యంతో ఎస్వీ యూనివర్సిటీలోని ఓ వీధి ని గ్రౌండ్ గా మార్చుకున్నారు… తల్లి పద్మమ్మ చీపురు పట్టి వీధిని శుభ్రం చేయటం, పెద్దమ్మ మీనా ప్రభ అవసరమైన పరికరాలు సిద్ధం చేయడం, తండ్రి లోకనాథం వామప్ ఎక్సర్ సైజులు చేయించడం వీరి దినచర్య… ఉదయం ఐదు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది…
యూనివర్సిటీ తో పరిచయం ఉన్న అందరికీ ఈ కుటుంబం ఎరుకే… కోచ్ లు సహకరించకపోయినా, ప్రభుత్వం సాయం అందించకపోయినా.‌‌.. ప్రతి రోజూ ఆరు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తూ నెలల తరబడి కష్టించారు… శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో కఠోర శ్రమను పడింది ఈ కుటుంబం… ఈ కష్టం ఊరికే పోలేదు… లింబో స్కేటింగ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు… శరీరాన్ని పూర్తిగా నేలకు ఆన్చి 8.7 ఇంచ్ లు ఎత్తు గలిగిన బార్ (కమ్మీల) కింద ముందుకు 100.40 మీటర్ల దూరాన్ని 15.4 సెకన్ల లో, అదే మాదిరిగా వెనుకకు 100. 40 మీటర్ల దూరాన్ని 20.37 సెకన్లలో పూర్తి చేసి రికార్డును సృష్టించాడు.. 53 (నాలుగు చక్రాల) వాహనాల కింద 100 మీటర్ల దూరాన్ని ముందుకు 17.8 సెకన్లలో పూర్తి చేశారు… వెనుకకు 100 మీటర్ల దూరాన్ని 22.59 సెకన్ల లో 2017 వ సంవత్సరంలోనే పూర్తి చేసి ఐదు రకాల ప్రపంచ రికార్డులలో నమోదు అయ్యారు… ఆ ఏడాది అంటే ఎనిమిది సంవత్సరాల వయసులో విదేశీ యూనివర్సిటీ దేవి శ్రీ ప్రసాద్ ప్రతిభని గుర్తించి డాక్టరేట్ ను బహుకరించారు… అప్పటికే 82 ప్రపంచ రికార్డులను ఈ చిచ్చర పిడుగు బద్దలు కొట్టాడు.
ఈ ఊపు తో గిన్నిస్ బుక్ లో ఉన్న రికార్డును బద్దలు కొట్టేందుకు…. అనేక వ్యయ, ప్రయాసల కోర్చి అమరావతికి గిన్నిస్ బుక్ నిర్వాహకులను రప్పించారు… ఆగస్టు 31, 2017వ తేదీ చరిత్ర మర్చిపోలేని రోజు…. పది సంవత్సరాల వయసున్న ఈ పిల్లోడు నాలుగు గిన్నిస్ రికార్డులను బద్దలు చేసి రికార్డులకెక్కాడు… పాలుగారే వయసు, అమ్మ చేతి వేలు పట్టుకుని, నాన్న భుజాలెక్కి అల్లరి, చిల్లరిగా తిరిగే వయస్సులో… ఆటలు, పాటలు, స్నేహితులను మర్చిపోయి… గిన్నిస్ రికార్డు లక్ష్యంగా పని చేసిన ఫలితంగా లింబో స్కేటింగ్ లో 60 సుమోల కింద 115.6 మీటర్ల దూరాన్ని 23.15 సెకన్లలో పూర్తి చేశారు… అదే మాదిరి వెనుకకు 36.7 సెకన్లలో పూర్తిచేశారు…10 ఇంచీల బార్ ల (కమ్మీల) కింద 39.41 సెకన్లు ముందుకు 41.15 సెకన్ల లో వెనుకకు స్కేటింగ్ చేసి నాలుగు గిన్నిస్ రికార్డులను ప్రజలందరి సమక్షంలో పూర్తి చేసిన గట్టి పిండం ఈ దేవి శ్రీ ప్రసాద్.
గురువు అండ లేకుండా… కేవలం ఇంటర్నెట్ పాఠల పై ఆధారపడి సొంతంగా కృషి చేస్తూ… అద్భుతమైన విజయాలు సాధిస్తున్న దేవి ప్రసాద్ కు ప్రభుత్వాల నుంచి అందుతున్న సాయం అంతంత మాత్రమే…. ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టేస్తున్న మన తిరుపతి చిన్నోడు ఒలింపిక్స్ కు సన్నద్ధమవుతున్నారు… అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న దేవిశ్రీప్రసాద్ ఒలింపిక్స్ లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించడమే కాక …. దేశ గౌరవాన్ని నిలబెడతాడన్న విశ్వాసం ఉంది. అన్నట్టు ఈ విద్యార్థి క్రీడల్లోనే కాదు… చదువు లోనూ ముందున్నాడని టీచర్లు చెబుతున్నారు ప్రస్తుతం ఆర్చరీ క్రీడలో సైతం ప్రావీణ్యం పొందటానికి కృషి చేస్తున్న దేవిశ్రీప్రసాద్…. *ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించాలని మనమందరం ఈ చిన్నోడికి శుభాకాంక్షలు తెలియజేద్దాం*.

*కందారపు మురళి*
*ప్రధాన కార్యదర్శి*
*సిఐటియు*
*తిరుపతి*

About The Author